
తిరుపతి అర్బన్/తిరుచానూరు: రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ప్రతిపక్షాలు ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు విమర్శించారు. వీటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. తిరుపతిలో బుధవారం ఉమ్మడి రాయలసీమ జిల్లాల ప్రాంతీయ రెవెన్యూ సదస్సు జరిగింది. దీనికి అధ్యక్షత వహించిన మంత్రి ధర్మాన మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్ బడుగు, బలహీనవర్గాల వారికి మంచి చేయాలనే సంకల్పంతో అధికారంలోకి వచ్చిన తరువాత ఈ మూడున్నరేళ్లలో రూ.1.65 లక్షల కోట్లను వివిధ పథకాల లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా జమచేశారని గుర్తుచేశారు.
ప్రతి పేదవాడికి సొంత ఇల్లు ఉండాలన్న లక్ష్యంతో రాష్ట్రంలో 30 లక్షల మందికి ఇంటిపట్టాలు ఇవ్వడంతోపాటు గృహనిర్మాణాలు చేపడుతున్నారని గుర్తుచేశారు. ఇందుకు రూ.12 వేల కోట్లు ఖర్చుచేస్తున్నారని చెప్పారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఇంత మొత్తంలో ఇళ్ల పంపిణీ ఇదే తొలిసారన్నారు. రాష్ట్రంలో నిర్వహిస్తున్న భూసర్వేతో ఎన్నో ప్రయోజనాలున్నాయని చెప్పారు. 90 శాతం గ్రామాల్లో సమస్యలు పరిష్కారమై ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుందన్నారు.
అధికారులకు అండగా ప్రభుత్వం
క్షేత్రస్థాయిలో సమస్యలుంటే వాటికి పరిష్కారం చూపుతామని చెప్పారు. అవినీతి రహిత పాలనకు సీఎం శ్రీకారం చుట్టారని చెప్పారు. నిజాయితీగా పనిచేస్తున్న అధికారులపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయన్నారు. నిబద్ధతతో పనిచేస్తున్న అధికారులకు ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందని చెప్పారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వం తీసుకొస్తున్న సంస్కరణలను విజయవంతం చేయడానికి రెవెన్యూ విభాగం ఎంతో కీలకమైనదన్నారు.
ఇందుకోసం సమష్టిగా పనిచేయాలని సూచించారు. కాలక్రమంలో వస్తున్న సాంకేతిక మార్పులకు అనుగుణంగా చేపట్టిన సంస్కరణలు అమల్లోకి వచ్చాయన్నారు. ఓ వ్యక్తి పుట్టినప్పటి నుంచి జీవించినంతకాలం, చివరికి అంత్యక్రియల వరకు రెవెన్యూ విభాగంతో ముడిపడి ఉండే బంధాలను ఆయన వివరించారు. ఈ సదస్సులో సీసీఎల్‌ఏ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సాయిప్రసాద్, అదనపు సీసీఎల్‌ఏ సెక్రటరీ ఇంతియాజ్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ కమిషనర్, డైరెక్టర్ సిద్ధార్థ జైన్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment