రైతులకే రీయింబర్స్ చేస్తాం
రుణ మాఫీపై బ్యాంకర్లకు స్పష్టం చేసిన ప్రభుత్వం
రుణాలు రెన్యువల్ చేసి.. కొత్త రుణాలు ఇవ్వండి
రెన్యువల్ కాకుంటే పంటల బీమా కోల్పోయే ప్రమాదం
రేపటిలోగా బకాయిల విషయమై స్పష్టత ఇవ్వాలని సూచన
రిజర్వుబ్యాంక్ అనుమతించిన వంద మండలాల్లో రీషెడ్యూల్‌ను
వేగంగా పూర్తి చేయాలని విజ్ఞప్తి
ఒక్కో బ్యాంకు అధికారులతో ఆర్థిక, వ్యవసాయ శాఖ అధికారుల భేటీలు
హైదరాబాద్: రుణ మాఫీ కింద నిధులను నేరుగా రైతులకే రీయింబర్స్ చేస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకర్లకు స్పష్టం చేసిం ది. రుణమాఫీ కింద అందించే నిధులను బ్యాం కులకు ఇచ్చే అవకాశం లేదని పేర్కొంది. ఖరీఫ్ సీజన్లో రైతులకు ఇవ్వాల్సిన రుణాల మంజూ రు వేగం పెంచాలని, మాఫీ వర్తించే రుణాలను రెన్యువల్ చేసి, రైతులకు కొత్త రుణాలు అందజేయాలని కోరింది. ఎస్బీహెచ్, ఎస్బీఐ, ఆంధ్రాబ్యాంకు తదితర ప్రధాన బ్యాంకుల అధికారులతో ఆర్థిక, వ్యవసాయశాఖ అధికారులు గురువారం వేర్వేరుగా సమావేశాలు నిర్వహించారు. ఒక్కో బ్యాంకు అధికారులతో అరగంటకుపైగా జరిగిన ఈ భేటీల్లో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి నాగిరెడ్డి, ప్రత్యేక కార్యదర్శి రామకృష్ణారావు, వ్యవసాయ శాఖ కమిషనర్ జనార్దన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రుణ మాఫీ, ఖరీఫ్ రుణాల పంపిణీ అంశాలను వేర్వేరుగా పరిగణించాలని అధికారులు బ్యాంకర్లను కోరారు.
ఖరీఫ్ సీజన్ లో దాదాపు సగం కాలం పూర్తవుతున్న తరుణంలో ఇంకా రుణాలు అందకపోతే.. రైతులు మరింతగా రుణాల ఊబిలో కూరుకుపోయే ప్రమాదం ఉందని వివరించారు. అయితే ఈ ఖరీఫ్‌లో రూ. 27 వేల కోట్లకుపైగా పంట రుణా లు ఇవ్వాలని రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశంలో నిర్ణయించినా... ఇప్పటివరకు పదిశాతం రుణాలు కూడా ఇవ్వలేదు. రుణ మాఫీ ఆశతో రైతులు బకాయిలు చెల్లించకపోవడంతో.. బ్యాం కులు కొత్త రుణాలు ఇవ్వడం లేదు. రైతులెవరైనా బకాయిలు చెల్లిస్తే... వారికి అదేరోజు లేదా మరుసటి రోజున కొత్త రుణాలు ఇస్తున్నామని బ్యాంకులు చెబుతున్నాయి. అయితే ఈ విషయంలో రైతులను మరింత జాగృతం చేయాలని.. రుణాలు రెన్యువల్ చేసుకునే విధంగా చూడాలని అధికారులు కోరారు. రుణాల రెన్యువల్లో వేగం పెంచితే తప్ప.. కొత్త రుణా లు ఇవ్వడం సాధ్యం కాదని అందుకే దీనిపై దృష్టి పెట్టాలని బ్యాంకర్లకు సూచించారు. అలాగే రిజర్వుబ్యాంక్ అనుమతించిన మేరకు మూడు జిల్లాల్లోని వంద మండలాల్లో పంట రుణాల రీషెడ్యూల్ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి నాగిరెడ్డి బ్యాంకర్ల ను కోరారు. రీషెడ్యూల్ అయ్యే రుణాల మొత్తం ఎంతనే వివరాలను ప్రభుత్వానికి సమర్పించాలని కోరారు. అలాగే రైతులు రెన్యువల్ చేసుకుంటే తప్ప, వారికి పంటల బీమా వర్తించే అవకాశం లేనందున దీనిపై దృష్టి పెట్టాలని కోరారు. రుణమాఫీకి సంబంధించి శనివారం వరకు మొత్తం బకాయిలు ఎంతనే విషయంలో స్పష్టత ఇవ్వాలని సూచించారు. కాగా.. శుక్రవారం కూడా మరికొన్ని బ్యాంకుల అధికారులతో ఆర్థిక శాఖ అధికారులు సమావేశం కానున్నారు.
మాఫీపై వీడియో కాన్ఫరెన్స్..
రైతుల రుణ మాఫీకి సంబంధించి ప్రభుత్వ సీఎస్ రాజీవ్‌శర్మ సోమవారం జిల్లాల కలెక్టర్లు, బ్యాంకర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. రుణ మాఫీ అమలుకు ఇదివరకు జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రక్రియ ఎంత వరకు వచ్చిందన్న అంశంపై ఆయన సమీక్షించనున్నారు.