అంబులెన్స్‌లో తీసుకెళ్లి నది పక్కన పడేశారు
కాన్పూర్: వైద్యం కోసం వచ్చిన ఓ మహిళా రోగికి చికిత్స అందించపోగా ఆమె పట్ల కర్కశంగా ప్రవర్తించిన ఇద్దరు వైద్యులపై వేటు పడింది. ఆమెను గంగా నది వంతెనపై పడేసి వచ్చినందుకు ఆ వైద్యులను మూడు నెలల పాటు సస్పెండ్ చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో చోటుచేసుకుంది. కృష్ణ దేవీ అనే మహిళ గతవారం రైలు ప్రమాదానికి గురై గణేశ్ శంకర్ విద్యార్థి మెమోరియల్ మెడికల్ కాలేజ్‌లో చికిత్స కోసం చేరింది.
అయితే, అందులోని వివేక్ నాయర్, ఇఫ్తికార్ అన్సారీ అనే జూనియర్ డాక్టర్లు ఆమెను ఆస్పత్రి నుంచి అంబులెన్స్‌లో తీసుకెళ్లి గంగా నది బ్యారేజ్ వద్ద పడేసి వచ్చారు. ఆమెను తెల్లవారాక పోలీసులు గుర్తించి వివరాలు తెలుసుకోగా జరిగిన ఘటన మొత్తం చెప్పింది. దీంతో ఆమెను తిరిగి అదే ఆస్పత్రిలో చేర్పించారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న సీనియర్ వైద్యులు జూనియర్ డాక్టర్లను తీవ్రంగా మందలించారు. ఘటనపై ముగ్గురు వైద్యులతో విచారణ ప్రారంభించి వారిపై మూడు నెలల సస్పెన్షన్ వేటు వేశారు.