30 ఏళ్ల క్రితం ఇండియా ఇలానే ఉండేది..ఇప్పుడు కావలసింది అవే..
పేపర్ తెరిస్తే ఘోరమైన వార్తలు. రక్త సంబంధాల మధ్య కూడా కక్షలు, కార్పణ్యాలు. మానవ సంబంధాలపై విశ్వాసం పోయేలా సంఘటనలు.ఇటువంటి సమయంలో ఒక ట్విటర్ పోస్ట్ చాలామందికి హాయినిచ్చింది. ‘గాయత్రీ... ఇడ్లీలు చేశా. ఇంటికి రా’ అని తన పొరుగింటివారు వాట్సప్ మెసేజ్ పెట్టినసంగతిని మైసూర్‌కు చెందిన ఒక మహిళ షేర్ చేస్తూ తమ కాలనీలో అందరూ ఎంత స్నేహంగా ఉంటారో చెప్పింది. ‘ముప్పై ఏళ్ల క్రితం ఇండియా ఇలాగే ఉండేది’ అని అందరూ రెస్పాండ్ అవుతున్నారు.
ఏం... ఇప్పుడు ఎందుకు అలా ఉండకూడదు? నిజమే. పక్కింటి పాప తలుపు తట్టి ‘బీరకాయ కూర చేసింది అమ్మ. ఇచ్చి రమ్మంది’ అని చెప్తే చాలా బాగుంటుంది. ‘గడి ముందుకేసి కూరగాయలకు వెళుతున్నా. కాస్త చూస్తుండక్కా’ అని ఎదురింటి వాళ్లతో అంటే ‘అదేం భాగ్యం. వెళ్లిరా’ అని సొంతింటి కన్నా ఈ ఇంటి పైనే దృష్టి పెట్టే వాళ్లు దొరికితే మరెంతో బాగుంటుంది. ఇలా ఉండటానికే మనుషులు ఇష్టపడేవాళ్లు. కాని ఇప్పుడు ఇలా ఉండటం ‘భాగ్యం’ అని చెప్పుకునే స్థాయికి చేరుకున్నాం.
మైసూర్లో ఒక కాలనీ
‘గాయత్రి. ఇడ్లీలు చేశా. ఇంటికి రా’ అని తనకు వచ్చిన మెసేజ్‌ను ట్విటర్లో పోస్ట్ చేస్తూ ‘మా కాలనీలో అంతా ఇలాంటి స్నేహమే’ అని గాయత్రి జయరామన్ అనే మైసూర్ జర్నలిస్ట్ ట్వీట్ చేసింది. 20 ఏళ్లుగా పాత్రికేయరంగంలో ఉన్న గాయత్రి ‘హూ మి, పూర్’ అనే పుస్తకం రాసింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే గాయత్రి పక్కింటావిడ ఇడ్లీలకు పిలవడంతో సంతోషపడి తన కాలనీ స్నేహాలన్నీ ట్వీట్లుగా రాసింది.
‘యోగా సెంటర్‌కు రాపిడో బుక్ చేద్దామని ఇంటి బయట నిలబడతానా... ఎవరో ఒకరు దింపడానికి వస్తారు. నా కుక్కపిల్ల నేను బయటికెళ్తే గోల చేస్తుంది. నేను ఇంట్లోనే ఉన్నాననే భావన కలిగించడానికి తలుపు తెరిచి పెట్టి పనుల కోసం బయటకు వెళితే మా కాలనీలో అందరూ కాపలా కాసేవాళ్లే. ఒక రోజు ఒకావిడ బిసిబేలాబాత్ పంపుతారు. నిన్న ఒకామె సాంబార్ పంపింది.
మా కాలనీలో ఒకరి గిన్నెలు మరొకరి వంట గదిలో ఉండటం మామూలే. ఇలాంటి స్నేహాలతో మేమంతా ఉండటం సంతోషంగా ఉంది’ అని రాసింది. దాంతో చాలామంది కనెక్ట్ అయ్యారు. ‘మేము గవర్నమెంట్ క్వార్టర్స్‌లో ఉన్నప్పుడు అందరం ఇలాగే ఉండేవాళ్లం’ అని ఒకరు రాస్తే ‘మైసూర్లో అందరూ ఇలా ఉండొచ్చు.
బెంగళూరులో ఈ వాతావరణం మిస్ అవుతున్నాను’ అని మరొకరు రాశారు.‘ముప్పై ఏళ్ల క్రితం అందరూ ఇలా ఉన్నవాళ్లే. ఇప్పుడెక్కడ’ అని మరొకరు బాధ పడ్డారు. ‘లాక్డౌన్ సమయంలో కొంతకాలం మాత్రం ఇలా ఉన్నారు. ఇప్పుడు మళ్లీ ఎవరి గుహల్లోకి వాళ్లు వెళ్లిపోయారు’ అని మరొకరు రాశారు. ఇరుగు పొరుగుతో స్నేహంగా ఉండటం, ‘ఏం బాబాయ్’ అంటే ‘ఏం అల్లుడూ’ అని పలకరించుకోవడం.. ‘ఆంటీ ఇంటి నుంచి టీ పౌడర్ తీసుకురాపో’ అని పంపించడం కూడా అసాధ్యమైన విషయాలుగా మారిపోతే ఏ ఊతంతో ఏ స్పందనలతో జీవించాలి మనం?
శ్రుతి మించి ప్రైవసీ
పల్లెల్లో అయినా పట్నాల్లో అయినా ప్రతి ఒక్కరూ శ్రుతి మించిన ప్రైవసీలోకి జారుకుంటున్నారు. మొదట ఉమ్మడి కుటుంబాలు వద్దనుకున్నారు. ఆ తర్వాత తల్లిదండ్రుల నుంచి పిల్లలు విడిపోవడం మొదలుపెట్టారు. ఆ తర్వాత ఇరుగు పొరుగు వారిని వద్దనుకుంటున్నారు. కేవలం ఎప్పుడూ ఇళ్లకు కూడా రాని కొందరు స్నేహితులు, పరిచయస్తులు చాలనుకునే స్థితికి చేరుకున్నారు.
‘మన బతుకులో ఎవరి జోక్యం అక్కర్లేదు’ అనే భావనలో ఉన్న సౌకర్యం ఎలా ఉన్నా ‘ఎవరి సాయం, తోడు లేకుండా బతుకు ఎలా ఉంటుంది’ అనే ప్రశ్నకు జవాబు దొరకడం లేదు. ప్రైవసీ పిచ్చి ఒంటరితనంలోకి, ఏకాంతంలోకి, మనకు ఎవరూ లేరని భావనలోకి నెట్టి అభద్రతకు, ఆందోళనకు గురి చేస్తుంది.
‘ఎదుటివారి లోపాలు వెతకడం, జడ్జ్ చేయడం, మనకు హితవు చెప్పిన వారిని కూడా పగవారిని చేసుకోవడం, అనుబంధాలు ఆర్థికపరమైన సాయాలు కోరతాయనే మిషతో అందరినీ దూరం పెట్టడం’ ఇవి నేడు ప్రతి మనిషిని కేవలం కుటుంబ జీవితానికి, కుటుంబ అనుబంధాలకి (అవి కూడా సరిగ్గా ఉంటే) పరిమితం చేస్తున్నాయి. పక్కింటామె ‘ఇడ్లీ తిందూరా’ అని పిలవడమే వార్తగా మారి, అది చదివి ఆనంద బాష్పాలు వచ్చే స్థితికి మనం చేరుకుంటే ఆ తప్పు ఇడ్లీదో చట్నీదో కాదు. మనదే.
ప్రేమ, అభిమానాలే ఇంధనాలు
ఒక దూరప్రయాణం పరిచయస్తులు ఎవరూ లేని రైలులో చేస్తుంటే ఎలా ఉంటుందో, జీవన ప్రయాణం ప్రేమ, అభిమానాలు పంచేవాళ్లు లేకుంటే అలా ఉంటుంది. నలుగురు స్నేహితులతో సాగే పిక్నిక్ యాత్రలా జీవితం ఎందుకు ఉండకూడదు? కనీసం అప్పుడప్పుడన్నా వీధి అరుగుపై ఇరుగు పొరుగుతో కబుర్లు చెప్పుకునే కమ్మదనంతో జీవితం ఎందుకు ఉండకూడదు? పిల్లలు కూడా తల్లిదండ్రులను చూసి ఇరుగు పొరుగు పిల్లలతో స్నేహం చేయడం మానేస్తున్నారు. దీనివల్ల వారి మానసిక ఆరోగ్యం ఎలా ఉండబోతోందో ఆలోచించారా?
(చదవండి: అర్చన... అనుకున్నది సాధించింది)