Restart schools
-
గురుకులాలు తెరుద్దాం!
సాక్షి, హైదరాబాద్: కోవిడ్–19 తీవ్రత తగ్గుముఖం పడుతుండడంతో విద్యా సంస్థల పునఃప్రారంభంపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రత్యక్ష బోధనపై వైద్య, ఆరోగ్య శాఖ సూచనల నేపథ్యంలో, విద్యాశాఖ స్కూళ్లు, కాలేజీలు తెరిచేందుకు ప్రభు త్వానికి ప్రతిపాదనలు సమర్పించింది. ఈ క్రమం లో రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ఉన్న గురుకుల విద్యా సంస్థలను తెరిచే అంశంపై గురుకుల సొసైటీలు సమాలోచనలు చేస్తున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల సొసైటీల్లో వెయ్యికిపైగా విద్యా సంస్థలున్నాయి. వీటిని ప్రత్యేక అనుమతులతో నిర్వహించొచ్చనే అభిప్రాయం ఉంది. వీటి పరిధి లో దాదాపు 4 లక్షల మంది విద్యార్థులున్నారు. అయితే ముందు గా పెద్ద పిల్లలున్నటువంటి జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు తెరిస్తే ఇబ్బందులుండని సొసైటీలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ అంశంపై క్షేత్రస్థాయిలో సమావేశాలు నిర్వహించి స్థానిక పరిస్థితులు, మౌలిక వసతులపై ప్రభుత్వానికి నివేదికఅందించేందుకు సిద్ధమైంది. మంగళవారం రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ, రాష్ట్ర గిరిజన సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ సమావేశం కానున్నా యి. అన్ని విభాగాల అధికారులతో పాటు రీజినల్ కోఆర్డినేటర్లు సమావేశంలో పాల్గొనున్నారు. ఆన్‌లైన్‌తో ఇబ్బందులు రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల విద్యా సంస్థల పరిధిలో 430 జూనియర్ కాలేజీలున్నాయి. వీటిలో 230 జూనియర్ కాలేజీలు 2021–22 విద్యా సంవత్సరంలో ప్రారంభించారు. వీటితో పాటు 60 డిగ్రీ, పీజీ కాలేజీలున్నాయి. దాదాపు 1.2 లక్షల మంది విద్యార్థులున్నారు. ప్రస్తుతం ఈ కాలేజీల్లో ఫస్టియర్ అడ్మిషన్ల ప్రక్రియ చివరి దశకు వచ్చింది. సీనియర్ విద్యార్థులకు ఆన్లైన్ పద్ధతిలో బోధన సాగుతుండగా.. అడ్మిషన్ల ప్రక్రియ పూర్తయిన వెంటనే ఫస్టియర్‌కు కూడా ఆన్లైన్ బోధన ప్రారంభించాలని భావిస్తున్నాయి. అయితే ఆన్లైన్ ద్వారా పిల్లలు పాఠ్యాంశాలపై అవగాహన పెంచుకోవడంలో తడబాటుకు గురవుతున్నట్లు సొసైటీల పరిశీలనలో తేలింది. దీంతో ప్రత్యక్ష తరగతుల ఆవశ్యకత ఉన్నట్లు గుర్తించిన అధికారులు జూనియర్, డిగ్రీ, పీజీ కాలేజీలు తెరిచేందుకు ప్రభుత్వ అనుమతి కోరాలని నిర్ణయించారు. ఈ మేరకు విద్యా సంస్థల వారీగా విద్యార్థుల సంఖ్య, మౌలిక వసతుల పరిస్థితిపై ప్రభుత్వానికి నివేదించనున్నారు. ఇంటర్మీడియెట్, డిగ్రీ విద్యార్థులు కోవిడ్–19 నిబంధనలు పాటిస్తారని, వీరికి తరగతులు నిర్వహించడం కష్టం కాదని అధికారులు భావిస్తున్నారు. కాగా, బోధన, బోధనేతర సిబ్బంది ఇప్పటికే వ్యాక్సిన్ తీసుకున్నారు. దీంతో హాస్టళ్లలో తగిన జాగ్రత్తలు పాటించేలా ఏర్పాట్లు చేసి కాలేజీలు తెరవొచ్చనే చర్చ జరుగుతోంది. మంగళవారం నాటి సమావేశంలో క్షేత్రస్థాయి అధికారుల అభిప్రాయాలను సేకరించాక ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపనున్నట్లు సొసైటీ అధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. -
ఆందోళన తొలగించండి
సాక్షి, అమరావతి: కోవిడ్ నేపథ్యంలో పాఠశాలల పునఃప్రారంభంపై ఆయా రాష్ట్రాలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎన్సీఈఆర్టీ) సూచించింది. కోవిడ్ ప్రభావంతో విద్యలో ముఖ్యంగా పాఠశాల విద్యలో పలు మార్పులు తప్పనిసరి అవుతున్నాయని తెలిపింది. పాఠశాలల పునఃప్రారంభానికి పలు రాష్ట్రాలు ఏర్పాట్లు చేసుకుంటున్న నేపథ్యంలో చర్యలు ఎలా ఉండాలో నిర్దేశించింది. పాఠశాలలు తెరిచాక పిల్లల భద్రత విషయంలో తల్లిదండ్రుల కమిటీలతోపాటు సామాజిక భాగస్వామ్యం అవసరమని వివరించింది. ఇందుకనుగుణంగా చర్యలు చేపట్టాలని తాజాగా రాష్ట్రాలకు స్పష్టం చేసింది. ఎన్సీఈఆర్టీ సూచనలివే.. ► కోవిడ్ వల్ల పిల్లలు, తల్లిదండ్రుల్లో మానసిక ఆందోళన, ఒత్తిడిని నివారించేందుకు ముందుగా వారిని సన్నద్ధులను చేయాలి. టీచర్లు వారికి అవసరమైన పద్ధతుల్లో కౌన్సెలింగ్ చేపట్టాలి. కోవిడ్ సమయంలో అభ్యసన ప్రక్రియల్లో పిల్లల్లో ఏర్పడిన అంతరాలను తగ్గించాలి. ► విద్యా సంవత్సరం ఆలస్యమైనందున ప్రత్యామ్నాయ క్యాలెండర్‌తోపాటు అందుకనుగుణమైన విద్యాభ్యసన పద్ధతులను అవలంబించాలి. ► పాఠశాలలు తెరిచినా, తెరవలేని పరిస్థితులున్నా రెండింటికీ అనుగుణంగా ఈ ప్రత్యామ్నాయ ప్రణాళికలు ఉండాలి. ► సిలబస్, బోధన, పాఠ్యపుస్తకాలు, పరీక్షల నిర్వహణ, మూల్యాంకన విధానాల్లో సరికొత్త విధానాలతో పునర్నిర్మాణం అవసరం. ► ఫలితాల ఆధారిత బోధనాభ్యసన ప్రక్రియ (అవుట్‌కమ్ బేస్డ్ లెర్నింగ్) కోసం సమగ్ర ప్రణాళికలు ఉండాలి. ► ఇంటర్నెట్ ఆధారిత చానెల్, రేడియో, పాడ్‌కాస్ట్, ఐవీఆర్ఎస్, టీవీ, డీటీహెచ్ చానెళ్లను వినియోగించుకోవాలి. ► ప్రత్యామ్నాయ ప్రణాళికల అమలుకు రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణా మండలి (ఎస్సీఈఆర్టీ), డైట్ తదితర విభాగాల వారిని, నోడల్ అధికారులను నియమించాలి. ► కోవిడ్ నేపథ్యంలో తలెత్తిన పరిస్థితుల అనుభవాలను దృష్టిలో పెట్టుకొని టీచర్లు, ప్రధానోపాధ్యాయులలో ప్రత్యామ్నాయ ప్రణాళికలకు తగ్గట్టు సామర్థ్యాలను పెంపొందించాలి. ► స్కూళ్లకు విద్యార్థులు రాలేని పరిస్థితుల్లో చిన్న తరగతుల పిల్లలకు వలంటీర్లు, ఉపాధ్యాయులను నియమించి ఇళ్ల వద్దనే పరీక్షలు రాయించే ఏర్పాట్లుండాలి. ► ఇందుకోసం అన్ని సబ్జెక్టులకు కలిపి ఇంటిగ్రేటెడ్ ప్రశ్నపత్రాల రూపకల్పన అవసరం. ► ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసీటీ), వివిధ ఆన్లైన్ విద్యావేదికలను వినియోగించుకుంటూ ఉపాధ్యాయులు తమంతట తాము నూతన విధానాలను అనుసరించేలా నవీకరించుకోవాలి. -
‘నోటు బుక్స్’ పాట్లు!
పరిగి: పాఠశాలలు పునఃప్రారంభమై నెలరోజులు దాటినా బీసీ సంక్షేమ శాఖ అధికారులు నిద్రమత్తు వీడటంలేదు. ఈ విద్యా సంవత్సరానికి ముందు వేసవి సెలవుల్లోనే పాఠ్య పుస్తకాలు, యూనిఫాంలు అందజేసిన అధికారులు హాస్టల్ విద్యార్థులకు నోటు పుస్తకాలు అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. పాఠశాలలు పునఃప్రారంభమై నెలరోజులు దాటడంతో ఓ పక్క విద్యార్థులపై ఉపాధ్యాయుల ఒత్తిడి పెరుగుతోంది. దీంతో చేసేదేమీ లేక విద్యార్థులు తల్లిదండ్రులపై ఒత్తిడి తెస్తున్నారు. తప్పని పరిస్థితిలో ఒకటి రెండు నోటు పుస్తకాలు తల్లిదండ్రులతో కొనిపించుకుని అన్ని సబ్జెక్టులు అందులోనే రాస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ హాస్టళ్లలో ఇప్పటికే నోటు పుస్తకాలు అందివ్వగా ఒక్క బీసీ వెల్ఫేర్ హాస్టళ్లలో మాత్రమే నోటు పుస్తకాలు ఇవ్వకుండా మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఇదేమని అధికారులను అడిగితే.. తెలంగాణ ఎంబ్లం(గుర్తు)తో కూడిన నోటు పుస్తకాలు ముద్రిస్తున్నాం.. అందుకే ఆలస్యమవుతోందని కారణం చెబుతూ దాటవేస్తున్నారు. జిల్లాలో ఇదీ పరిస్థితి.. జిల్లాలో 47 బీసీ సంక్షేమ వసతి గృహాలున్నాయి. వీటిలో 4,200 విద్యార్థులు ఉంటున్నారు. ఇప్పటివరకూ ఓ ఒక్క హాస్టల్లోనూ నోటు పుస్తకాలు ఇవ్వలేదు. 9, 10 తరగతులకు 12 లాంగ్ నోటు బుక్స్ (200 పేజీలు) 7, 8 తరగతులకు ఆరు చిన్నవి, ఆరు పెద్దవి నోట్సు, 5, 6 తరగతులకు ఆరు పెద్దవి, మూడు చిన్నవి మొత్తం తొమ్మిది నోటు పుస్తకాలు ఇప్పటి వరకు ఇస్తూ వస్తున్నారు. ఈ లెక్కన జిల్లాలో మొత్తం 50 వేల నోటు పుస్తకాలు అవసరమవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం సిలబస్ మారిన నేపథ్యంలో పాఠశాలల్లో గైడ్లు పూర్తిగా నిషేధించారు. ప్రతి సబ్జెక్టుకు క్లాస్‌రూం రన్నింగ్ నోట్సుతోపాటు ఫెయిర్ నోటు పుస్తకాలు అవసరం. దీంతో విద్యార్థులకు గతంలో ఇచ్చే నోటు పుస్తకాలకంటే ఇప్పుడు పెంచాల్సి ఉంటుందని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. మరో వారం రోజులు ఆగాల్సిందే ఇప్పటికే పాఠశాలలు పునఃప్రారంభమై నెల రోజులు దాటగా మరో వారం రోజులకుగాని నోటుపుస్తకాలు రావని అధికారులు పేర్కొంటున్నారు. దీంతో బీసీ సంక్షేమ వసతిగృహాల్లో చదువుతున్న విద్యార్థులు కొంచెం అటూ ఇటూగా నెల పదిహేను రోజుల నుంచీ నోటు పుస్తకాలు లేకుండానే కాలం వెల్లదీస్తున్నారు. నెల రోజులకు సంబంధించిన సిలబస్‌ను ఒకేసారి రాయాల్సి వస్తుందని.. దీంతో విద్యార్థులు చదువుపై ధ్యాస మరిచి రాయటంపైనే దృష్టిపెట్టాల్సి వస్తుందని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా వెంటనే నోటు పుస్తకాలు అందజేయాలని అటు ఉపాధ్యాయులు, ఇటు విద్యార్థులు పేర్కొంటున్నారు. ఈ విషయమై బీసీ సంక్షేమ శాఖ జిల్లా జాయింట్ డెరైక్టర్ రమణారెడ్డిని వివరణ కోరగా.. మరో వారం రోజుల్లో నోటు పుస్తకాలు అందేలా చూస్తామని తెలిపారు.