ప్రపంచంలో నదుల మీదుగా సాగే అరుదైన, అత్యంత సుదీర్ఘమైన నౌకా ప్రయాణానికి పుణ్యక్షేత్రం వారణాసి వేదిక కానుంది. ఎంవీ గంగావిలాస్ అని పిలిచే ఈ నౌకా ప్రయాణం 27 నదుల మీదుగా సాగుతుంది. సాధారణంగా నౌక ప్రయాణాలంటే సముద్ర జలాల మీదుగా సాగుతాయి. కానీ ఇలా నదుల మీదుగా సాగే అరుదైన నౌకా ప్రయాణం భారత్‌లో ప్రారంభం కావడం ఇదే తొలిసారి.
భారత్ ఘనమైన సంస్కృతి, చరిత్రలను తెలుసుకుంటూ, మన దేశ వారసత్వ పరంపరని అవగాహన చేసుకుంటూ, జాతీయ ఉద్యాన వనాల అందాలను తిలకిస్తూ ఈ ప్రయాణం సాగుతుంది. భారత్‌తో పాటు బంగ్లాదేశ్ చారిత్రక, సాంస్కృతిక మూలాలను తెలుసుకునే అద్భుతమైన అవకాశం ఈ ప్రయాణం ద్వారా లభిస్తుంది. భారత్‌లో పర్యాటక రంగానికి పెరుగుతున్న ఆదరణని దృష్టిలో ఉంచుకొని ఈ నౌక ప్రయాణాన్ని తీర్చి దిద్దారు. ఈ నెల 13, శుక్రవారం నాడు ఈ నౌక ప్రయాణాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో నౌకా ప్రయాణం విశేషాలేంటో తెలుసుకుందాం.
► వారణాసి నుంచి బయల్దేరే గంగా విలాస్ మొత్తం 3,200 కి.మీ. ప్రయాణించి బంగ్లాదేశ్ మీదుగా అసోంలో దిబ్రుగఢ్‌కు చేరుకుంటుంది.
► ఈ మొత్తం ప్రయాణానికి 51 రోజులు సమయం పడుతుంది. 27 నదుల్ని దాటుకుంటూ ప్రయాణం సాగుతుంది.
► మూడు అంతస్తులు ఉండే గంగా విలాస్‌లో 18 సూట్స్ ఉన్నాయి.
► గంగావిలాస్ మొదటి జర్నీ కోసం 32 మంది న్యూజిలాండ్ పర్యాటకులు ఏకంగా నౌక మొత్తాన్ని బుక్ చేసుకున్నారు.
► ఇందులో ప్రయాణానికి ఒక్కో వ్యక్తికి రోజుకి రూ.25,000 టిక్కెట్ ధరగా నిర్ణయించారు. అంటే మొత్తం ప్రయాణానికి 12 లక్షల 50 వేలు ఖర్చు అవుతుంది.
► antara luxury river cruises సైట్ ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకునే సదుపాయం ఉంది.
► 62 మీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పు , సౌకర్యవంతంగా ప్రయాణించడానికి వీలుగా 1.4 మీటర్ల డ్రాఫ్ట్ ఉంది .
► ప్రయాణికుల కోసం అత్యంత విలాసవంతమైన ఏర్పాట్లు చేశారు. ప్రతీ రోజూ నౌకలో సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. జిమ్, స్పా వంటి సదుపాయాలతో పాటు వ్యక్తిగతంగా బట్లర్ సర్వీసు, నౌకపైకి వెళ్లి ప్రయాణాన్ని ఎంజాయ్ చేసే అవకాశం ఉంటుంది.
► ప్రపంచ వారసత్వ కట్టడాలు, జాతీయ ఉద్యానవనాలు, నదుల ఒడ్డున ఉండే పుణ్యక్షేత్రాలు, చారిత్రక ప్రాధాన్యం కలిగిన పట్టణాలు వంటి 50 పర్యాటక ప్రాంతాలను సందర్శించవచ్చు.
► బిహార్‌లో పట్నా, జార్ఖండ్‌లో సాహిబ్‌గంజ్, పశ్చిమ బెంగాల్‌లో కోలకతా, బంగ్లాదేశ్‌లో ఢాకా, అసోంలో గౌహతి పట్టణాలను గంగా విలాస్ కవర్ చేస్తుంది.
► బీహార్ స్కూల్ ఆఫ్ యోగ, విక్రమశిల యూనివర్సిటీలను విజ్ఞానం పంచే ప్రాంతాలు, సుందర్‌బన్స్, బెంగాల్ డెల్టా ప్రాంతాలు, కజిరంగ నేషనల్ పార్క్ వంటి జాతీయ ఉద్యానవనాలను సందర్శించవచ్చు.
► మొదటి రోజు వారణాసిలో గంగా హారతిని సందర్శించిన అనంతరం ఈ నౌక బయల్దేరుతుంది. ఎనిమిదో రోజు పట్నాకి, 20వ రోజు కోల్‌కతాకి 35వ రోజున బంగ్లాదేశ్‌లో ఢాకాకి చేరుకుంటుంది. ఇక 50వ రోజు అంటే మార్చి 1న తిరిగి అసోంలోని దిబ్రుగఢ్‌కి చేరుకుంటుంది.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment