పెన్నానదిలో పడి అన్నదమ్ముల మృతి
సెలవులు గడిపేందుకు మేనత్త ఇంటికి వెళ్లిన అన్నదమ్ములు ప్రమాదవశాత్తు పెన్నానదిలోపడి మృత్యువు ఒడిలోకి జారుకున్నారు. అనంతపురం జిల్లాలోని పెన్నా పరివాహక గ్రామమైన గార్లదిన్నె మండటం అగ్రహారంలో మంగళవారం ఈ ఘటన జరిగింది.
మృతులు యాడికి మండలం రాయలచెరువు గ్రామానికి చెందిన మనోజ్‌కుమార్ (17), ప్రశాంత్ (15) లు తల్లిదండ్రులతో కలసి కొద్దిరోజుల క్రితం అగ్రహారానికి వచ్చారు. మంగళవారం ఉదయం బంధువులతో కలసి పెన్నా నీళ్లు చూడాలన్న సరదాతో ప్రశాంత్ ఒడ్డు సమీపానికి వెళ్లగా వర్షానికి మట్టి తడిసి ఉండడంతో కాలు జారి నదీ నీటిలో పడిపోయాడు. తమ్ముడిని రక్షించేందుకు మనోజ్ కుమార్ కూడా నదిలోకి దిగడంతో ఇద్దరూ ఊపిరాడక మృతి చెందారు. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించడం అందరినీ కంటతడిపెట్టించింది. కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్లు ప్రారంభించారు.