results of the municipal elections
-
మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల ఎన్నికల ఫలితాలు సోమవారం వెలువడనున్నాయి. అభ్యర్థుల భవితవ్యం తేలిపోనుంది. మున్సిపాలిటీలకు ఎన్నికలు మార్చి 30న జరిగాయి. ఆరు మున్సిపాలిటీల్లో 189 వార్డులు ఉండగా, ఆదిలాబాద్‌లోని 34వ వార్డు, భైంసాలోని మూడో వార్డు ఏకగ్రీవమయ్యాయి. మిగతా 187 వార్డులకు ఎన్నికలు జరగ్గా, ఓట్ల లెక్కింపు సోమవారం ఉదయం 8 గంటల నుంచి నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఒక్కో మున్సిపాలిటీలో ఒక్కో వార్డుకు పోటీ చేస్తున్న అభ్యర్థులవారీగా ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. ఆరు మున్సిపాలిటీల ఈవీఎంలను జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలలో భద్రపర్చారు. వీటికి నిరంతరం ఉన్నతాధికారుల పర్యవేక్షణ, భారీ భద్రత సిబ్బంది మధ్య స్ట్రాంగ్ గదుల్లో పెట్టారు. వాయిదా పడుతూ వస్తున్న పుర ఫలితాలు దాదాపు 40 రోజుల తర్వాత వెలువడనుండడంతో అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అధికారులు ఏర్పాట్లు చేశారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఓట్ల లెక్కింపును చేపట్టనున్నారు. ఆరు మున్సిపాలిటీలకు కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాట్లు చేశారు. ఆరు మున్సిపాలిటీల ఓట్లను లెక్కించేందుకు 58 టేబుళ్లు వేశారు. ఒక్కో టేబుల్‌కు ముగ్గురు అధికారుల చొప్పున నియమించారు. 40 మంది సిబ్బందిని రిజర్వులో ఉంచారు. వీటితో కలిపి మొత్తం కౌంటింగ్ సిబ్బంది 300 మందిని నియమించినట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఆదివారం కౌంటింగ్ కేంద్రాల వద్ద సిబ్బంది, అధికారులు ఏర్పాట్లను పరిశీలించారు. కంప్యూటర్లు, స్ట్రాంగ్ రూంలో సౌకర్యాలు, వార్డులవారీగా ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ పోలీసు బందోబస్తుతోపాటు 144 సెక్షన్‌ను అమలు చేస్తున్నారు. అభ్యర్థుల్లో ఆందోళన నలబై రోజులుగా ఫలితాల కోసం ఎదురుచూస్తున్న మున్సిపల్ బరిలో నిలిచిన అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది. కౌన్సిలర్ అభ్యర్థుల కలలు నేటితో సాకారం అవుతాయా? బెడిసి కొడతాయా? అనేది సోమవారం ఓటరు తీర్పుతో తేటతెల్లంకానుంది. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ ప్రకారం ఎన్నికల ఫలితాలు ఏప్రిల్ 2వ తేదీన వెలువడాలి. కానీ, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం వాయిదా పడింది. ఇదిలా ఉండగా, ఆరు మున్సిపాలిటీల్లో భైంసా మున్సిపాలిటీ ఫలితాలు ఉదయం 10 గంటల వరకు వెలువడే అవకాశాలున్నట్లు అధికారులు పేర్కొంటు న్నారు. -
‘పుర’ ఫలితాలపై ఉత్కంఠ
సాక్షి, అనంతపురం : సార్వత్రిక ఎన్నికల సందడి సద్దుమణగడంతో ఇప్పుడు అందరి దృష్టి మునిసిపల్ ఎన్నికల ఫలితలపై పడింది. జిల్లాలోని అనంతపురం కార్పొరేషన్, తాడిపత్రి, గుంతకల్లు, రాయదుర్గం, గుంతకల్లు, గుత్తి, హిందూపురం, కదిరి, ధర్మవరం మునిసిపాలిటీలు, కళ్యాణదుర్గం, పామిడి, పుట్టపర్తి నగర పంచాయతీలకు మార్చి 30న ఎన్నికలు జరిగాయి. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓట్ల లెక్కింపు మే 12వ తేదీకి వాయిదా పడింది. ఫలితాలకోసం అభ్యర్థులు 40 రోజులకు పైగా ఎదురు చూస్తున్నారు. ఫలితాలపై ఇప్పటికే సర్వత్రా టెన్షన్ మొదలైంది. గెలుపోటములపై ఎవరి ధీమాలో వారున్నారు. మునిసిపల్ ఎన్నికల్లో చేసిన ఖర్చును బేరీజు వేసుకుని టీడీపీ నాయకులు గెలుపు మాదే అంటుండగా, వైఎస్సార్ ప్రకటించిన సంక్షేమ పథకాలు, జగన్మోహన్రెడ్డి చరిష్మా, జనాభిమానం మా బలమని ఆ పార్టీ నాయకులంటున్నారు. కాంగ్రెస్ పార్టీ కనీసం కౌన్సిలర్ అభ్యర్థులను కూడా పూర్తి స్థాయిలో నిలబెట్టుకోలేక చతికిలపడింది. పెకి టీడీపీ నాయకులు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నా వైఎస్సార్సీపీ ప్రభంజనంతో లోలోపల వారిలో ఆందోళన నెలకొంది. రెండు గంటల్లో ఫలితాలు జిల్లాలోని కార్పోరేషన్, మునిసిపల్, నగరపంచాయతీల ఓట్ల లెక్కింపు ఏర్పాట్లు జిల్లా అధికారులు పూర్తి చేశారు. నగరంలోని ఎస్ఎస్బిఎన్ కళాశాలలో ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. అందుకు ఒక్కో మునిసిపాలిటీకి వార్డులను బట్టి కౌంటిగ్ టేబుల్స్ ఏర్పాటు చేశారు. ఫలితాలు రెండు గంటల్లోనే వెలువడే విధంగా ఏర్పాట్లు చేశారు.