అల్టిమేటమ్..!
* ఎమ్మెల్యే చింతమనేనిని అరెస్టు చేయకపోతే పుష్కరాలు, ఇసుక రీచ్‌ల్లో విధులు బహిష్కరిస్తామని రెవెన్యూ సంఘాల హెచ్చరిక
* మహిళా అధికారిపై దాడి ఘటనపై వెల్లువెత్తిన నిరసన
* ఎమ్మెల్యేను అరెస్టు చేయకుంటే బాబును గద్దె దింపుతామని హెచ్చరిక
* నేడు రాష్ట్రంలో అన్ని తహశీల్దార్ కార్యాలయాలకు తాళాలు
* ఎమ్మెల్యేపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు
* తహశీల్దార్ వనజాక్షికి కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్, వామపక్షాల సంఘీభావం
* దాడి జరిగి 24 గంటలు దాటినా స్పందించని ముఖ్యమంత్రి
సాక్షి, హైదరాబాద్/ ఏలూరు/ విజయవాడ/ నూజివీడు: ఇసుక మాఫియాను అడ్డుకున్న మహిళా తహశీల్దార్‌పై విచక్షణారహితంగా దాడికి పాల్పడిన టీడీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్‌పై రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు వెల్లువెత్తాయి. ఎమ్మెల్యే, ఆయన అనుచరులను తక్షణమే అరెస్టు చేయాలని పలు జిల్లాల్లో రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్, ఏన్జీవో అసోసియేషన్లు ధర్నాలు నిర్వహించి అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. ఎమ్మెల్యే, ఆయన అనుచరుల్ని శుక్రవారం ఉదయం 10గంటలలోపు అరెస్టు చేయకపోతే పుష్కరాలు, ఇసుక రీచ్‌ల్లో విధులు బహిష్కరిస్తామని హెచ్చరించారు.
శుక్రవారం అన్ని తహశీల్దార్ కార్యాలయాలకు తాళాలు వేసి ఆందోళనలు నిర్వహించాలని రెవెన్యూ ఉద్యోగుల సంఘం పిలుపునిచ్చింది. ఎమ్మెల్యే చింతమనేని దౌర్జన్యాన్ని వైఎస్సార్ కాంగ్రెస్, కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, మహిళా సంఘాలు తీవ్రంగా ఖండించాయి. తహశీల్దార్ వనజాక్షికి రాజకీయ పార్టీలు, మహిళా సంఘాలు, ఉద్యోగ సంఘాలు సంఘీభావంగా నిలిచాయి. మహిళా అధికారిపై దాడిని ప్రతిపక్షనేత, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్రంగా ఖండించారు. దాడికి పాల్పడిన టీడీపీ ఎమ్మెల్యేను, ఆయన అనుచరులనూ తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు మహిళా అధికారిపై ఎమ్మెల్యే దాడిని మానవ హక్కుల కమిషన్ సుమోటోగా విచారణకు స్వీకరించింది. దాడిజరిగి 24 గంటై లెనా ఎమ్మెల్యేను అరెస్టు చేయకపోవడం, ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఎట్టకేలకు ఈ ఘటనపై డిప్యూటీ సీఎం స్పందిం చారు. దీనిపై కలెక్టర్‌తో విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామని ఓ ప్రకటన విడుదల చేసి చేతులు దులిపేసుకున్నారు.
రెవెన్యూ ఉద్యోగుల ధర్నాలు
టీడీపీ ఎమ్మెల్యే దౌర్జన్యాన్ని నిరసిస్తూ కృష్ణాజిల్లాలో జిల్లాలో రెవెన్యూ అసోసియేషన్ ప్రతినిధులు, తహశీల్దార్లు, డిప్యూటీ తహశీల్దార్లు కలెక్టర్ క్యాంపు కార్యాలయం వద్ద నల్లబ్యాడ్జీలతో ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్ బాబు.ఏకు వినతిపత్రం అందించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కృష్ణారావుకు కూడా వినతిపత్రం పంపించారు. ఉద్యోగుల ఆందోళనకు కలెక్టర్ బాబు మద్దతు పలికారు. ఈ సందర్భంగా రెవెన్యూ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అనిల్ జెనీసన్ మాట్లాడుతూ... ఎమ్మెల్యేను శుక్రవారం ఉదయం పది గంటల్లోపు అరెస్టు చేయకపోతే రాష్ట్రంలోని అన్ని తహశీల్దార్ కార్యాలయాకు తాళాలు వేస్తామని, పుష్కర, ఇసుక విధులు బహిష్కరిస్తామని హెచ్చరించారు.
ఉద్యోగులు ఆందోళనకు వీఆర్వో, వీఆర్ఏ సంఘాలు కూడా మద్దతు పలికాయి. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోనూ రెవెన్యూ ఉద్యోగులు భారీగా ఆందోళన నిర్వహించారు. అనంతరం రెవెన్యూ అసోసియేషన్ రాష్ర్ట కార్యదర్శి ఎల్.విద్యాసాగర్ మాట్లాడుతూ... ఎమ్మెల్యేను అరెస్టు చేయకపోతే సీఎం చంద్రబాబును గద్దె దింపి తగిన గుణపాఠం చెబుతామని స్పష్టంచేశారు. తుళ్లూరులోని సీఆర్డీఏ కార్యాలయ సిబ్బంది విధులను బహిష్కరించి నిరసన తెలిపారు. గుంటూరు జిల్లాలో వైఎస్సార్ విద్యార్థి, మహిళా విభాగాల ఆధ్వర్యంలో శంకర్ విలాస్ సెంటర్లో ధర్నా చేశారు. ప్రకాశం జిల్లాలో ఎన్జీవోలు ఆందోళన చేశారు. అనంతపురంలో రెవెన్యూ అసోసియేషన్ నిర్వహించిన నిరసనలో జాయింట్ కలెక్టర్ ఖాజామొహీద్దీన్తోపాటు పలువురు నేతలు పాల్గొన్నారు. చిత్తూరులో భారీ ర్యాలీ, నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.
సర్కారు వైఖరిపై ధ్వజమెత్తిన రాజకీయ పార్టీలు
రౌడీషీటర్లను టీడీపీలోకి తెచ్చుకుని చంద్రబాబు ప్రోత్సహిస్తున్నారని శ్రీకాకుళంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హైపవర్ కమిటీ సభ్యుడు తమ్మినేని సీతారామ్ ధ్వజమెత్తారు. రౌడీరాజకీయం చేస్తున్న టీడీపీ చివరకు ప్రభుత్వ అధికారులపై కూడా రౌడీయిజం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఎమ్మెల్యే నేరుగా మహిళా అధికారిపై దాడికి దిగడం సిగ్గుచేటని, రౌడీయిజాన్ని చట్టబద్ధం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో చేసుకోవాలని అనంతపురంలో పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే, ఆయన అనుచరుల్ని వెంటనే అరెస్టు చేయాలని విజయవాడలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు, సీపీఐ రాష్ట కార్యదర్శి కె.రామకృష్ణ, పలువురు వామపక్ష పార్టీలు డిమాండ్ చేశారు.
అధికారులపై దాడులను ఉపేక్షించం: డిప్యుటీ సీఎం కేఈ
కృష్ణా జిల్లా ముసునూరులో విధి నిర్వహణలో ఉన్న మహిళా తహశీల్దారుపై జరిగిన దాడిని ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి కేఈ కృష్ణమూర్తి ఖండించారు. విధి నిర్వహణలో ఉన్న అధికారులపై దాడులు జరిపితే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు మంత్రి తరఫున మీడియా లైజనింగ్ అధికారి గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. మహిళా తహసీల్దారుపై దాడి సంఘటనకు సంబంధించి పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని కలెక్టరును ఆదేశించినట్లు పేర్కొన్నారు. కలెక్టరు నుంచి నివేదిక రాగానే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని వివరించారు. ఇసుక అక్రమ రవాణాను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుందని ప్రకటనలో పేర్కొన్నారు.
చింతమనేనిపై కేసు నమోదు..
మహిళా తహశీల్దార్‌పై దాడికి సంబంధించి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై ముసునూరు పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది. ఎమ్మెల్యే, ఆయన గన్‌మెన్, అనుచరులు, డ్వాక్రా మహిళలు మొత్తం 52 మందిపై బుధవారం అర్ధరాత్రి 12గంటల సమయంలో తహశీల్దారు వనజాక్షి ముసునూరు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగినిని కొట్టడం, ఎదిరించడం, అసభ్యకర పదజాలంతో దూషించడం, దొంగతనంగా ఇసుకను దొంగిలించడం వంటి కారణాలతో ఐపీసీ 353,332,379, రెడ్‌విత్ 34 సెక్షన్ల కింద కేసు (క్రైమ్ నంబర్ 103/2015) నమోదు చేశారు. ఇదే సంఘటనలో దాడికి గురైన ముసునూరు సాక్షి విలేకరి కర్రా నవీన్‌కుమార్ ఫిర్యాదు మేరకు గురువారం మరో కేసు నమోదు చేశారు. బాధితులకు నూజివీడు ఏరియా ఆస్పత్రిలో చికిత్స జరిపి పంపారు. నూజివీడు డీఎస్పీ వెంకట్రామిరెడ్డి కేసు దర్యాప్తు చేస్తున్నారు. తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, రక్షణ కల్పించాలని వనజాక్షి ప్రభుత్వాన్ని కోరారు.
‘ఆయన్ను పదవి నుంచి తప్పించాలి’
ముసునూరు మండల తహశీల్దార్ వనజాక్షిపై దాడికి పాల్పడిన తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రభుత్వ విప్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై తక్షణమే క్రిమినల్ కేసులు నమోదు చేసి తగిన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ ఉద్యోగుల సంఘం, డిప్యూటీ కలెక్టర్ల సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు, డిప్యూటీ కలెక్టర్ల సంఘం అధ్యక్షులు పిడుగు బాబూరావులు తమ సంఘాల ప్రతినిధులతో కలిసి గురువారం సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్‌ను తక్షణమే విప్ పదవినుంచి తప్పించాలని బొప్పరాజు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు.
అధికారంలో ఉన్నామని వీధిరౌడీలా ప్రవర్తిస్తారా?
అధికారంలో ఉన్నాం కదా అని వీధిరౌడీలా ప్రవర్తిస్తారా అని రాష్ట్ర డిప్యూటీ కలెక్టర్ల సంఘం అధ్యక్షులు పిడుగు బాబూరావు మండిపడ్డారు. తక్షణమే చింతమనేని ప్రభాకర్‌పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆయన చీఫ్‌విప్ పదవికే కాదు ఎమ్మెల్యే పదవికి కూడా అనర్హుడని, ఆ పదవులనుంచి ఆయనను తక్షణమే తప్పించాలని కోరారు. సమావేశంలో రెవెన్యూ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు పి.వాసు, అంజిప్రసాద్, దుర్గాప్రసాద్ తదితరులున్నారు.
దుందుడుకుగా ఉండడం నా నైజం: ఎమ్మెల్యే ప్రభాకర్
దుందుడుకుగా ఉండడం తన నైజమని.. అందుకే ఎన్నో కేసుల్లో ఇరుక్కున్నానని.. ఇది కూడా అందులో ఒకటని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చెప్పారు. ఆయన గురువారం స్థానిక జిల్లా పరిషత్ అతిథి గృహంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కృష్ణాజిల్లా ముసునూరు మండలంలో జరిగిన ఘటనలో తన తప్పేమీ లేదన్నారు. అక్కడ డ్వాక్రా సంఘాల మహిళలకు, రెవెన్యూ ఉద్యోగులకు మధ్య వాగ్వాదం జరుగుతోందని తెలిసి సర్దిచెప్పడానికి ప్రయత్నించానని చెప్పారు.
తాను ఇసుక మాఫియాకు పాల్పడినట్టు ఎవరైనా రుజువు చేస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానన్నారు. తహశీల్దార్‌తో జరిగిన ఘటన దురదృష్టకరమని, ఈ విషయంలో ఎవరైనా బాధపడితే చింతిస్తున్నానని చెప్పారు. ఈ ఘటనకు సంబంధించిన నిజానిజాలు వెలుగులోకి వస్తాయని, త్వరలోనే అంతా సద్దుమణుగుతుందని తెలిపారు. అయితే తహశీల్దార్ వనజాక్షి మీ మీదనే ఎందుకు ఫిర్యాదు చేశారని ప్రశ్నించగా... అదంతా మీ వల్లేనంటూ ‘సాక్షి’ చానల్ విలేకరిపైకి నెపం నెట్టేశారు. ఇతర మీడియా వాళ్లు బాధ పడతారనే ‘సాక్షి’ విలేకరులను సమావేశానికి రానిస్తున్నానని, లేనిపక్షంలో వారిని రానిచ్చేది లేదని ‘సాక్షి’పై తన ఆక్రోశాన్ని వెళ్లగక్కారు.
ఆ ఎమ్మెల్యేను అరెస్ట్ చేయాలి: ట్విట్టర్లో జగన్ డిమాండ్
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జిల్లా ముసునూరులో మహిళా తహసీల్దార్‌పై దౌర్జన్యానికి పాల్పడిన అధికార పార్టీ విప్‌ను వెంటనే అరెస్టు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి డిమాండ్ చేశారు. మహిళా అధికారిపై దాడి ఘటనను ఆయన తీవ్రంగా ఖండించారు. ‘‘ఒక మహిళా అధికారిని అధికార తెలుగుదేశం పార్టీ విప్ దూషిస్తూ అవమానపరిచి, దౌర్జన్యానికి పాల్పడిన ఈ ఘటన.. ఇసుక మాఫియాతో సిగ్గుమాలిన చంద్రబాబు ప్రభుత్వానికి ఉన్న అపవిత్ర బంధమేంటో తేటతెల్లం చేస్తోంది. ఈ చర్యను అందరూ ఖండించాలి. ఆ ఎమ్మెల్యేను తక్షణం అరెస్ట్ చేయాలి’’ అని జగన్ ట్విట్టర్లో పేర్కొన్నారు.