River areas
-
గంగా నదిలో హైలెస్సా..
ప్రపంచంలో నదుల మీదుగా సాగే అరుదైన, అత్యంత సుదీర్ఘమైన నౌకా ప్రయాణానికి పుణ్యక్షేత్రం వారణాసి వేదిక కానుంది. ఎంవీ గంగావిలాస్ అని పిలిచే ఈ నౌకా ప్రయాణం 27 నదుల మీదుగా సాగుతుంది. సాధారణంగా నౌక ప్రయాణాలంటే సముద్ర జలాల మీదుగా సాగుతాయి. కానీ ఇలా నదుల మీదుగా సాగే అరుదైన నౌకా ప్రయాణం భారత్‌లో ప్రారంభం కావడం ఇదే తొలిసారి. భారత్ ఘనమైన సంస్కృతి, చరిత్రలను తెలుసుకుంటూ, మన దేశ వారసత్వ పరంపరని అవగాహన చేసుకుంటూ, జాతీయ ఉద్యాన వనాల అందాలను తిలకిస్తూ ఈ ప్రయాణం సాగుతుంది. భారత్‌తో పాటు బంగ్లాదేశ్ చారిత్రక, సాంస్కృతిక మూలాలను తెలుసుకునే అద్భుతమైన అవకాశం ఈ ప్రయాణం ద్వారా లభిస్తుంది. భారత్‌లో పర్యాటక రంగానికి పెరుగుతున్న ఆదరణని దృష్టిలో ఉంచుకొని ఈ నౌక ప్రయాణాన్ని తీర్చి దిద్దారు. ఈ నెల 13, శుక్రవారం నాడు ఈ నౌక ప్రయాణాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో నౌకా ప్రయాణం విశేషాలేంటో తెలుసుకుందాం. ► వారణాసి నుంచి బయల్దేరే గంగా విలాస్ మొత్తం 3,200 కి.మీ. ప్రయాణించి బంగ్లాదేశ్ మీదుగా అసోంలో దిబ్రుగఢ్‌కు చేరుకుంటుంది. ► ఈ మొత్తం ప్రయాణానికి 51 రోజులు సమయం పడుతుంది. 27 నదుల్ని దాటుకుంటూ ప్రయాణం సాగుతుంది. ► మూడు అంతస్తులు ఉండే గంగా విలాస్‌లో 18 సూట్స్ ఉన్నాయి. ► గంగావిలాస్ మొదటి జర్నీ కోసం 32 మంది న్యూజిలాండ్ పర్యాటకులు ఏకంగా నౌక మొత్తాన్ని బుక్ చేసుకున్నారు. ► ఇందులో ప్రయాణానికి ఒక్కో వ్యక్తికి రోజుకి రూ.25,000 టిక్కెట్ ధరగా నిర్ణయించారు. అంటే మొత్తం ప్రయాణానికి 12 లక్షల 50 వేలు ఖర్చు అవుతుంది. ► antara luxury river cruises సైట్ ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకునే సదుపాయం ఉంది. ► 62 మీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పు , సౌకర్యవంతంగా ప్రయాణించడానికి వీలుగా 1.4 మీటర్ల డ్రాఫ్ట్ ఉంది . ► ప్రయాణికుల కోసం అత్యంత విలాసవంతమైన ఏర్పాట్లు చేశారు. ప్రతీ రోజూ నౌకలో సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. జిమ్, స్పా వంటి సదుపాయాలతో పాటు వ్యక్తిగతంగా బట్లర్ సర్వీసు, నౌకపైకి వెళ్లి ప్రయాణాన్ని ఎంజాయ్ చేసే అవకాశం ఉంటుంది. ► ప్రపంచ వారసత్వ కట్టడాలు, జాతీయ ఉద్యానవనాలు, నదుల ఒడ్డున ఉండే పుణ్యక్షేత్రాలు, చారిత్రక ప్రాధాన్యం కలిగిన పట్టణాలు వంటి 50 పర్యాటక ప్రాంతాలను సందర్శించవచ్చు. ► బిహార్‌లో పట్నా, జార్ఖండ్‌లో సాహిబ్‌గంజ్, పశ్చిమ బెంగాల్లో కోలకతా, బంగ్లాదేశ్‌లో ఢాకా, అసోంలో గౌహతి పట్టణాలను గంగా విలాస్ కవర్ చేస్తుంది. ► బీహార్ స్కూల్ ఆఫ్ యోగ, విక్రమశిల యూనివర్సిటీలను విజ్ఞానం పంచే ప్రాంతాలు, సుందర్బన్స్, బెంగాల్ డెల్టా ప్రాంతాలు, కజిరంగ నేషనల్ పార్క్ వంటి జాతీయ ఉద్యానవనాలను సందర్శించవచ్చు. ► మొదటి రోజు వారణాసిలో గంగా హారతిని సందర్శించిన అనంతరం ఈ నౌక బయల్దేరుతుంది. ఎనిమిదో రోజు పట్నాకి, 20వ రోజు కోల్‌కతాకి 35వ రోజున బంగ్లాదేశ్‌లో ఢాకాకి చేరుకుంటుంది. ఇక 50వ రోజు అంటే మార్చి 1న తిరిగి అసోంలోని దిబ్రుగఢ్‌కి చేరుకుంటుంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
నదీతీర ఆలయాలకు మహర్దశ
కృష్ణా పుష్కరాల కోసం తళుకుబెళుకులు 30 దేవాలయాల వరకు గుర్తింపు దుర్గగుడి అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి విజయవాడ : నదీతీర ప్రాంతాల్లోని దేవాలయాలకు మహర్దశ పట్టనుంది. వచ్చే ఏడాది జరిగే కృష్ణా పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని వీటిని అభివృద్ధి చేయాలని దేవాదాయ శాఖ నిర్ణయించింది. నదీ స్నానం చేసిన తరువాత భక్తులు దైవదర్శనానికి ప్రాధ్యానమిస్తారు. గోదావరి పుష్కరాల సందర్భంగా అక్కడి నదీ తీర ఆలయాలకు భక్తుల తాకిడి భారీగా పెరిగిన విషయం తెలిసిందే. లక్షలాది మంది భక్తులు దేవాలయాలను దర్శించుకున్నారు. మొక్కుబడులు, కానుకలు కూడా భారీగా చెల్లించుకున్నారు. దీనిని గుర్తించిన దేవాదాయ శాఖ ఇక్కడి దేవాలయాలను కూడా అందంగా తీర్చిదిద్దేందుకు తగిన ప్రణాళికలు ఇప్పటినుంచే రూపొందిస్తోంది. 10 కిలోమీటర్ల పరిధిలోని ఆలయాల అభివృద్ధికి నిర్ణయం... కృష్ణానది ప్రవహిస్తున్న 16 మండలాల్లోని పది కిలోమీటర్ల పరిధిలో ఉన్న అన్ని దేవాలయాలను అభివృద్ధి చేయాలని దేవాదాయ శాఖ నిర్ణయించింది. నదీతీర ప్రాంతంలో ఉన్న వేదాద్రి యోగానంద లక్ష్మీనరసింహస్వామి దేవాలయం, ముక్త్యాల భవానీముక్తేశ్వరస్వామి ఆలయం, యనమలకుదురు రామలింగేశ్వరస్వామి ఆలయం, మోపిదేవి శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణేశ్వరస్వామి ఆలయం, హంసలదీవి వేణుగోపాలస్వామి ఆలయం తదితర 30 దేవాలయాలను దేవాదాయ శాఖ అధికారులు ఇప్పటికే గుర్తించినట్లు ఆ శాఖ అసిస్టెంట్ కమిషనర్ దుర్గాప్రసాద్ ‘సాక్షి’కి తెలిపారు. నదీతీర ప్రాంతంలో ఉన్న దేవాలయాలు సాధారణంగా మహాశివరాత్రి, కార్తీక మాసం, ఇతర పర్వదినాల్లో భక్తులతో పోటెత్తుతూ ఉంటాయి. ఆయా సమయాల్లో ఏయే దేవాలయాలకు ఎంతెంత మంది భక్తులు వస్తూ ఉంటారనే సమాచారాన్ని అధికారులు సేకరిస్తున్నారు. విజయవాడపై పుష్కర భక్తుల రద్దీని తగ్గించేందుకు జగ్గయ్యపేట నుంచి అవనిగడ్డ వరకు ఘాట్లను అభివృద్ధి చేయడంతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులను వారికి దగ్గరగా ఉండే ఘాట్లకు పంపే విధంగా జిల్లా యంత్రాంగం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఘాట్లకు వచ్చే భక్తుల రద్దీని బట్టి దేవాలయాలకు రద్దీ పెరుగుతుందని, అందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు దుర్గాప్రసాద్ వివరించారు. రద్దీని తట్టుకునేలా క్యూ లైన్లు... దేవాలయాలను రంగులతో ఆకట్టుకునేవిధంగా తీర్చిదిద్దనున్నారు. భక్తుల రద్దీని తట్టుకునేందుకు వీలుగా క్యూలైన్లు, బారికేడింగ్‌లు ఏర్పాటు చేస్తారు. దేవాలయాల్లో ఫ్లోరింగ్, లైటింగ్ తదితర మరమ్మతులు చేయించనున్నారు. భక్తులకు మంచినీటి సౌకర్యం, వస్తువులు భద్రపరుచుకునేందుకు తాత్కాలిక క్లోక్ రూమ్‌లు, తలనీలాలు సమర్పించేందుకు తాత్కాలిక కేశఖండన శాలలు, క్షురకుల ఏర్పాటు, మంచినీటి సౌకర్యం, వైద్య సౌకర్యాలు కల్పించాలని నిర్ణయించారు. భక్తులు కూర్చుని సేదతీరేందుకు వీలుగా చలువ పందిళ్లు ఏర్పాటు చేస్తారు. జిల్లాలోని నదీపరీవాహక ప్రాంతంలో లేని దేవాలయ సిబ్బందితో పాటు ఇతర జిల్లాల నుంచి సిబ్బందిని రప్పించి వారి సేవలు వినియోగించుకునేందుకు సిద్ధమవుతున్నారు. త్వరలో ప్రణాళికలు సిద్ధం... గోదావరి నదీ తీర ప్రాంతంలోని దేవాలయాల మరమ్మతులకు దేవాదాయ శాఖ ఈ ఏడాది ప్రత్యేకంగా నిధులు విడుదల చేసింది. అదే తరహాలోనే ఇక్కడి దేవాలయాలకు నిధులు విడుదల చేస్తామని ఇటీవల దేవాదాయ శాఖ కమిషనర్ వై.వి.అనూరాధ తెలిపారు. ఈ నేపథ్యంలో పురాతన దేవాలయాలకు పూర్తి హంగులు సమకూర్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఒక్కొక్క దేవాలయానికి ఎంత ఖర్చు అవుతుందో లెక్కలు వేస్తున్నారు. త్వరలోనే ఒక నివేదిక ఆర్జేసీ ద్వారా కమిషనర్‌కు పంపుతామని దేవాదాయ శాఖ అధికారులు చెబుతున్నారు. దుర్గగుడిలో అదనపు సౌకర్యాలు... కృష్ణా పుష్కరాల నేపథ్యంలో శ్రీదుర్గామల్లేశ్వరస్వామి దేవస్థాన అభివృద్ధిపై ఈవో సీహెచ్ నర్సింగరావు ఇప్పటికే ఒకసారి సిబ్బందితో సమీక్ష సమావేశాలు నిర్వహించారు. కృష్ణాపుష్కరాల 12 రోజులూ భక్తులతో కిటకిటలాడుతుంది కాబట్టి దసరా ఉత్సవాలు, భవానీ దీక్షల్లో ఏవిధంగా ఏర్పాట్లు చేస్తామో అదే తరహాలో దేవాలయ దర్శన వేళలు ఎక్కువసేపు ఉంచడం, ప్రసాదాలు ఎక్కువగా తయారు చేయించడం, భక్తులు వేగవంతంగా దర్శనం పూర్తి చేసుకోవడం వంటి సౌకర్యాలు కల్పిస్తామని ఈవో తెలిపారు.