న్యూఢిల్లీ: భారత జట్టు ఇటీవల బోర్డర్–గావస్కర్ ట్రోఫీలో ఓటమితో పాటు అంతకు ముందు సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో టెస్టు సిరీస్‌లో క్లీన్‌స్వీప్‌నకు గురైంది. ఈ రెండు సార్లూ మన బ్యాటింగే పెద్ద బలహీనతగా కనిపించింది. ఈ నేపథ్యంలో వచ్చే జూన్‌లో ఇంగ్లండ్‌లో జరిగే టెస్టు సిరీస్‌కు ముందుగా టీమిండియా సన్నద్ధత మెరుగ్గా ఉండాలని బీసీసీఐ భావిస్తోంది. భారత టెస్టు జట్టు సభ్యులంతా రంజీ ట్రోఫీలో ఆడేందుకు సిద్ధమైనా... ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ ఉండటంతో ఒకటికి మించి రంజీ మ్యాచ్ ఆడే అవకాశం కనిపించడం లేదు. ఆ తర్వాత ఐపీఎల్ మొదలైతే ఎరుపు బంతితో సాధన అసాధ్యం!
దాంతో ఇంగ్లండ్‌కు వెళ్లి అక్కడే నాలుగు రోజులు మ్యాచ్‌లు ఆడాలని బోర్డు నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇంగ్లండ్ యువ జట్టు ‘లయన్స్’తో భారత్ నాలుగు రోజుల మ్యాచ్‌లు ఆడనుంది. ఐపీఎల్ ముగిసే మే 25 నుంచి తొలి టెస్టు ప్రారంభమయ్యే జూన్ 20 మధ్య ఉన్న సమయంలో టీమిండియా మూడు మ్యాచ్‌లు ఆడుతుంది. అక్కడి వాతావరణం, పరిస్థితులకు అలవాటు పడి బ్యాటింగ్ మెరుగుపర్చుకోవడం మాత్రమే కాకుండా టెస్టు టీమ్‌లో స్థానాన్ని ఆశించే ఆటగాళ్లు కూడా తమ సత్తాను చాటేందుకు ఈ మూడు మ్యాచ్‌లు ఉపకరిస్తాయని బోర్డు ఆశిస్తోంది. ఆసీస్‌తో సిరీస్‌లో విఫలమైన రోహిత్, కోహ్లిలతో పాటు ఇతర ఆటగాళ్లంతా ఈ మ్యాచ్‌లలో బరిలోకి దిగనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment