reviewed
-
5 రాష్ట్రాల్లో 5800 టన్నుల పప్పుధాన్యాలు స్వాధీనం
న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరిగిపోవడంతో కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ దీనిపై మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించింది. క్యాబినెట్ కార్యదర్శి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వ్యవసాయ, వినియోగదారుల శాఖ మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. ధరల నియంత్రణకు కేంద్రం తీసుకుంటున్న చర్యల గురించి వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి సి.విశ్వనాథ్ మీడియాకు వివరించారు. ఇప్పటికే కందిపప్పు ధర డబుల్ సెంచరీకి చేరడంతో దేశవ్యాప్తంగా ఆందోళన తీవ్రతరమైన విషయం తెలిసిందే. అక్రమంగా నిల్వలు, కృతిమ కొరత సృష్టిస్తున్న వారిపై ఉక్కుపాదం మోపుతామని... అరెస్టులకు కూడా వెనుకడమని చెప్పారు. గత కొద్ది నెలలగా జరిపిన దాడుల్లో ఐదు రాష్ట్రాల్లో 5800 టన్నుల పప్పుధాన్యాలను స్వాధీనం చేసుకున్నామని అన్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి అత్యాధికంగా 2549 టన్నులు, మధ్యప్రదేశ్ నుంచి 2295 టన్నులు, ఆంధ్రప్రదేశ్ నుంచి 600 టన్నులు దీంతో పాటు కర్ణాటక, మహారాష్ట్రాల నుంచి భారీగా పప్పు ధాన్యాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. దేశవ్యాప్తంగా దాడులను కొనసాగిస్తున్నామని... దీనివల్ల ధరలు కొంత వరకు నియంత్రించగలిగామని చెప్పారు. ఎప్పుటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చలు జరుపుతూ పంట దిగుబడులు పెంచడానికి కృషి చేస్తున్నామన్నారు. విదేశాల నుంచి పప్పుధాన్యాల దిగుబడి చేసుకుంటున్నామని...త్వరలోనే ధరలను నియంత్రిస్తామని విశ్వనాథ్ ఆశాభావం వ్యక్తం చేశారు. -
‘పాలమూరు’ ఖర్చు తగ్గించేదెలా?
రూ.35 వేల కోట్లకు తగ్గించే మార్పులపై సీఎం సమీక్ష వచ్చేనెల 11న శంకుస్థాపన చేసేలా చర్యలు రోజువారీ పర్యవేక్షణకు పత్యేక అధికారి నియామకం సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి తుదిరూపునిచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు తీవ్రం చేస్తోంది. కొత్త డిజైన్‌లో భాగంగా శ్రీశైలం నుంచి నీటిని తీసుకొనే క్రమంలో నిర్ణీత ఆయకట్టు దెబ్బతినకుండా, అంచనా వ్యయం పెరగకుండా ప్రాజెక్టు డిజైన్ ఖరారు చేసే యత్నాల్లో మునిగితేలుతోంది. ఇప్పటికే డిజైన్ ఖరారుపై పలు విడతలుగా స్వయంగా రిటైర్డ్ ఇంజనీర్లతో భేటీలు నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శుక్రవారం మరోమారు అధికారులతో ఈ అంశమై అర్ధరాత్రి వరకు సమీక్ష నిర్వహించారు. కొత్త డిజైన్‌తో రిజర్వాయర్లు, లిఫ్టుల సంఖ్య పెరగడం, దీంతో తొలి డిజైన్ అంచనా రూ.32 వేల కోట్లను మించి రూ.42 వేల కోట్లకు చేరుతుండటంతో దాన్ని తగ్గించి రూ.35 వేల కోట్లకు పరిమితం చేసే ఇతర మార్గాలపై చర్చలు జరిపారు. కాగా, ప్రాజెక్టుకు వచ్చే నెల 11న శంకుస్థాపన చేయాలని సీఎం నిర్ణయించినట్లు తెలిసింది. ఎమ్మెల్సీ ఎన్నికల విషయమై పార్టీ ఎమ్మెల్యేలతో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు శంకుస్థాపన తేదీపై మహబూబ్‌నగర్ జిల్లా నేతలకు కేసీఆర్ స్పష్టత ఇచ్చినట్లు తెలిసింది. నిజానికి ఈ ప్రాజెక్టును ఈనెల 31న ఆరంభించాలని నిర్ణయించిన విషయం విదితమే. పాలమూరును త్వరితగతిన పూర్తిచేసేందుకు వీలుగా, రోజువారీగా పనులను పర్యవేక్షించేందుకు నీటిపారుదలశాఖ రిటైర్డ్ ఇంజనీర్ రంగారెడ్డిని ప్రత్యేక అధికారిగా నియమిస్తూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. ఈయన సీఎం ఓఎస్డీగా పనిచేస్తూ ప్రాజెక్టును పర్యవేక్షిస్తారు. ఈ మేరకు శుక్రవారం ప్రభుత్వం జీవో జారీచేసింది. -
విద్యుత్ శాఖపై సమీక్షలో సీఎం
-
ఉచిత విద్యుత్‌కు దశలవారీగా కత్తెరేద్దాం
విద్యుత్ శాఖపై సమీక్షలో సీఎం హైదరాబాద్: రైతన్నకు మరో షాకిచ్చేందుకు సర్కారు సన్నద్ధమవుతోంది. ఉచిత విద్యుత్‌కు నియంత్రణ రేఖ గీయనుంది. విద్యుత్ శాఖపై రాష్ట్ర సీఎం చంద్రబాబు ఉన్నతాధికారులతో సోమవారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఉచిత విద్యుత్‌పై ప్రధానంగా చర్చ జరిగింది. పంపిణీ, సరఫరా నష్టాల్ని 10 నుంచి 9 శాతానికి ఎలా తగ్గించాలో ఈ సందర్భంగా సీఎం సూచించారు. ఉచిత విద్యుత్‌కు దశల వారీగా కత్తెర వేయడమే మార్గమని ఆయన పరోక్షంగా పేర్కొన్నారు. ఇందులో భాగంగా విద్యుత్ ఫీడర్లకు మీటర్లు బిగించాలని సూచించారు. అన్నిరకాల విద్యుత్ కనెక్షన్లకు ఆధార్ సంఖ్యను అనుసంధానించాలని ఆదేశించారు. రాష్ట్రంలోని 15 లక్షల వ్యవసాయ విద్యుత్ పంపుసెట్ల స్థానంలో నాణ్యమైన పంపుసెట్లను అమరిస్తే ఎంత ఖర్చవుతుందో నివేదించాలని అధికారుల్ని కోరారు. దీనిని రైతులు వ్యతిరేకిస్తున్నారంటూ అధికారులు సీఎం దృష్టికి తెచ్చినట్టు సమాచారం. పీఎల్ఎఫ్ బహు బాగు: జెన్కో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో ప్రాజెక్టు లోడ్ ఫ్యాక్టర్ (పీఎల్ఎఫ్) 81 శాతం వరకూ ఉందని విద్యుత్ అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ విద్యుత్ చౌర్యంపై కఠినంగా వ్యవహరించాలని సూచించారు. నైపుణ్యాభివృద్ధి వర్సిటీకి భూమి: సీఎం రాష్ర్టంలో నైపుణ్యాభివృద్ధి విశ్వవిద్యాలయం, ఇండస్ట్రియల్ కన్సార్టియంలతోపాటు 13 శిక్షణా కేంద్రాల ఏర్పాటుకు 300 నుంచి 500 ఎకరాల భూమిని కేటాయిస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. నైపుణ్యాభివృద్ధి సంస్థపై సచివాలయంలో సోమవారం జరిగిన సమీక్షా సమావేశంలో మాట్లాడారు. సమావేశంలో మంత్రులు కె. అచ్చెన్నాయుడు, గంటా శ్రీనివాసరావుతదితరులు పాల్గొన్నట్లు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది. సీఎంతో హ్యూస్టన్ ప్రతినిధి బృందం భేటీ అమెరికాలోని హ్యూస్టన్ నగరానికి చెందిన వాణిజ్య ప్రతినిధి బృందం సోమవారం సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యింది. విద్యుత్, పోర్టులు, ఫార్మా రంగంలో తమ నగరం గణనీయమైన పురోగతి సాధించిందని వారు తెలిపారు. పట్టణాభివృద్ధి, మౌలికవసతుల రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఈ బృందం ఆసక్తి చూపింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, లాజిస్టిక్ హబ్‌గా రూపొందేందుకు ఏపీకి అన్ని వనరులున్నాయని తెలిపారు. పోర్టులు, విమానాశ్రయాలు, మౌలిక వసతుల అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. సమగ్ర ప్రణాళికతో రావాలని హ్యూస్టన్ బృందాన్ని సీఎం కోరారు.