వీసీ నియామకంపై తొలగని ప్రతిష్టంభన
కేయూక్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ ఇన్చార్జ వీసీ ప్రొఫెసర్ కె. వీరారెడ్డి రాజీనామా ఆమోదం, కొత్త ఇన్చార్జి వీసీ నియామకంపై ఇంకా ప్రతిష్టం భన తొలగలేదు. ఆయన రాజీనామా చేసి ఆరు రోజులైనా ప్రభుత్వం ఇంకా ఆమోదించలేదు. ఆయన రాజీనామాను ఆమోదించక.. ఇన్చార్జ వీసీ గా మరొకరిని నియమించకపోవడంతో యూనివర్సిటీ పాలన అస్తవ్యస్థంగా మారింది. స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిమిత్తం ఈ నెల 17న ఇన్చార్జి ప్రొఫెసర్ కె.వీరారెడ్డి యూనివర్సిటీకి రాగా ఆయ న చాంబర్లో పీహెచ్డీ అడ్మిషన్ల ఇంటర్వ్యూ లు, ఓ విద్యార్థి నకిలీ అడ్మిషన్ వ్యవహారంపై విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే.
అంతేగాక పలువురు పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకురాగా.. అవి ఇన్చార్జి వీసీగా తాను పరిష్కరించలేనని తేల్చిచెప్పారు. అయినా చేయాల్సిందేనని ఒత్తిడి చేయడంతో మనస్తాపానికి గురైన వీరారెడ్డి తాను ఇన్చార్జి వీసీగా పని చేయలేనని ఉన్నతవిద్యా కార్యదర్శి వికాస్‌రాజ్‌కు, ఉన్నతవిద్యా శాఖమంత్రి జగదీశ్వర్‌రెడ్డికి రాజీనామా లేఖలు సమర్పించారు.
అయితే వారు ఆయన రాజీనామాను ఇంకా ఆమోదించలేదని తెలిసింది. లేఖ ఇచ్చి ఆరు రోజులు గడిచినా ఆయన రాజీనామాను ఆమోదించకపోవడం.. మరో ఇన్చార్జి వీసీని నియమించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇన్చార్జి వీసీగా ఎవరూ లేకపోవటంతో రోటీన్ ఫైళ్లు కూడా పెండింగ్‌లో పడిపోయాయి. డిగ్రీ, పీజీ తదితర పట్టా సర్టిఫికెట్లపై కూడా వీసీ సంతకాలు కావడం లేదు. మొత్తంగా కేయూ పాలన స్థంభించిపోయింది.
ముళ్ల కిరీటంలా ఇన్చార్జి వీసీ పదవి..
ఇదిలా ఉండగా ప్రస్తుతం యూనివర్సిటీలోని అనేక సమస్యల కారణంగా ఇన్చార్జీ వీసీ పదవిని ముళ్లకిరీటంగా భావిస్తున్నారు. దీంతో కేయూ ఇన్చార్జి వీసీగా బాధ్యతలు స్వీకరించేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని తెలిసింది. కాగా ఉన్నత విద్యామండలి చైర్మన్‌గా ఉన్న కేయూ రిటైర్డ్ ప్రొఫెసర్ టి. పాపిరెడ్డికి అదనంగా కేయూకు ఇన్చార్జి వీసీగా నియమిస్తారా ? అనే చర్చ కూడా జోరుగా సాగుతోంది. అయితే ఇందుకు పాపిరెడ్డి కూడా సుముఖంగా లేరని సమాచారం.
ఎవరూ ముందు కు రాకపోతే మళ్లీ కేయూకు ఇన్చార్జి వీసీగా ఉన్నత విద్యాకార్యదర్శి వికాస్ రాజ్(ఐఏఎస్)నే నియమించే అవకాశముంది. ఈ ఏడాది జూలై 10 నుంచి సెప్టెంబర్ 24 వరకు ఆయన కేయూకు ఇన్చార్జి వీసీగా పనిచేశారు. పని ఒత్తిడితో ఆయన ఒక్కసారి కూడా కేయూకు రాకపోవడం.. పట్టా సర్టిఫికెట్ల సంతకాల్లో జాప్యం జరిగింది. ఏదేమైనప్పటికీ యూనివర్సిటీలో నెలకొన్న అనేక సమస్యలను పరిష్కరించాలంటే వీలైనంత త్వరగా రెగ్యులర్ వీసీని నియమించాలనే డిమాండ్ అన్నివర్గాల నుంచి వ్యక్తమవుతోంది. ప్రభుత్వం ఆ దిశగా దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉంది.