river boards
-
దూకుడుకు కళ్లెం పడేనా?
సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని నిర్దేశిస్తూ కేంద్రం వెలువరించిన గెజిట్ నోటిఫికేషన్ అమలుకు అటు కేంద్రం, ఇటు బోర్డులు చర్యలు చేపడుతున్న నేపథ్యంలో, దీనిని అడ్డుకునే దిశగా తెలంగాణ మరోమారు రంగంలోకి దిగుతోంది. అక్టోబర్ 14నుంచి గెజిట్ అమల్లోకి వచ్చేందుకు కేవలం 20 రోజుల వ్యవధి మాత్రమే ఉంది. అయితే ఇంతవరకు బోర్డుల స్వరూపమే సిద్ధం కాలేదనే కారణంతో గెజిట్ అమలు వాయిదా వేయించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా సీఎం కె.చంద్రశేఖర్‌రావు మరోమారు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ను కలవాలని నిర్ణయించారు. ఈ నెల 25న షెకావత్‌తో భేటీ కానున్న సీఎం..గెజిట్‌పైనే చర్చించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. గెజిట్ అమలుపై చర్యలు వేగిరం ఈ నెల 6న భేటీ సందర్భంగా కూడా గెజిట్ అమలును వాయిదా వేయాలని షెకావత్‌ను కేసీఆర్ కోరారు. అమలుకు గడువు తక్కువగా ఉండ డంతో.. సిబ్బంది నియామకం, వ్యవస్థ స్థాపన, ప్రాజెక్టులకు అనుమతులు, పర్యవేక్షణ తదితర సమస్యలు ఆటంకంగా మారతాయని వివరిం చారు. దీనిపై ఆ భేటీలో కేంద్రం ఎలాంటి నిర్ణయం చెప్పకున్నా, తర్వాతైనా సానుకూలంగా స్పందించ వచ్చని తెలంగాణ ఎదురుచూసింది. అయితే దీనిపై ఎలాంటి సానుకూల నిర్ణయాలు వెలువడక పోగా.. గెజిట్ అమలు దిశగా కేంద్రం, బోర్డులు చర్యలు వేగిరం చేశాయి. గెజిట్ నోటిఫికేషన్లో పేర్కొన్న ప్రధాన ప్రాజెక్టులన్నింటికీ సీఐఎస్ఎఫ్ సిబ్బంది నియామకం అంశాన్ని తెరపైకి తెచ్చాయి. సీఐఎస్ ఎఫ్ సిబ్బందికి అవసరమయ్యే వసతి సౌకర్యాలు, మౌలిక వసతులు, వాహనాలు, కార్యాలయాల ఏర్పాటు, వారి జీతభత్యాలకు సంబంధించి ఓ ముసాయిదా పత్రాన్ని అందజేసి దానిపై ప్రభుత్వా ల వివరణలు కోరాయి. రెండు నదీ బేసిన్లపై ఉన్న ప్రాజెక్టులు, కాలువల వ్యవస్థ, విద్యుదుత్పత్తి కేంద్రాలు, సరఫరా చేసే వ్యవస్థలు, కార్యాలయాల ప్రాంగణాల వివరాలతో పాటు ప్రాజెక్టుల డీపీఆర్ లను పది రోజుల్లో తమకు సమర్పించాలని ఆదేశిం చాయి. ఆపరేషన్ అండ్ మెయింటినెన్స్ చూస్తున్న ఏజెన్సీల వివరాలు కోరాయి. వివాదాలపై విన్నపాలు..: బోర్డుల వేగాన్ని చూస్తే అక్టోబర్ 14 నుంచి గెజిట్ అమలు పక్కాగా ఉండనుందని తెలుస్తోంది. దీనిపై వెనకడుగు వేసే పరిస్థితులు కానరావడం లేదు. అయితే మరోపక్క గోదావరి మళ్లింపు జలాల అంశంపై ఏపీ, తెలం గాణ మధ్య లేఖల యుద్ధం జరుగుతోంది. ఈ నేపథ్యంలో గెజిట్ అమలు విషయంలో ఉన్న అభ్యంతరాలను సీఎం కేసీఆర్ కేంద్రమంత్రికి విన్నవించే అవకాశాలున్నట్లు అధికారులు చెబుతున్నారు. -
నేడు జలసౌధలో కృష్ణా, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు సబ్ కమిటీ సమావేశం
హైదరాబాద్: జలసౌధలో కృష్ణా, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుల సబ్ కమిటీ సమావేశం శుక్రవారం జరగనుంది. ఈ సమావేశానికి ఇరురాష్ట్రాల ఇంజనీర్లతో కూడిన ఏడుగురు సభ్యుల బృందం హాజరుకానుంది. కాగా, గెజిట్ నోటిఫికేషన్ అమలు, తీసుకోవాల్సిన చర్యలపై సబ్‌కమిటీ చర్చించనున్నట్లు తెలుస్తోంది. బోర్డులో సిబ్బంది నియామకం, బోర్డు పరిధిలో ఉండాల్సిన ప్రాజెక్టులు, అవసరమైన నిధులు, భద్రత అంశాలపై చర్చించే అవకాశం ఉంది. గెజిట్ నోటిఫికేషన్ అంశాలను అక్టోబర్ 14నుంచి అమలు చేయాలని కేఆర్ఎంబీ, జీఆర్‌ఎంబీలను కేంద్రం ఆదేశించింది. చదవండి: ఆంధ్రా ఆక్వా అంటే.. అమెరికాలో లొట్టలు! -
కేంద్రం గెజిట్ నోటిఫికేషన్‌ను ఆహ్వానిస్తున్నాం: సజ్జల
-
కేంద్రం గెజిట్ నోట్ విడుదల చేయడం శుభపరిణామం
సాక్షి, తూర్పుగోదావరి జిల్లా: నీటి ప్రాజెక్టుల నిర్వహణ విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు స్వాగతించారు. ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతను రివర్ మేనేజ్మెంట్ బోర్డులకు అప్పగిస్తూ కేంద్రం గెజిట్ విడుదల చేయటం శుభపరిణామమం అన్నారు. ఇరు రాష్ట్రాల మధ్య సయోధ్యకు ఇది దోహదపడుతుందని పేర్కొన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి జీవీఎల్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. కాగా రాజమండ్రిలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా... ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేయడం శుభపరిణామమని జీవీఎల్ హర్షం వ్యక్తం చేశారు. రానున్న పార్లమెంటు సమావేశాల్లో రాష్ట్రానికి సంబంధించిన సమస్యలు పరిష్కారమయ్యే దిశగా తమ వాణి వినిపిస్తామని పేర్కొన్నారు. -
కేంద్రం గెజిట్ నోటిఫికేషన్‌ను ఆహ్వానిస్తున్నాం: సజ్జల
సాక్షి, అమరావతి: కేంద్రం గెజిట్ నోటిఫికేషన్‌ను ఆహ్వానిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, న్యాయం తమ పక్కనే ఉందని.. విభజన సమయంలోనే బోర్డుల పరిధిని నిర్ణయించి ఉంటే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ పూర్తయ్యేది కాదన్నారు. విద్యుత్ ఉత్పత్తి కోసం నీళ్లను అడ్డగోలుగా వదిలేశారని.. తెలంగాణ ప్రభుత్వం ఏపీ ప్రయోజనాలకు గండి కొట్టిందని మండిపడ్డారు. తెలంగాణ దూకుడుగా ఉన్నా సంయమనం పాటించామన్నారు. సీఎం జగన్ రాజ్యాంగబద్ధంగా ఒత్తిడితెచ్చి విజయం సాధించారని అన్నారు. ఆయన తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. ‘‘ గెజిట్ నోటిఫికేషన్లో కొన్ని మార్చాల్సిన విషయాలున్నాయి. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌పై టీడీపీ అపోహలు సృష్టిస్తోంది. రాయలసీమకు సంబంధించి చంద్రబాబు వైఖరేంటి?. నామినేటెడ్ పదవుల్లో సామాజిక న్యాయం చేయాల్సి ఉంది. మహిళలకు 50శాతం ఇస్తున్నాం.. కసరత్తులో కొంత ఆలస్యం అయ్యింది. రేపు ఉదయం ప్రకటిస్తాం. విశాఖ స్టీల్స్ విషయంలో నిజాయితీతో పోరాటం చేస్తున్నాం’’ అని అన్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య ఇక జల వివాదాలు ఉండవు.. గెజిట్‌తో చాలా సమస్యలకు పరిష్కారం లభించిందని ఎంపీ మిథున్‌రెడ్డి అన్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య ఇక జల వివాదాలు ఉండవన్నారు. ఇరు రాష్ట్రాల మధ్య భేదాభిప్రాయాలు ఉండకూడదన్నారు. తెలుగు రాష్ట్రాల్లో రైతులెవరూ ఇబ్బంది పడకూడదని.. సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకోవడమే తమ కర్తవ్యమని ఎంపీ మిథున్‌రెడ్డి అన్నారు. -
జల వివాదాలకు చెక్.. కేంద్రం కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: గోదావరి, కృష్ణా ప్రాజెక్టుల్లో తరచూ రేగుతున్న జల వివాదాలకు చెక్‌పెట్టే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏడేళ్లుగా ఎటూ తేలకుండా వాయిదా పడుతూ వస్తున్న కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిని ఖరారు చేస్తూ గురువారం అర్ధరాత్రి కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. కృష్ణా బోర్డు సమర్ధవంతంగా పనిచేసేందుకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) బ్యాంక్ అకౌంట్లోకి 60 రోజుల్లోగా తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు చెరో రూ.200 కోట్ల చొప్పున జమ చేయాలని సూచించింది. నోటిఫికేషన్ విడుదలతో కృష్ణా, గోదావరి బేసిన్‌లోని ఉమ్మడి ప్రాజెక్టులు, వాటి నిర్వహణ, విద్యుదుత్పత్తి కేంద్రాలు, సిబ్బంది అంతా బోర్డుల పరిధిలోకి వచ్చాయి. ప్రాజెక్టుల నీటి నిర్వహణతో పాటు భద్రతను కేంద్ర బలగాలు పర్యవేక్షించనున్నాయి. ఈ నోటిఫికేషన్ జారీ చేసే నాటికి కేంద్రం ఆమోదించని ప్రాజెక్టుల పనులన్నింటిని ఇరు రాష్టాలు నిలిపివేయాలని పేర్కొంది. రెండో అపెక్స్ కౌన్సిల్ భేటీలో నిర్ణయించిన మేరకు అనుమతులు లేని ప్రాజెక్టులను అపెక్స్ కౌన్సిల్‌కు పంపి 6 నెలల్లోగా అనుమతులు తీసుకోవాలని సూచించింది. ఆరు నెలల్లో అనుమతి పొందకపోతే ఆ ప్రాజెక్టులను రద్దు చేసుకోవాలని, వాటి ద్వారా ఎలాంటి నీటిని తీసుకోరాదని స్పష్టం చేసింది. ఈ నోటిఫికేషన్ ఈ ఏడాది అక్టోబర్ 14 నుంచి అమల్లోకి వస్తుందని కేంద్రం వివరించింది. బోర్డుల పరిధిపై కుదరని అభిప్రాయం.. కృష్ణా, గోదావరి నదీ జలాల వినియోగంలో తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య విభేదాలు తలెత్తకుండా చూసేందుకు విభజన చట్టంలో సెక్షన్ 85(1) ప్రకారం కేంద్రం.. బోర్డులను ఏర్పాటు చేసింది. అయితే బోర్డులకు.. వాటి పరిధిని ఖరారు చేయకపోవడం, వర్కింగ్ మాన్యువల్‌ను నోటిఫై చేయకపోవడంతో వీటికి ఎలాంటి అధికారాలు లేవు. దీంతో రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలు తరచూ ఉత్పన్నమవుతున్నా బోర్డులు ఏమీ చేయలేకపోతున్నాయి. ఈ క్రమంలో తమ పరిధిని ఖరారు చేసి ప్రాజెక్టులపై పెత్తనం ఇవ్వాలని బోర్డులు కోరాయి. దీనిపై తెలంగాణ, ఏపీ మధ్య భిన్నాభిప్రాయాలున్నాయి. ప్రాజెక్టులను బోర్డు నియంత్రణలోకి తేవడాన్ని తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకించింది. ముఖ్యంగా కృష్ణా బేసిన్లో ఉమ్మడి రాష్ట్రానికి ఇచ్చిన జలాలను ప్రాజెక్టుల వారీగా కేటాయించలేదని, ఈ అంశంపై ప్రస్తుతం బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ విచారణ చేస్తోందని పేర్కొంది. విభజన చట్టం సెక్షన్–87 ప్రకారం ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు చేశాకనే బోర్డు పరిధిని నోటిఫై చేయాలని.. 2016, సెప్టెంబర్ 21న జరిగిన తొలి అపెక్స్ కౌన్సిల్ సమావేశంలోనూ, 2020, అక్టోబర్ 6న జరిగిన రెండో అపెక్స్ కౌన్సిల్ సమావేశంలోనూ ఇదే అంశాన్ని స్పష్టం చేసింది. అయితే ప్రాజెక్టులను బోర్డు నియంత్రణలోకి తేవాల్సిందేనని ఏపీ ఎప్పటి నుంచో కోరుతోంది. నాగార్జునసాగర్ ప్రాజెక్టు తెలంగాణ పరిధిలో ఉన్న కారణంగా ఆ రాష్ట్ర అధికారులు ప్రాజెక్టుపై పెత్తనం చేస్తున్నారని, తమ రాష్ట్రానికి నీరందించే కుడి కాల్వపై వారి పెత్తనమే కొనసాగుతున్న దృష్ట్యా బోర్డు నియంత్రణ అవసరమని చెబుతూ వచ్చింది. ఈ వైరుధ్యాలు ఉన్నా.. రెండో అపెక్స్ భేటీలో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ బోర్డుల పరిధిని ఖరారు చేసే అధికారం తమకుందని స్పష్టం చేశారు. అనంతరం ఈ ఏడాది ఏప్రిల్‌లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగిన సమావేశంలో దీనిపై చర్చించి నోటిఫికేషన్ ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుంది. గోదావరి.. బోర్డు పరిధిలోకి ఎందుకు... ఇక గోదావరి బేసిన్ ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తెచ్చుకోవడాన్ని తెలంగాణ తప్పుపడుతోంది. గోదావరి బేసిన్లో తెలంగాణ, ఏపీల మధ్య ఉమ్మడి ప్రాజెక్టులు లేవని, ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి నీటిని విడుదల చేసే రెగ్యులేటర్లు లేక ఇరురాష్ట్రాల మధ్య సంయుక్తంగా నిర్మించిన ప్రాజెక్టులు లేనందున దీని పరిధిని ఖరారు చేయ రాదని గతంలో కేంద్రానికి లేఖలు రాసింది. రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 87 ప్రకారం గతంలో ఉన్న అవార్డులు, అంతర్రాష్ట్ర నదీ వివా దాల చట్టం–1956 మేరకు ఏర్పడ్డ ట్రిబ్యునల్ల తీర్పులకు లోబడి కేంద్రం బోర్డుల పరిధిని నోటిఫై చేయాల్సి ఉంటుందని గుర్తు చేసింది. గోదావరి ట్రిబ్యునల్ అవార్డులో ప్రాజెక్టులను బోర్డుల పరిధికి తీసుకోవడానికి సంబంధించి ఎలాంటి అంశాలు లేవని దృష్టికి తెచ్చింది. కొత్త మార్గదర్శకాలను తెలంగాణ, ఏపీలోని గోదావరి ప్రాజెక్టులపై రుద్దరాదని స్పష్టం చేసింది. అయినా దీని పరిధిపైనా గెజిట్ ఇచ్చేందుకే కేంద్రం మొగ్గు చూపింది. కృష్ణా బోర్డు పరిధిలో.. కృష్ణా బోర్డు పరిధి నోటిఫై కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులన్నీ దాని పరిధిలోకి వెళ్లాయి. అందులో తుంగభద్ర జలాలపై ఆధారపడి ఉన్న హెచ్ఎల్సీ(హైలెవల్ కెనాల్), ఎల్ఎల్సీ(లోలెవల్ కెనాల్), కేసీ కెనాల్, తుమ్మిళ్ల, ఆర్డీఎస్, జూరాలపై ఆధారపడి ఉన్న విద్యుత్ కేంద్రం, బీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, శ్రీశైలంపై ఆధారపడ్డ తెలుగుగంగ, ఎస్ఆర్బీసీ, గాలేరు–నగరి, హంద్రీనీవా, ముచ్చు మర్రి, వెలిగొండ, కల్వకుర్తి, ఎస్ఎల్బీసీ, పాలమూరు-రంగారెడ్డి, డిండి, శ్రీలైలం కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాలు, సాగర్‌పై ఆధారపడిన కుడి, ఎడమ కాల్వలు, విద్యుదుత్పత్తి కేంద్రాలు, ఏఎంఆర్పీ, హెచ్ఎండబ్ల్యూఎస్, పులిచింతల వంటి ప్రాజెక్టులన్నీ బోర్డు పరిధిలోకి వచ్చాయి. అలాగే కాళేశ్వరం, దేవాదుల, నిజాంసాగర్, సింగూరు, ఎస్సారెస్పీ, లోయర్‌మానేరు, ఎల్లంపల్లి, మిడ్‌మానేరు, పోలవరం, ధవళేశ్వరం బ్యారేజీ, చింతలపూడి, పురుషోత్తపట్నం గోదావరి బోర్డు పరిధిలోకి వెళ్లాయి. ప్రధానికి రెండు దఫాలు సీఎం జగన్ లేఖలు బోర్డు పరిధి ఖరారైనందున కృష్ణా జలాల వినియోగంలో రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు తలెత్తే అవకాశం ఉండదని నీటిపారుదలరంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టులో నీటి మట్టం కనీస స్థాయి కంటే దిగువన ఉన్నప్పటికీ తెలంగాణ సర్కార్ అక్రమంగా ఎడమ గట్టు కేంద్రంలో జూన్ 1నే విద్యుదుత్పత్తిని ప్రారంభించింది. రాష్ట్ర ప్రభుత్వం దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ విద్యుదుత్పత్తిని నిలుపుదల చేయాలని కృష్ణా బోర్డుకు లేఖ రాసింది. అయితే తెలంగాణ సర్కారు కృష్ణా బోర్డు ఉత్తర్వులను తుంగలో తొక్కుతూ శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతలలో యథేచ్ఛగా విద్యుదుత్పత్తిని చేపట్టింది. కృష్ణా జలాలు వృథాగా సముద్రంలో కలిసే పరిస్థితిని సృష్టించి రాష్ట్ర హక్కులను కాలరాస్తున్న తెలంగాణ సర్కార్ తీరుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండుదఫాలు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌సింగ్ షెకావత్‌లకు లేఖలు రాశారు. గతేడాది అక్టోబర్ 6న అపెక్స్ కౌన్సిల్ రెండో సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు కృష్ణా బోర్డు పరిధిని తక్షణమే ఖరారు చేసి ఉమ్మడి ప్రాజెక్టులను బోర్డు అధీనంలోకి తేవాలని, వాటికి సీఐఎస్ఎఫ్ బలగాలతో భద్రత కల్పించి బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపుల మేరకు ఇరు రాష్ట్రాలకు నీటిని విడుదల చేయాలని కోరారు. కానీ.. తెలంగాణ సర్కార్ తీరులో మార్పు రాకపోవడంతో రాష్ట్ర హక్కులను పరిరక్షించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం సుప్రీం కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. విభజన చట్టం ప్రకారం కృష్ణా బోర్డు పరిధిని ఖరారు చేసేలా కేంద్రానికి నిర్దేశం చేయాలని సుప్రీం కోర్టుకు విజ్ఞప్తి చేసింది. ఈ నేపథ్యంలో రెండు బోర్డుల పరిధిని కేంద్రం ఖరారు చేసింది. -
నదీ బోర్డుల వ్యయాన్ని భరించలేం!
కేంద్రానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ స్పష్టీకరణ సాక్షి, హైదరాబాద్: నదీ బోర్డుల ఏర్పాటు ద్వారా అయ్యే అదనపు ఖర్చును భరించలేమని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లు కేంద్రానికి స్పష్టం చేసినట్టు సమాచారం. రాష్ట్ర విభజన జరిగినందున రెండు రాష్ట్రాల మధ్య నీటి తగాదాలు రాకుండా చూసేందుకు గోదావరి, కృష్ణా నదులపై ప్రత్యేకమైన బోర్డులు ఏర్పాటు చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల వంటి విషయాలను ఈ బోర్డులే పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా ప్రాజెక్టుల భద్రత కోసం కేంద్ర పారిశ్రామిక భద్రతా దళాన్ని (సీఐఎస్ఎఫ్) ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించారు. డీజీ స్థాయి అధికారి పర్యవేక్షణలో భద్రత కొనసాగనుంది. ఇందుకోసం ఏడాదికి రూ.300 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేస్తున్నారు. ఇందులో భాగంగా ఇటీవల కేంద్రం నుంచి ఇక్కడకు వచ్చిన ప్రత్యేకాధికారులు ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. త్వరలోనే భద్రతా దళాలు ఇక్కడికి వస్తాయని, వారికి అవసరమైన వాహనాలు, వసతి వంటి సౌకర్యాలను ఏర్పాటు చేయాలని రాష్ట్రాలకు సూచించారు. అయితే దీనిపై ఇరు రాష్ట్రాలు చర్చించుకుని ఈ వ్యయాన్ని భరించకూడదని నిర్ణయించుకున్నాయి. ఈ మేరకు కేంద్రానికి లేఖ రాసినట్టు సమాచారం. -
ఇరు రాష్ట్రాల నీటి విడుదలకు ప్రత్యేక కమిటీ
హైదరాబాద్: త్వరలో రెండు రాష్ట్రాలుగా విడిపోనున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి నీటిని విడుదల చేసేందుకు ఒక ప్రత్యేక కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. రెండు రాష్ట్రాలు విడివిడిగా రివర్ బోర్డ్స్ వేసుకునే వరకూ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు గాను ఈ కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో ఇరు రాష్ట్రాల నీటి పారుదలశాఖ ముఖ్య కార్యదర్శులు, ఇంజనీరింగ్ చీఫ్ లు, జెన్ కో డైరెక్టర్లు, శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల చీఫ్ ఇంజనీర్లను సభ్యులుగా నియమించనుంది. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రధాన రిజర్వాయర్ల నుంచి రెండు రాష్ట్రాల ఆయకట్టులకు నీటి విడుదలను పర్యవేక్షించనుంది.