నేటి అర్ధరాత్రి నుంచి ఉద్యోగుల సమ్మె
విశాఖ రూరల్, న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర కోసం ఉద్యోగ సంఘాలు బుధవారం అర్ధరాత్రి నుంచి సమ్మె బాట పడుతున్నాయి. రాష్ట్ర విభజనపై యూపీఏ చర్యలకు నిరసనగా ప్రభుత్వ కార్యకలాపాలను స్తంభింప చేయాలని నిర్ణయించాయి. సమైక్యరాష్ట్ర పరిరక్షణ పిలుపు మేరకు ఏపీఎన్జీవో, రెవెన్యూ ఉద్యోగులు సమ్మెకు దిగుతున్నారు. దీంతో కలెక్టరేట్ నుంచి పంచాయతీ కార్యాలయం వ రకు అన్నీ మూతపడనున్నాయి. గురువారం నుంచి ప్రజా సేవలు మరోసారి నిలిచిపోనున్నాయి. వాస్తవానికి ఈ నెలలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశాలున్న సమయంలో ఉద్యోగులు సమ్మెకు వెళ్లడంతో ఎన్నికల విధులకు ఆటంకం కలిగే అవకాశాలు ఉన్నాయి.
ఈ నెల 9వ తేదీ నుంచి వరుసగా ఎన్నికల నిర్వహణకు సంబంధించిన శిక్షణ కార్యక్రమాలను చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. ఈ నెల 10 నుంచి రెవెన్యూ సదస్సులకు ప్రభుత్వం ఆదేశించింది. కానీ ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ నిర్ణయం మేరకు జిల్లాలో ఉన్న 3200 వీఆర్ఏ, 1200 మంది వీఆర్వో, 800 మంది రెవెన్యూ ఉద్యోగులు సమ్మెకు వెళ్లాలని నిర్ణయించినట్టు అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎస్.నాగేశ్వరరెడ్డి ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. సమైక్యాంధ్ర కోసం చివరి పోరాటంగా ఈ సమ్మె చేస్తున్నట్లు ఉద్యోగ సంఘాల నాయకులు చెబుతున్నారు.