ఉగ్రవాదులతో సంబంధాలు.. నలుగురు ప్రభుత్వ ఉద్యోగులపై వేటు
శ్రీనగర్: ఉగ్రవాదులతో సంబంధాలున్న నలుగురు ప్రభుత్వ ఉద్యోగులపై జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం వేటు వేసింది. నిషిద్ధ ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిదీన్‌కు చీఫ్‌నని ప్రకటించుకున్న సయ్యద్ సలాహుద్దీన్ కుమారుడు, జైల్లో ఉన్న వేర్పాటువాద నాయకుడు బిట్టా కరాటే భార్యతో సహా నలుగురిని ఉద్యోగాల నుంచి తొలగిస్తూ శనివారం జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
భారత్‌కు వ్యతిరేకంగా పని చేస్తూ, తప్పుడు ప్రచారం చేస్తున్న వారితో సంబంధాలుండడంతో వారిని ఉద్యోగుల నుంచి తీసివేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. ఉగ్రవాద సంస్థలతో లింకులుంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ 311 ప్రకారం ప్రభుత్వ పరమైన ఎలాంటి విచారణ చేయకుండా ఉద్యోగాలను తొలగించే అధికారం ప్రభుత్వాలకి ఉంటుంది. వాణిజ్య, పరిశ్రమల శాఖలో పని చేస్తున్న సయ్యద్ అబ్దుల్ ముయీద్, జమ్మూకశ్మీర్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఆఫీసర్ అసాబ్ ఉల్ అర్జామంద్ ఖాన్ (ఫరూక్ అమ్మద్ దార్ అలియాస్ బిట్టా కరాటె భార్య) , కశ్మీర్ యూనివర్సిటీలోని శాస్త్రవేత్తగా పని చేస్తున్న డాక్టర్ ముహీత్ అహ్మద్ భట్, కశ్మీర్ యూనివర్సిటీలోనే అసిస్టెంట్ ప్రొఫసర్‌గా పని చేస్తున్న మజీద్ హుస్సేన్ ఖాద్రిలు ఉద్యోగాలు కోల్పోయారు.
సోంపెరాలోని జమ్మూ కశ్మీర్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ ఇనిస్టిట్యూట్ (జేకేఈడీఐ) కాంప్లెక్స్‌లో జరిగిన పేలుళ్లతో అబ్దుల్ ముయీద్‌కు సంబంధం ఉంటే, అర్జామంద్‌ఖాన్‌కు పాస్‌పోర్టు కోసం తప్పుడు సమాచారం అందించారు. డాక్టర్ ముహీత్ అహ్మద్ భట్ యూనివర్సిటీల్లో విద్యార్థుల్ని భారత్‌కు వ్యతిరేకంగా రెచ్చగొట్టేలా పాఠాలు బోధిస్తూ ఉంటే, మరో ప్రొఫెసర్ మజీద్ హుస్సేన్‌కు నిషిద్ధ లష్కరేతోయిబా సహా పలు ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయి. సయ్యద్ సలాహుద్దీన్ కుమారులు ఇద్దరు గతంలోనే ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. ఇప్పుడు మూడో కుమారుడిపైన కూడా వేటు పడింది. గత ఏడాది నుంచి ఇప్పటివరకు జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం ఉగ్రవాద సంస్థలతో లింకులున్న దాదాపుగా 40 మందిని ఉద్యోగాల నుంచి తొలగించింది.