ఐటీ ఉద్యోగాలు పోకుండా ఉండాలంటే ఎలా...
హైదరాబాద్ : ఐటీ సెక్టార్లో ఆటోమేషన్‌కు పెరుగుతున్న డిమాండ్ లక్షల ఉద్యోగాలకు గండి కొట్టనుందన్న నేపథ్యంలో విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానంపై ఎక్కువగా పట్టు సాధించాలని సూచిస్తున్నారు ఐటీ నిపుణులు. ఐటీ విద్యార్థులు మెరుగైన నైపుణ్యాలు అలవర్చుకోవాలని ఇండస్ట్రి నిపుణుడు, ఇన్ఫోసిస్ మాజీ సీఈవో, హెచ్ఆర్ హెడ్ టీవీ మోహన్‌దాస్ పాయ్ పేర్కొన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, ఆండ్రాయిడ్, పైథాన్ లాంటి కోడింగ్ లాంగ్వేజ్‌లపై పట్టు ఉన్నవారికి వచ్చే ఐదేళ్లలో ఉద్యోగాలు ఎక్కడికి పోవని స్పష్టంచేశారు.
ప్రస్తుతం బీటెక్ చదువులు 10వ తరగతి చదివిన విద్యార్థితో సరిపోతుందని, విద్యార్థులు మరింత టెక్నికల్ నాలెడ్జ్‌ను పొందడానికి కేవలం బ్యాచ్‌లర్ డిగ్రీలతో సరిపెట్టుకోకుండా, మాస్టర్ డిగ్రీలను(పోస్ట్-గ్రాడ్యుయేషన్) కూడా చేయాలని సూచించారు. సాంకేతిక పరిజ్ఞానంపై పట్టు సాధించాలని లేకపోతే అసలకే తగ్గిపోతున్న ఉద్యోగాల్లో, ఉద్యోగం సంపాదించడం కష్టతరమవుతుందని హెచ్చరించారు. ప్రతేడాది ఐటీ మార్కెట్లోకి వచ్చే 6.5 లక్షల మందిలో కేవలం 2-2.5లక్షల మంది ఇంజనీర్లే ఉద్యోగాలను సంపాదిస్తున్నారని పాయ్ పేర్కొన్నారు..
ఆటోమేషన్ ప్రభావంతో ఏటా కొత్తగా వచ్చే ఉద్యోగాల్లో ప్రారంభ, మధ్యస్థాయి ఉద్యోగాల్లో 10 శాతం వరకూ కోతపడనుందని పేర్కొన్నారు. గణాంకాల పరంగా చూసుకుంటే ఏటా 2 నుంచి 2.5 లక్షల కొత్త ఉద్యోగాల సృష్టి జరుగుతుంటే, వాటిలో 25వేల నుంచి 50 వేల వరకు ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తుందని చెప్పారు. ఐటీ ఇండస్ట్రిలో మొత్తంలో 45 లక్షల మంది ఐటీ ఉద్యోగులున్నారని, వారిలో 4,50,000 మంది మధ్యస్థాయి ఉద్యోగులేనన్నారు. అయితే ఆటోమేషన్ వల్ల వచ్చే దశాబ్దంలోనే వారిలో సగం మంది ఉద్యోగాలు వదులుకోవాల్సి వస్తుందని తెలిపారు. మధ్యస్థాయి ఉద్యోగుల్లో చాలామంది ఏడాదికి రూ.30 లక్షల నుంచి రూ.70 లక్షల వరకు ఆదాయం సంపాదిస్తున్నారని, ఈ ఖర్చును తగ్గించుకోవడానికి ఐటీ సంస్థలు ఆటోమేషన్‌పై మొగ్గుచూపుతున్నాయని అన్నారు.