ట్రిపుల్ ఐటీ విద్యార్థి ఆత్మహత్యాయత్నం
కడప రిమ్స్‌కు తరలింపు
వేంపల్లె, న్యూస్‌లైన్ : ఆర్.కె.వ్యాలీ ట్రిపుల్ ఐటీలో ఎంటెక్ విద్యార్థి ఆదిత్య ఆదివారం సాయంత్రం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. దీంతో అతనిని కడప రిమ్స్‌కు తరలించారు. నూజివీడు క్యాంపస్‌కు సంబంధించి ఆరుగురు ఎంటెక్ విద్యార్థులు ఇడుపులపాయ ట్రిపుల్‌ఐటీలో ప్రాజెక్టు వర్క్ చేసేం దుకు 6నెలల క్రితం వచ్చారు. వీరిలో ఆదిత్య కూడా ఒకరు. వీరి ప్రాజెక్టు వర్క్ శనివారం నాటికే పూర్తయింది. ఆదివారం వారి గమ్యస్థానాలకు చేరాల్సి ఉంది. గుంటూరు జిల్లా చీరాలకు చెందిన ఆదిత్య ప్రాజెక్టు వర్క్‌లో తక్కువ మార్కులు వస్తాయన్న అనుమానంతో ఫ్యానుకు ఉరి వేసుకునేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది.
కొత్త క్యాంపస్‌లోని 63వ గదిలో సాయంత్రం బట్టలు ఆరేసుకునే వైరును తీసుకొని ఫ్యానుకు ఉరి వేసుకునేందుకు ప్రయత్నించారు. పక్కనున్న విద్యార్థులు గమనించి ఆదిత్యను కాపాడగలిగారు. ఇడుపులపాయ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అనంతరం కడప రిమ్స్‌కు తరలించారు. ఈ విషయమై ట్రిపుల్ ఐటీ డెరైక్టర్ కృష్ణారెడ్డిని వివరణ కోరగా ఆత్మహత్యయత్నానికి పాల్పడిన విద్యార్థి నూజివీడు క్యాంపస్‌కు చెందినవారని.. అతని తల్లిదండ్రులకు సమాచారం అందించినట్లు ఆయన తెలిపారు. ఎటువంటి ప్రాణాపాయంలేదని తెలిపారు.