ఆ స్పెషల్ ఆర్ట్‌తో దేవుడు పంపించలేదు: షమీ
న్యూఢిల్లీ: అటు వేగం... ఇటు వ్యూహం కలగలిసిన బంతులతో బ్యాట్స్‌మెన్‌ను కట్టిపడేస్తూ, యార్కర్లతో చుక్కలు చూపుతూ దూసుకొచ్చాడు మహ్మద్ షమీ. జహీర్ ఖాన్ రిటైర్మెంట్కు తోడు ఇషాంత్ శర్మ వంటి వారిలో పదును తగ్గుతూ ఉన్న దశలో ఆశాకిరణంలా కనిపించాడు షమీ. ఈ అంచనాలను నిలబెట్టుకుంటూ టెస్టుల్లో స్థానం సుస్థిరం చేసుకున్నాడు.ప్రధానంగా తన రివర్స్ స్వింగ్‌తో బ్యాట్స్మెన్లను కట్టి పడేయడంలో షమీ దిట్ట. టెస్టు మ్యాచ్‌ల్లో తొలి రెండు రోజుల ఆటను పక్కన పెడితే, మిగిలిన మూడు రోజుల్లో మరింత ప్రమాదకరంగా మారిపోతాడు షమీ. (‘పాక్ క్రికెటర్లు.. చిల్లర మాటలు ఆపండి’)
జస్ప్రీత్ బుమ్రా, ఇషాంత్ శర్మ, భువనేశ్వర్ కుమార్, ఉమేశ్ యాదవ్, షమీలే ప్రస్తుతం టీమిండియా పేస్ బలం. కాగా, షమీ పేస్ ఆయుధం మాత్రం కచ్చితత్వంతో కూడిన వేగం. అందులో రివర్స్ స్వింగ్ రాబట్టి వికెట్లను సాధిస్తూ ఉంటాడు షమీ. తన రివర్స్ స్వింగ్‌పై మాట్లాడిన షమీ.. ‘ నా పేస్‌లో ఎప్పుడూ 140 కి.మీ వేగం తగ్గకుండా చూసుకుంటా. నేను ఎక్కువగా సీమ్‌తో పాటు స్వింగ్‌పైనే ఫోకస్ చేస్తా. ఈ రెండు అంశాల్నే నేను ఎప్పుడూ ఫాలో కావడంతోనే బౌలింగ్ మెరుగైంది. ఇక శారీరక ఫిట్నెస్ను కాపాడుకుంటూ ఉంటా. నా బౌలింగ్‌లో తొలి ప్రాధాన్యత స్వింగ్దే’ అని షమీ పేర్కొన్నాడు. (నేనేమైనా పిచ్చోడిలా కనిపిస్తున్నానా..?)
ఒక్కసారి గతానికి వెళితే.. ‘ నేను చాలా విషయాలు నేర్చుకుంటూ బౌలింగ్‌లో రాటుదేలాను. ఒకదాని తర్వాత మరొకటి అన్నట్లే నా లెర్నింగ్ ప్రాసెస్ జరుగుతూ ఉంది. ఒక ట్రిక్ నేర్చుకున్న తర్వాత అందులో మాస్టర్ కావడం కోసం తపిస్తూ ఉంటాను. ఆ తర్వాత వేరొక అంశాన్ని పరిశీలిస్తాను. నా కెరీర్ ఆరంభంలో నాకు రివర్స్ స్వింగ్‌పై అసలు అవగాహన లేదు. మెల్లగా అర్థం చేసుకుంటూ రివర్స్ స్వింగ్ చేయడం మొదలుపెట్టా. నాకు రివర్స్ స్వింగ్ అనేది సహజ సిద్ధంగా రాలేదు. అంటే నన్నుదేవుడు ఆ స్పెషల్ ఆర్ట్‌తో పంపిచలేదు. నిజాయితీగా చెప్పాలంటే ఎక్కువగా శ్రమించే ‘రివర్స్ స్వింగ్’ బౌలర్‌ను అయ్యా. మనకు కష్టించే తత్వం ఉంటే నువ్వు జీవితంలో అనుకున్న లక్ష్యాన్ని చేరతావు’ అని షమీ చెప్పుకొచ్చాడు.