22 నుంచి రెవెన్యూ సమీక్షలు
డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి
సాక్షి ప్రతినిధి, కర్నూలు: రాష్ట్రంలో ఈనెల 22 నుంచి రెవెన్యూ సమీక్షలు నిర్వహిస్తున్నట్లు రెవెన్యూ శాఖను నిర్వహిస్తున్న డిప్యూటీ సీఎం కె.ఈ.కృష్ణమూర్తి తెలిపారు. మంగళవారం కర్నూలులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 22న అనంతపురం, 29న ఏలూరు, ఫిబ్రవరి 4న గుంటూరులో, 11 విజయనగరంలో సమీక్షలు నిర్వహిస్తామన్నారు.
రెవెన్యూ చట్టాలను సరళతరం చేయడం, మీసేవ కేంద్రాల ద్వారా ఈ-పాసు పుస్తకాల మంజూరుతో పాటు ఇతర సర్టిఫికెట్ల జారీ ప్రక్రియపై సమీక్షల్లో చర్చిస్తామన్నారు. నిర్ణీత కాలంలో ఈ-పాసు పుస్తకాలు లేదా ఇతర సర్టిఫికెట్లు(జనన, మరణ, కుల తదితరాలు) సకాలంలో ఇవ్వని పక్షంలో రూ. 1,000 జరిమానా విధిస్తామన్నారు.
పనులు ప్రారంభించకపోతే భూములు వాపస్
పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు భూములను తీసుకుని ఇప్పటి వరకు కార్యకలాపాలు మొదలుపెట్టని సంస్థల భూములను వెనక్కి తీసుకుంటామని కేఈ కృష్ణమూర్తి పేర్కొన్నారు. ఈ నెల 19న ఆర్థికశాఖమంత్రి యనమల నేతృత్వంలోని కేబినెట్ సబ్‌కమిటీ సమావేశం అవుతుందన్నారు. పనులు ప్రారంభించని పరిశ్రమల భూములను వెనక్కి తీసుకోవడంతో పాటు కొత్తగా ఏయే పరిశ్రమలకు భూములను ఎంత మేరకు కేటాయించాలి? ఎలా కేటాయించాలి? తదితర అంశాలపై చర్చించి నిర్ణయుం తీసుకుంటావున్నారు.