‘పశ్చిమ'కు అల్లూరి పేరు !
ఏలూరు : మన జిల్లాకు మన్య విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టాలని ప్రభుత్వాన్ని కోరుతూ త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రతిపాదనలు ఇవ్వనున్నట్టు రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ, గనుల శాఖ మంత్రి పీతల సుజాత, ఏలూరు ఎంపీ మాగంటి బాబు చెప్పారు. స్థానిక జూట్‌మిల్లు సెంటర్లోని అల్లూరి సీతారామరాజు విగ్ర హం వద్ద శుక్రవారం అల్లూరి జీవిత చరిత్రపై ప్రచురించిన కరపత్రాన్ని మంత్రి, ఎంపీ ఆవిష్కరించారు.
జిల్లాకు అల్లూరి పేరు పెట్టాలని కోరుతూ జిల్లాలోని ప్రజాప్రతినిధులంతా సమష్టిగా తీర్మానం చేసి ముఖ్యమంత్రికి నివేదిస్తామని వారు తెలిపారు. బ్రిటిష్ పాలన నుంచి విముక్తి కోసం విప్లవ మార్గన్ని ఎంచుకుని మన్యం ప్రజలను ఏక తాటిపై నడిపిన మహనీయుడు సీతారామరాజు అని నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బడేటి బుజ్జి, నగర మేయర్ షేక్ నూర్జహాన్, డెప్యూటీ మేయర్ చోడే వెంకటరత్నం, కలెక్టర్ సిద్ధార్థజైన్, జేసీ టి.బాబూరావునాయుడు, అసిస్టెంట్ కలెక్టర్ రవి సుభాష్, డీపీవో అల్లూరి నాగరాజువర్మ, సెట్వెల్ సీఈవో పి.సుబ్బారావు, హౌసింగ్ పీడీ జి.సత్యనారాయణ, ఏలూరు ఆర్డీవో శ్రీనివాస్, తహసిల్దార్ జీవీఎస్ సుబ్బారావు, టీడీపీ జిల్లా కార్యాలయ సమన్వయ కార్యదర్శి పాలి ప్రసాద్, పార్టీ నగర శాఖ అధ్యక్షుడు కొల్లేపల్లి రాజు పాల్గొన్నారు