ఫైళ్లు, ఉద్యోగుల వివరాలు ఆన్లైన్లోకి
ఇందూరు:
జిల్లాల పునర్విభజనలో భాగంగా అన్ని ప్రభుత్వ శాఖల్లో ఫైళ్ల విభజన ప్రక్రియ దాదాపు ముగిసింది. వాటి స్కానింగ్, ఫైళ్ల అప్పగింత అనంతరం రసీదులు తీసుకునే పని కూడా చకచకా సాగుతోంది. అందులో భాగంగానే నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల వారీగా ఫైళ్లు, శాఖల వారిగా ఉద్యోగుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని జాయింట్ కలెక్టర్ రవీందర్రెడ్డి సంబంధిత అధికారులు, ఉద్యోగులను ఆదేశించారు. ఈ మేరకు ఆయన ప్రగతిభవన్లో ఆయా శాఖల అధికారులు, ఉద్యోగులతో సమీక్షించారు. newdistrictformation.telangana.gov.in అనే వెబ్సైట్ను ప్రభుత్వం రూపొందించిందని, ఇందులో వెంటనే వివరాలను నమోదు చేయాలని తెలిపారు. కామారెడ్డి జిల్లాకు సంబంధించిన ఫైళ్లు ఎన్ని పంపించారు..? శాఖల వారీగా పని చేస్తున్న ఉద్యోగుల వివరాలతో పాటు ఖాళీల వివరాలను మొత్తం అందులో నమోదు చేయాలని సూచించారు. శాఖల వారీగా అధికారులకు వారి రాష్ట్ర శాఖల నుంచి పాస్వర్డ్, యూజర్ ఐడీ వస్తుందని, తదనంతరం వివరాలు ఆ వెబ్సైట్లో నమోదు చేయాలన్నారు. ఇంకా ఫైళ్ల విభజన, స్కానింగ్ చేయని శాఖలు వెంటనే ఆ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. డీఆర్వో పద్మాకర్, కలెక్టరేట్ ఏవో గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.