‘నోటు బుక్స్’ పాట్లు! | bc students facing problems with not supplied note book | Sakshi
Sakshi News home page

‘నోటు బుక్స్’ పాట్లు!

Published Wed, Jul 16 2014 1:38 AM | Last Updated on Wed, Mar 28 2018 11:05 AM

bc students facing problems with not supplied note book

 పరిగి: పాఠశాలలు పునఃప్రారంభమై నెలరోజులు దాటినా బీసీ సంక్షేమ శాఖ అధికారులు నిద్రమత్తు వీడటంలేదు. ఈ విద్యా సంవత్సరానికి ముందు వేసవి సెలవుల్లోనే పాఠ్య పుస్తకాలు, యూనిఫాంలు అందజేసిన అధికారులు హాస్టల్ విద్యార్థులకు నోటు పుస్తకాలు అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. పాఠశాలలు పునఃప్రారంభమై నెలరోజులు దాటడంతో ఓ పక్క విద్యార్థులపై ఉపాధ్యాయుల ఒత్తిడి పెరుగుతోంది. దీంతో చేసేదేమీ లేక విద్యార్థులు తల్లిదండ్రులపై ఒత్తిడి తెస్తున్నారు.

తప్పని పరిస్థితిలో ఒకటి రెండు నోటు పుస్తకాలు తల్లిదండ్రులతో కొనిపించుకుని అన్ని సబ్జెక్టులు అందులోనే రాస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ హాస్టళ్లలో ఇప్పటికే నోటు పుస్తకాలు అందివ్వగా ఒక్క బీసీ వెల్ఫేర్ హాస్టళ్లలో మాత్రమే నోటు పుస్తకాలు ఇవ్వకుండా మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఇదేమని అధికారులను అడిగితే.. తెలంగాణ ఎంబ్లం(గుర్తు)తో కూడిన నోటు పుస్తకాలు  ముద్రిస్తున్నాం.. అందుకే ఆలస్యమవుతోందని కారణం చెబుతూ దాటవేస్తున్నారు.  

 జిల్లాలో ఇదీ పరిస్థితి..
 జిల్లాలో 47 బీసీ సంక్షేమ వసతి గృహాలున్నాయి. వీటిలో 4,200 విద్యార్థులు ఉంటున్నారు. ఇప్పటివరకూ ఓ ఒక్క హాస్టల్‌లోనూ  నోటు పుస్తకాలు ఇవ్వలేదు. 9, 10 తరగతులకు 12 లాంగ్ నోటు బుక్స్ (200 పేజీలు) 7, 8 తరగతులకు ఆరు చిన్నవి, ఆరు పెద్దవి నోట్సు, 5, 6 తరగతులకు ఆరు పెద్దవి, మూడు చిన్నవి మొత్తం తొమ్మిది నోటు పుస్తకాలు ఇప్పటి వరకు  ఇస్తూ వస్తున్నారు. ఈ లెక్కన జిల్లాలో మొత్తం 50 వేల నోటు పుస్తకాలు అవసరమవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం సిలబస్ మారిన నేపథ్యంలో పాఠశాలల్లో గైడ్లు పూర్తిగా నిషేధించారు. ప్రతి సబ్జెక్టుకు క్లాస్‌రూం రన్నింగ్ నోట్సుతోపాటు ఫెయిర్ నోటు పుస్తకాలు అవసరం. దీంతో విద్యార్థులకు గతంలో ఇచ్చే నోటు పుస్తకాలకంటే ఇప్పుడు పెంచాల్సి ఉంటుందని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు.

 మరో వారం రోజులు ఆగాల్సిందే
 ఇప్పటికే పాఠశాలలు పునఃప్రారంభమై నెల రోజులు దాటగా మరో వారం రోజులకుగాని నోటుపుస్తకాలు రావని అధికారులు పేర్కొంటున్నారు. దీంతో బీసీ సంక్షేమ వసతిగృహాల్లో చదువుతున్న విద్యార్థులు  కొంచెం అటూ ఇటూగా నెల పదిహేను రోజుల నుంచీ నోటు పుస్తకాలు లేకుండానే కాలం వెల్లదీస్తున్నారు. నెల రోజులకు సంబంధించిన సిలబస్‌ను ఒకేసారి  రాయాల్సి వస్తుందని.. దీంతో విద్యార్థులు చదువుపై ధ్యాస మరిచి రాయటంపైనే దృష్టిపెట్టాల్సి వస్తుందని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా వెంటనే నోటు పుస్తకాలు అందజేయాలని అటు ఉపాధ్యాయులు, ఇటు విద్యార్థులు పేర్కొంటున్నారు. ఈ విషయమై బీసీ సంక్షేమ శాఖ జిల్లా జాయింట్ డెరైక్టర్ రమణారెడ్డిని వివరణ కోరగా.. మరో వారం రోజుల్లో నోటు పుస్తకాలు అందేలా చూస్తామని తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement