గ్యాస్ ధర పెంచకుంటే పెట్టుబడులు నిలిచిపోతాయ్
న్యూఢిల్లీ: సవరించిన సహజ వాయువు ధరల అమల్లో జాప్యం వల్ల కృష్ణ-గోదావరి బేసిన్‌లోని కేజీ డీ6లో ప్రతిపాదిత రూ.24,000 కోట్ల పెట్టుబడులు నిలిచిపోతాయని రిలయన్స్ ఇండస్ట్రీస్ స్పష్టం చేసింది. డీ34 క్షేత్రం అభివృద్ధికై ఫ్రంట్ ఎండ్ ఇంజనీరింగ్ డిజైన్‌ను పూర్తి చేసినట్టు తెలిపింది. నవంబరు నుంచి పనులు ప్రారంభించి, 2017లో గ్యాస్ ఉత్పత్తి చేయాలన్న లక్ష్యంతో కావాల్సిన పరికరాలకు టెండర్లను ఆహ్వానించినట్టు పేర్కొంది. ‘రాబోయే రోజుల్లో సహజ వాయువు ధరపై స్పష్టత లేదు. ప్రస్తుత, భవిష్యత్ పెట్టుబడి ప్రణాళికలు సంకటంలో పడ్డాయి.
దీని వల్ల లక్ష్యం మరో ఏడాది ఆలస్యం అవుతుంది’ అని రిలయన్స్ వెల్లడించింది. సవరించిన సహజ వాయువు ధరల అమల్లో జాప్యంపై రిలయన్స్ ఇండస్ట్రీస్, దాని భాగస్వామ్య సంస్థలు బీపీ, నికో రిసోర్సెస్‌లు భారత ప్రభుత్వానికి ఆర్బిట్రేషన్ (మధ్యవర్తిత్వ) నోటీసు జారీచేసిన సంగతి తెలిసిందే. కేజీ డీ6 క్షేత్రంలో ఉత్పత్తి అయ్యే గ్యాస్‌కు పెంచిన ధర ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రావాల్సి ఉంది. ఐదేళ్లపాటు మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్లకు 4.205 డాలర్లు చెల్లించాలన్న ఒప్పందం గడువు ఇప్పటికే ముగిసింది. ఈలోగా ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఎన్నికలు పూర్తయ్యే వరకు కొత్త రేటు ప్రకటనను వాయిదావేయాలని ప్రభుత్వాన్ని ఎన్నికల సంఘం కోరింది.