నదీతీర ఆలయాలకు మహర్దశ | River temples to the boom | Sakshi
Sakshi News home page

నదీతీర ఆలయాలకు మహర్దశ

Published Mon, Aug 17 2015 1:23 AM | Last Updated on Sun, Sep 3 2017 7:33 AM

నదీతీర ఆలయాలకు  మహర్దశ

నదీతీర ఆలయాలకు మహర్దశ

కృష్ణా పుష్కరాల కోసం తళుకుబెళుకులు
30 దేవాలయాల  వరకు గుర్తింపు
దుర్గగుడి అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి

 
విజయవాడ : నదీతీర ప్రాంతాల్లోని దేవాలయాలకు మహర్దశ పట్టనుంది. వచ్చే ఏడాది జరిగే కృష్ణా పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని వీటిని అభివృద్ధి చేయాలని దేవాదాయ  శాఖ నిర్ణయించింది. నదీ స్నానం చేసిన తరువాత భక్తులు దైవదర్శనానికి ప్రాధ్యానమిస్తారు. గోదావరి పుష్కరాల సందర్భంగా అక్కడి నదీ తీర ఆలయాలకు భక్తుల తాకిడి భారీగా పెరిగిన విషయం తెలిసిందే. లక్షలాది మంది భక్తులు దేవాలయాలను దర్శించుకున్నారు. మొక్కుబడులు, కానుకలు కూడా భారీగా చెల్లించుకున్నారు. దీనిని గుర్తించిన దేవాదాయ శాఖ ఇక్కడి దేవాలయాలను కూడా అందంగా తీర్చిదిద్దేందుకు తగిన ప్రణాళికలు ఇప్పటినుంచే రూపొందిస్తోంది.
 
10 కిలోమీటర్ల పరిధిలోని ఆలయాల అభివృద్ధికి నిర్ణయం...

 కృష్ణానది ప్రవహిస్తున్న 16 మండలాల్లోని పది కిలోమీటర్ల పరిధిలో ఉన్న అన్ని దేవాలయాలను అభివృద్ధి చేయాలని దేవాదాయ శాఖ నిర్ణయించింది. నదీతీర ప్రాంతంలో ఉన్న వేదాద్రి యోగానంద లక్ష్మీనరసింహస్వామి దేవాలయం, ముక్త్యాల భవానీముక్తేశ్వరస్వామి ఆలయం, యనమలకుదురు రామలింగేశ్వరస్వామి ఆలయం, మోపిదేవి శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణేశ్వరస్వామి ఆలయం, హంసలదీవి వేణుగోపాలస్వామి ఆలయం తదితర 30 దేవాలయాలను దేవాదాయ శాఖ అధికారులు ఇప్పటికే గుర్తించినట్లు ఆ శాఖ అసిస్టెంట్ కమిషనర్ దుర్గాప్రసాద్ ‘సాక్షి’కి తెలిపారు. నదీతీర ప్రాంతంలో ఉన్న దేవాలయాలు సాధారణంగా మహాశివరాత్రి, కార్తీక మాసం, ఇతర పర్వదినాల్లో భక్తులతో పోటెత్తుతూ ఉంటాయి. ఆయా సమయాల్లో ఏయే దేవాలయాలకు ఎంతెంత మంది భక్తులు వస్తూ ఉంటారనే సమాచారాన్ని అధికారులు సేకరిస్తున్నారు. విజయవాడపై పుష్కర భక్తుల రద్దీని తగ్గించేందుకు జగ్గయ్యపేట నుంచి అవనిగడ్డ వరకు ఘాట్లను అభివృద్ధి చేయడంతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులను వారికి దగ్గరగా ఉండే ఘాట్లకు పంపే విధంగా జిల్లా యంత్రాంగం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఘాట్లకు వచ్చే భక్తుల రద్దీని బట్టి దేవాలయాలకు రద్దీ పెరుగుతుందని, అందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు దుర్గాప్రసాద్ వివరించారు.

రద్దీని తట్టుకునేలా క్యూ లైన్లు...
 దేవాలయాలను రంగులతో ఆకట్టుకునేవిధంగా తీర్చిదిద్దనున్నారు. భక్తుల రద్దీని తట్టుకునేందుకు వీలుగా క్యూలైన్లు, బారికేడింగ్‌లు ఏర్పాటు చేస్తారు. దేవాలయాల్లో ఫ్లోరింగ్, లైటింగ్ తదితర మరమ్మతులు చేయించనున్నారు. భక్తులకు మంచినీటి సౌకర్యం, వస్తువులు భద్రపరుచుకునేందుకు తాత్కాలిక క్లోక్ రూమ్‌లు, తలనీలాలు సమర్పించేందుకు తాత్కాలిక కేశఖండన శాలలు, క్షురకుల ఏర్పాటు, మంచినీటి సౌకర్యం, వైద్య సౌకర్యాలు కల్పించాలని నిర్ణయించారు. భక్తులు కూర్చుని సేదతీరేందుకు వీలుగా చలువ పందిళ్లు ఏర్పాటు చేస్తారు. జిల్లాలోని నదీపరీవాహక ప్రాంతంలో లేని దేవాలయ సిబ్బందితో పాటు ఇతర జిల్లాల నుంచి సిబ్బందిని రప్పించి వారి సేవలు వినియోగించుకునేందుకు సిద్ధమవుతున్నారు.

 త్వరలో ప్రణాళికలు సిద్ధం...
 గోదావరి నదీ తీర ప్రాంతంలోని దేవాలయాల మరమ్మతులకు దేవాదాయ శాఖ ఈ ఏడాది ప్రత్యేకంగా నిధులు విడుదల చేసింది. అదే తరహాలోనే ఇక్కడి దేవాలయాలకు నిధులు విడుదల చేస్తామని ఇటీవల దేవాదాయ శాఖ కమిషనర్ వై.వి.అనూరాధ తెలిపారు. ఈ నేపథ్యంలో పురాతన దేవాలయాలకు పూర్తి హంగులు సమకూర్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఒక్కొక్క దేవాలయానికి ఎంత ఖర్చు అవుతుందో లెక్కలు వేస్తున్నారు. త్వరలోనే ఒక నివేదిక ఆర్జేసీ ద్వారా కమిషనర్‌కు పంపుతామని దేవాదాయ శాఖ అధికారులు చెబుతున్నారు.

దుర్గగుడిలో అదనపు సౌకర్యాలు...
 కృష్ణా పుష్కరాల నేపథ్యంలో శ్రీదుర్గామల్లేశ్వరస్వామి దేవస్థాన అభివృద్ధిపై ఈవో సీహెచ్ నర్సింగరావు ఇప్పటికే ఒకసారి సిబ్బందితో సమీక్ష సమావేశాలు నిర్వహించారు.   కృష్ణాపుష్కరాల 12 రోజులూ భక్తులతో కిటకిటలాడుతుంది కాబట్టి దసరా ఉత్సవాలు, భవానీ దీక్షల్లో ఏవిధంగా ఏర్పాట్లు చేస్తామో అదే తరహాలో దేవాలయ దర్శన వేళలు ఎక్కువసేపు ఉంచడం, ప్రసాదాలు ఎక్కువగా తయారు చేయించడం, భక్తులు వేగవంతంగా దర్శనం పూర్తి చేసుకోవడం వంటి సౌకర్యాలు కల్పిస్తామని ఈవో  తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement