సాక్షి, హైదరాబాద్: కోవిడ్–19 తీవ్రత తగ్గుముఖం పడుతుండడంతో విద్యా సంస్థల పునఃప్రారంభంపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రత్యక్ష బోధనపై వైద్య, ఆరోగ్య శాఖ సూచనల నేపథ్యంలో, విద్యాశాఖ స్కూళ్లు, కాలేజీలు తెరిచేందుకు ప్రభు త్వానికి ప్రతిపాదనలు సమర్పించింది. ఈ క్రమం లో రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ఉన్న గురుకుల విద్యా సంస్థలను తెరిచే అంశంపై గురుకుల సొసైటీలు సమాలోచనలు చేస్తున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల సొసైటీల్లో వెయ్యికిపైగా విద్యా సంస్థలున్నాయి.
వీటిని ప్రత్యేక అనుమతులతో నిర్వహించొచ్చనే అభిప్రాయం ఉంది. వీటి పరిధి లో దాదాపు 4 లక్షల మంది విద్యార్థులున్నారు. అయితే ముందు గా పెద్ద పిల్లలున్నటువంటి జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు తెరిస్తే ఇబ్బందులుండని సొసైటీలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ అంశంపై క్షేత్రస్థాయిలో సమావేశాలు నిర్వహించి స్థానిక పరిస్థితులు, మౌలిక వసతులపై ప్రభుత్వానికి నివేదికఅందించేందుకు సిద్ధమైంది. మంగళవారం రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ, రాష్ట్ర గిరిజన సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ సమావేశం కానున్నా యి. అన్ని విభాగాల అధికారులతో పాటు రీజినల్ కోఆర్డినేటర్లు సమావేశంలో పాల్గొనున్నారు.
ఆన్‌లైన్‌తో ఇబ్బందులు
రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల విద్యా సంస్థల పరిధిలో 430 జూనియర్ కాలేజీలున్నాయి. వీటిలో 230 జూనియర్ కాలేజీలు 2021–22 విద్యా సంవత్సరంలో ప్రారంభించారు. వీటితో పాటు 60 డిగ్రీ, పీజీ కాలేజీలున్నాయి. దాదాపు 1.2 లక్షల మంది విద్యార్థులున్నారు. ప్రస్తుతం ఈ కాలేజీల్లో ఫస్టియర్ అడ్మిషన్ల ప్రక్రియ చివరి దశకు వచ్చింది. సీనియర్ విద్యార్థులకు ఆన్‌లైన్ పద్ధతిలో బోధన సాగుతుండగా.. అడ్మిషన్ల ప్రక్రియ పూర్తయిన వెంటనే ఫస్టియర్‌కు కూడా ఆన్‌లైన్ బోధన ప్రారంభించాలని భావిస్తున్నాయి. అయితే ఆన్‌లైన్ ద్వారా పిల్లలు పాఠ్యాంశాలపై అవగాహన పెంచుకోవడంలో తడబాటుకు గురవుతున్నట్లు సొసైటీల పరిశీలనలో తేలింది.
దీంతో ప్రత్యక్ష తరగతుల ఆవశ్యకత ఉన్నట్లు గుర్తించిన అధికారులు జూనియర్, డిగ్రీ, పీజీ కాలేజీలు తెరిచేందుకు ప్రభుత్వ అనుమతి కోరాలని నిర్ణయించారు. ఈ మేరకు విద్యా సంస్థల వారీగా విద్యార్థుల సంఖ్య, మౌలిక వసతుల పరిస్థితిపై ప్రభుత్వానికి నివేదించనున్నారు. ఇంటర్మీడియెట్, డిగ్రీ విద్యార్థులు కోవిడ్–19 నిబంధనలు పాటిస్తారని, వీరికి తరగతులు నిర్వహించడం కష్టం కాదని అధికారులు భావిస్తున్నారు. కాగా, బోధన, బోధనేతర సిబ్బంది ఇప్పటికే వ్యాక్సిన్ తీసుకున్నారు. దీంతో హాస్టళ్లలో తగిన జాగ్రత్తలు పాటించేలా ఏర్పాట్లు చేసి కాలేజీలు తెరవొచ్చనే చర్చ జరుగుతోంది. మంగళవారం నాటి సమావేశంలో క్షేత్రస్థాయి అధికారుల అభిప్రాయాలను సేకరించాక ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపనున్నట్లు సొసైటీ అధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment