Rising water level
-
శ్రీశైలంలోకి 96,369 క్యూసెక్కులు
సాక్షి, అమరాతి/శ్రీశైలంప్రాజెక్ట్: శ్రీశైలం ప్రాజెక్టులోకి కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఆదివారం సాయంత్రం 6 గంటలకు 96,369 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటినిల్వ 822.5 అడుగులకు చేరింది. జలాశయంలో నీరు 42.73 టీఎంసీలకు చేరుకుంది. కట్టలేరు, మున్నేరు పరవళ్లు తొక్కుతుండటంతో ప్రకాశం బ్యారేజ్‌లోకి 13,634 క్యూసెక్కుల నీరు వస్తోంది. ఇక్కడ 17 గేట్లు ఒక అడుగుమేర ఎత్తి 12,325 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. కృష్ణా ప్రధాన ఉపనది తుంగభద్రలో వరద ఉద్ధృతి మరింత పెరిగింది. తుంగభద్ర డ్యామ్‌లోకి 1,17,647 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటినిల్వ 78.67 టీఎంసీలకు చేరింది. మూడురోజుల్లో తుంగభద్ర డ్యామ్ నిండే అవకాశం ఉంది. అప్పుడు గేట్లు ఎత్తి దిగువకు వరదను విడుదల చేస్తారు. -
19 గ్రామాలకు రాకపోకలు బంద్..
సాక్షి, పశ్చిమగోదావరి: గోదావరి నదికి ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఉప నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం వద్ద గోదావరి ఉధృతి గంట గంటకు పెరుగుతుంది. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు వద్ద 24.75 మీటర్లు చేరింది. ఇప్పటికే స్పిల్ ఛానల్ కు అనుసంధానంగా ఉన్న గోదావరి గట్టు తెగిపోవడంతో స్పిల్ ఛానల్ మొత్తం వరద నీటితో నిండిపోయింది. పోలవరం వద్ద 10.61 వరకు నీటిమట్టం నమోదయింది. ప్రాజెక్ట్ ఎగువన ఉన్న కొత్తూరు కాజ్వే పైకి 5 అడుగులు నీరు చేరడంతో సుమారు 19 గిరిజన గ్రామాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రతి సంవత్సరం గోదావరికి వరద వచ్చే సమయంలో కొత్తూరు కాజ్వే పై వరద నీరు చేరడంతో గిరిజన గ్రామాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. అయితే గోదావరి అడ్డుగా ఎగువ కాపర్ డ్యామ్ నిర్మించడంతో గోదావరి వరద తక్కువగా వచ్చిన ఉధృతి పెరిగి గిరిజన గ్రామాలను ముంచెత్తుతుంది. ప్రస్తుతం గోదావరి ఉధృతి గంట గంటకు పెరుగుతుండడంతో నిర్వాసిత గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. కొత్తూరు కాజ్వే పై రాకపోకలకు పోలీసులు ఆంక్షలు విధించారు. గిరిజనులు ప్రయాణించేందుకు పడవలను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. -
ఎస్ ఆర్ ఎస్ పి లో 60 వేల క్యూసెక్కుల ఇన్‌ప్లో
బాల్కొండ: నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్‌ప్రాజెక్ట్‌లోకి ఎగువ ప్రాంతాల నుంచి వరద ఉధృతి రోజు రోజుకు పెరుగుతోంది. గురువారం ప్రాజెక్ట్‌లోకి స్థానిక ఎగువ ప్రాంతాల నుంచి 60 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోందని ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు. దీంతో ప్రాజెక్ట్ నీటి మట్టం వేగంగా పెరుగుతోంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 1091(90 టీఎంసీలు) అడుగుల కాగా గురువారం సాయంత్రానికి ప్రాజెక్ట్‌లో 1072 (32.96 టీఎంసీల) అడుల నీరు నిల్వ ఉంది. ప్రస్తుత సీజన్లో ఇప్పటి వరకు 28 టీఎంసీల వరద నీరు వచ్చి చేరింది.