బౌలింగ్‌తోనే దెబ్బ తిన్నాం: ధోని
జొహన్నెస్‌బర్గ్: ఆరంభ ఓవర్లలోనే గతి తప్పిన తమ బౌలర్లు ఓటమికి బాట పరిచారని భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని వ్యాఖ్యానించాడు. ప్రాక్టీస్ మ్యాచ్‌లు లేకపోవడం తొలి వన్డేలో పరాజయానికి కారణం కాదని అతను విశ్లేషించాడు. ‘మొత్తంగా చూస్తే ఇది చెత్త ప్రదర్శన. అయితే ఇది మా బౌలింగ్‌తోనే మొదలైంది. ఈ వికెట్‌పై 300కు పైగా పరుగులు ఇవ్వాల్సింది కాదు. ఇక్కడి పరిస్థితుల్లో అనుభవం కీలకం. దక్షిణాఫ్రికా బౌలర్లకు లెంగ్త్‌పై అవగాహన ఉంది. వారి జట్టులో అత్యుత్తమ పేసర్లు ఉన్నారు. మా ఆరంభం సరిగా లేకపోవడం కూడా ఓటమికి కారణమైంది’ అని ధోని అభిప్రాయ పడ్డాడు.
చివరి ఓవర్లలో బౌలర్లు భారీగా సమర్పించుకోవడం ఇటీవల సహజంగా మారిందని, అగ్రశ్రేణి బౌలర్ కూడా బాధితుడిగా మారుతున్నాడని ధోని తన బౌలర్లను సమర్ధించాడు. ‘సర్కిల్‌లో అదనపు ఫీల్డర్ ఉండటం, బంతి రివర్స్ స్వింగ్ వల్ల మంచి బౌలర్లు కూడా భారీ పరుగులిస్తున్నారు. కాబట్టి ఏ జట్టయినా ఆరంభ ఓవర్లలో ప్రత్యర్థిని కట్టడి చేయగలగాలి. అప్పుడే బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి పెంచగలం’ అని భారత కెప్టెన్ అన్నాడు. పరిస్థితులకు తొందరగా అలవాటు పడితేనే బ్యాటింగ్‌లో ప్రభావం చూపించగలమని అతను సహచరులకు సూచించాడు. ‘అంతర్జాతీయ క్యాలెం డర్‌లో ఎక్కువ ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆశించడం సరైంది కాదు. షెడ్యూల్‌ను మనం తప్పు పట్టలేం. వన్డేకు ముందు మాకు రెండున్నర రోజుల విరామం లభిం చింది. మ్యాచ్‌కు మానసికంగా సిద్ధమయ్యేందుకు ఇది సరిపోతుంది’ అని ధోని అన్నాడు.