Restructuring
-
సైయంట్ సీఈవోగా కార్తీక్ నటరాజన్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సైయంట్ కొత్త సీఈవోగా కార్తీక్ నటరాజన్ నియమితులయ్యారు. ఆయన ప్రస్తుతం చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా, ఈడీగా ఉన్నారు. ఇప్పటివరకూ సీఈవోగా ఉన్న కృష్ణ బోదనపు ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్, ఎండీగా పదోన్నతి పొందారు. ఏరోస్పేస్ తదితర విభాగాల గ్లోబల్ హెడ్ ప్రభాకర్ అట్ల.. సీఎఫ్‌వోగా నియమితులయ్యారు. సంస్థను 2 విభాగాలుగా విడదీసే పునర్వ్యవస్థీకరణ ప్రణాళికను కూడా సైయంట్ డైరెక్టర్ల బోర్డు ఆమోదించింది. సైయంట్ డీఎల్ఎం(డిజైన్ లెడ్ మాన్యుఫాక్చరింగ్) వ్యాపార విభాగం పబ్లిక్ ఇష్యూకి వచ్చే దిశగా సెబీకి ప్రాస్పెక్టస్‌ను సమర్పించింది. సైయంట్ డీఎల్ఎంకి ఆంటోనీ మాంటల్బానో సీఈవోగా వ్యవహరిస్తారు. -
పార్లమెంటరీ స్థాయీ సంఘాల పునర్వ్యవస్థీకరణ
న్యూఢిల్లీ: పలు పార్లమెంటరీ స్థాయీ సంఘాలను కేంద్ర ప్రభుత్వం మంగళవారం పునర్వ్యస్థీకరించింది. చైర్మన్ పదవులు అధికార బీజేపీ, మిత్రపక్షాలకే దక్కాయి. ప్రతిపక్షాలకు మొండిచెయ్యి ఎదురయ్యింది. ఇన్నాళ్లూ వివిధ స్టాండింగ్ కమిటీలకు చైర్మన్‌గా పనిచేసిన ప్రతిపక్ష ఎంపీలను తొలగించారు. హోంశాఖ స్టాండింగ్ కమిటీ చైర్మన్ పదవి నుంచి కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మనూ సింఘ్వీని తొలగించి, బీజేపీ ఎంపీ బ్రిజ్ లాల్‌ను నియమించారు. ఐటీ శాఖ స్టాండింగ్ కమిటీ చైర్మన్ పోస్టు నుంచి కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్‌ను తొలగించారు. షిండే వర్గం శివసేన ఎంపీ ప్రతాప్రావు జాదవ్‌ను నియమించారు. ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ స్టాండింగ్ కమిటీ చైర్మన్ పోస్టు నుంచి సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ రామ్‌గోపాల్ యాదవ్‌ను పక్కనపెట్టారు. పరిశ్రమలపై స్టాండింగ్ కమిటీ చైర్మన్ పదవి తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) నుంచి డీఎంకే చేతుల్లోకి వెళ్లిపోయింది. పార్లమెంట్లో మూడో అతిపెద్ద పార్టీ, రెండో అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ అయిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి కనీసం ఒక్క చైర్మన్ పదవి లభించలేదు. -
అదానీ గ్రూప్ పునర్వ్యవస్థీకరణ
ముంబై: ప్రయివేట్ రంగ సంస్థ అదానీ గ్రూప్ ఎయిర్పోర్ట్ బిజినెస్‌లలో పునర్వ్యవస్థీకరణ చేపట్టింది. ముంబై ఎయిర్‌పోర్ట్స్ సీఈవో ఆర్కే జైన్‌ను ఎయిర్‌పోర్ట్స్ సీఈవోగా ఎంపిక చేసింది. నాన్‌ఏరో బిజినెస్ అదానీ ఎయిర్పోర్ట్ హోల్డింగ్స్(ఏఏహెచ్ఎల్)కు బెన్ జండీని సీఈవోగా నియమించింది. గత వారం ముంబై ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్(ఎంఐఏఎల్) మేనేజ్మెంట్ను అదానీ ఎంటర్‌ప్రైజెస్‌కు అనుబంధ సంస్థ అయిన ఏఏహెచ్ఎల్ సొంతం చేసుకున్న నేపథ్యంలో తాజా మార్పులకు శ్రీకారం చుట్టింది. ఏఏహెచ్ఎల్ ప్రెసిడెంట్ ప్రకాష్ తుల్సియానీ ఎంఐఏఎల్ సీఈవోగా బాధ్యతలు స్వీకరించనున్నారు. అంతేకాకుండా ఈ సంస్థ ప్రధాన కార్యాలయాన్ని అహ్మదాబాద్ నుంచి ముంబైకు మారుస్తోంది. త్వరలో ప్రారంభంకానున్న నవీ ముంబై ఎయిర్‌పోర్టులో ఎంఐఏఎల్‌కు 74 శాతం వాటా ఉంది. గతేడాది ఆగస్ట్‌లో జీవీకే గ్రూప్‌నకు ముంబై ఎయిర్‌పోర్ట్‌లో గల వాటాను కొనుగోలు చేయనున్నట్లు అదానీ గ్రూప్ ప్రకటించింది. ముంబై చత్రపతి శివాజీ మహరాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో అదానీ గ్రూప్ 74 శాతం వాటాను సొంతం చేసుకుంది. -
నగర సుందరీకరణ, పునర్నిర్మాణంపై దృష్టి
విశాఖ రూరల్: నగర సుందరీకరణ, పునర్నిర్మాణ పనులపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. తుపాను సహాయక చర్యలు, పునరుద్ధరణ పనులపై ఉత్తరాంధ్ర జిల్లాల అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో సోమవారం కలెక్టరేట్లో సమీక్షించారు. ఈసందర్భంగా సీఎం మాట్లాడుతూ నగరంలో కనీసం 2 వేల గృహాలతో అన్ని రకాల మౌలిక సదుపాయాలతో ఒక కాలనీని అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు పంపించాలని చెప్పారు. ఐఏవై, రాష్ట్ర ప్రభుత్వ నిధులు, ఎంపీ ల్యాడ్స్ నిధులతో ఒక్కో జిల్లాలో రెండు, మూడు మోడల్ కాలనీలు నిర్మిస్తామని వెల్లడించారు. 4జీ కనెక్టవిటీ అన్ని గ్రామాలకు 10 నుంచి 15 ఎంబీపీఎస్ సామర్థ్యంతో అందించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో వ్యవసాయ కనెక్షన్లు మినహా పారిశ్రామిక, గృహ, వాణిజ్య కనెక్షన్లన్నింటికీ విద్యుత్‌ను పునరుద్ధరించామని ఇందన శాఖ కార్యదర్శి అజేయ్‌జైన్ సీఎంకు వివరించారు. విశాఖలో భూగర్భంలో విద్యుత్ లైన్లు వేసేందుకు రూ.1465 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశామని తెలిపారు. విశాఖ జిల్లాలో 34,180 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయని, ఈ పంటలకు ఇన్పుట్ సబ్సిడీ కింద రూ.49.18 కోట్లు 1.55 లక్షల మంది రైతులకు చెల్లించాల్సి ఉందని జిల్లా కలెక్టర్ ఎన్.యువరాజ్ వివరించారు. విశాఖలో మత్స్యకారులకు తగిన పరిహారం చెల్లించేందుకు చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. స్వల్ప వ్యవధిలో సాధారణ పరిస్థితులను పునరుద్ధరించేందుకు తోడ్పడిన మూడు జిల్లాల అధికారులను అభినందించారు. సమావేశంలో మంత్రులు సి.హెచ్.అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు, కిమిడి మృణాళిని, పి.నారాయణ, పల్లె రఘునాథరెడ్డి, రావెళ్ల కిషోర్‌బాబు, ప్రభుత్వ విప్ కూన రవికుమార్, ఎంపీలు కె.హరిబాబు, కింజరపు రామ్మోహన్నాయుడు తదితరులు పాల్గొన్నారు. -
కొంత మందిని తప్పిస్తాం
సీఎం సిద్ధరామయ్య బెంగళూరు: పునఃవ్యవస్థీకరణలో భాగంగా కొంత మందిని మంత్రి మండలి నుంచి తప్పిస్తామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టం చేశారు. అదేవిధంగా మరి కొంత మంది మంత్రిత్వశాఖలను మారుస్తామని తెలిపారు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఢిల్లీ వెళ్లిన ఆయన అక్కడ మీడియాతో ఈ వాఖ్యలు చేశారు.