revaluation results
-
UP Board 12th Result 2022: ముందు అక్క, తర్వాత చెల్లి.. యూపీలో ఇంటర్ టాపర్లుగా కవలలు
ఫతేపూర్: యూపీ ఇంటర్ బోర్డు 12వ తరగతి పరీక్ష ఫలితాల్లో గమ్మత్తు జరిగింది. తొలుత దివ్యాన్షీ అనే అమ్మాయి రాష్ట్ర టాపర్‌గా నిలిచింది. కానీ దివ్య అనే మరో అమ్మాయికి హిందీ పేపర్ రీ వాల్యుయేషన్‌లో ఎక్కువ మార్కులు రావడంతో దివ్యాన్షిని తోసిరాజని ఆమె నయా టాపర్‌గా అవతరించింది. ఇందులో ట్విస్ట్ ఏమిటంటే వారిద్దరూ కవలలు! వారిద్దరూ చదివింది ఒకే స్కూల్లో. మొత్తం 500 మార్కులకు దివ్యాన్షి 477 మార్కులతో తొలుత టాపర్‌గా నిలిచింది. కానీ హిందీ తప్ప అన్ని సబ్జెక్టుల్లోనూ ఆమె కంటే దివ్యకే ఎక్కువ మార్కులొచ్చాయి. హిందీలో మరీ 56 మార్కులే రావడంతో ఆమె రీ వాల్యుయేషన్‌కు వెళ్లింది. దాంతో ఏకంగా 38 మార్కులు కలిసి రావడంతో మొత్తం 479 మార్కులతో తన సోదరిని దాటేసింది. అలా మొత్తానికి టాప్ రెండు ర్యాంకులు చేజిక్కించుకున్న కవలలపై ప్రశంసలు కురుస్తున్నాయి. -
రివాల్యుయేషన్లో మార్కులు రాలేదని..
జవహర్‌నగర్: ఇటీవల విడుదల ఇంటర్ రివాల్యుయేషన్ ఫలితాల్లో మార్కులు రాలేదని మనస్తాపం చెందిన ఓ విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన మంగళవారం జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని దమ్మాయిగూడలో చోటుచేసుకుంది. బాధిత కుటుంబ సభ్యుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. దమ్మాయిగూడకు చెందిన మానస ఇంటర్మీడియట్ చదువుతోంది. ఇటీవల ఇంటర్ రివాల్యుయేషన్లో మార్కులు పెరగలేదని మనస్తాపానికిలోనైన ఆమె ఉరి వేసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీనిని గుర్తించిన కుటుంబసభ్యులు ఆమెను గాంధీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం మానస ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు పేర్కొన్నారు. -
అన్నా వర్సిటీ ఉన్నతాధికారిణి సస్పెండ్
సాక్షి, చెన్నై: ఫెయిలయిన విద్యార్థుల నుంచి లంచం తీసుకుని పునఃమూల్యాకంనంలో పాస్ చేయించిన చెన్నైలోని అన్నా యూనివర్సిటీ పరీక్షల విభాగం కంట్రోలర్ ఉమపై సస్పెన్షన్ వేటు పడింది. పరీక్షల విభాగంలో అక్రమాలపై 50 మంది విద్యార్థులను అవినీతి నిరోధక విభాగం (ఏసీబీ) శుక్రవారం విచారించింది. రీ వాల్యుయేషన్‌లో లంచం తీసుకుని విద్యార్థుల్ని పాస్ చేసిన ఘటన వెలుగచూడడం తెల్సిందే. దీంతో అన్నా వర్సిటీ ఉన్నతాధికారులు ఉమను సస్పెండ్ చేశారు. రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి అన్బళగన్ మాట్లాడుతూ ఈ కేసులో ఏ ఒక్కర్నీ వదిలేదలేదని స్పష్టంచేశారు. -
మనీతో మార్కులు
సాక్షి ప్రతినిధి, చెన్నై: చెన్నైలోని అన్నా యూనివర్సిటీ అధికారులు డబ్బులకు కక్కుర్తిపడ్డారు. డబ్బులు ఇచ్చిన విద్యార్థులకు మార్కులు వేసి పాస్ చేశారు. ఇలా ఏళ్లుగా సాగుతున్న ఈ దందా మెరిట్ విద్యార్థుల ఫిర్యాదుతో బయటపడింది. అధికారులు వసూలు చేసిన మొత్తం రూ.240 కోట్లు ఉంటుందని దర్యాప్తులో తేలింది. ఇంజినీరింగ్, మెడికల్ తదితర ప్రధాన కోర్సులు చదివే విద్యార్థులు సెమిస్టర్ పరీక్షల్లో ఫెయిలైనా, ఆశించిన దానికంటే తక్కువ మార్కులు వచ్చినా పునః మూల్యాంకనం (రీవాల్యుయేషన్) కోసం దరఖాస్తు చేస్తారు. గత ఏడాది 12 లక్షల మంది సెమిస్టర్ పరీక్షలు రాశారు. వారిలో 3,02,380 మంది రీవాల్యుయేషన్‌కి దరఖాస్తు చేశారు. రీవాల్యుయేషన్ చేపట్టిన అధికారులు అదనంగా 73,733 మంది విద్యార్థులు ఉత్తీర్ణులైనట్టు ప్రకటన విడుదల చేశారు. దీంతోపాటు 16,630 మందికి అదనపు మార్కులొచ్చాయి. మొత్తంగా 90,369 మంది లబ్ధి పొందారు. ఈ విషయమై పలువురు విద్యార్థులు అవినీతినిరోధకశాఖకు ఫిర్యాదు చేశారు. ముడుపులు అందుకుని అదనపు మార్కులు వేస్తున్నట్లు కొందరు దళారుల ద్వారా తెలుసుకున్న విద్యార్థులు ఇచ్చిన సమాచారంతో ఏసీబీ అధికారులు రహస్య విచారణ చేపట్టగా వందల కోట్ల రూపాయలు చేతులు మారినట్లు తేలింది. ఈ దందా 2011 నుంచి జరుగుతున్నట్లు గుర్తించారు. 2011–16కాలంలో దాదాపు 12 లక్షల మంది రీ వాల్యుయేషన్‌కు దరఖాస్తు చేసుకోగా 5 లక్షలమందికి అదనపు మార్కులొచ్చాయి. ఈ ఐదు లక్షల మందిలో ఎంత మంది విద్యార్థులు లంచాలు ఇచ్చి లబ్ధి పొంది ఉంటారని ఆరాతీస్తున్నారు. ఒక్కో సెమిస్టర్‌కు రూ.45 కోట్ల వరకు విద్యార్థుల నుంచి అధికారులు వసూలు చేసినట్లు తేలింది. మార్కుల పునఃపరిశీలన పేరుతో గత మూడేళ్లలో ఆరు సెమిస్టర్లకుగాను దాదాపు రూ.240 కోట్లు స్వాహా చేసినట్లు భావిస్తున్నారు. దీంతో అవినీతి నిరోధకశాఖ, విజిలెన్స్ శాఖలో ప్రత్యేక విభాగానికి చెందిన అధికారులు అన్నా యూనివర్సిటిలో ఆకస్మిక తనిఖీలు చేపట్టి 2015–18 మధ్యకాలంలో ఎగ్జామినేషన్ కంట్రోలర్‌గా వ్యవహరించిన ఉమ సహా పదిమందిపై కేసులు పెట్టారు. ఆరోపణలు ఎదుర్కొన్న ప్రొఫెసర్లు, వర్సిటీ అధికారుల ఇళ్లలో తనిఖీలు చేయగా అదనపు మార్కుల అక్రమాలకు సంబంధించిన ఆధారాలు, స్థిరాస్తుల పత్రాలు లభించాయి. మరిన్ని ఆధారాలను వర్సిటీ అధికారులు ధ్వంసం చేసినట్లు కూడా విచారణలో వెల్లడైంది. -
దూరవిద్యా రీవాల్యుయేషన్ ఫలితాల వెల్లడి
గుంటూరు : ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం దూరవిద్య రీవాల్యుయేషన్ ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. ఈ ఏడాది మే, జూన్ నెలల్లో నిర్వహించిన ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ, ఎంబీఏ, ఎల్ఎల్ఎం, బీఎల్ఐఎస్సీ, ఎంఈడీ, ఎంహెచ్ఆర్ఎం, ఎంల్ఐఎస్సీ కోర్సుల రీవాల్యుయేషన్ ఫలితాలను పీజీ పరీక్షల విభాగం డిప్యూటీ రిజిస్ట్రార్ భవనం ఆంజనేయరెడ్డి వెల్లడించారు. ఈ ఫలితాలను www.anucde.info వెబ్సైట్ ద్వారా పొందవచ్చన్నారు. విద్యార్థుల సర్టిఫికెట్లను పోస్టుద్వారా వారి ఇంటి చిరునామాకు పంపుతామని పేర్కొన్నారు.