తలాపునే గోదారి.. తాగేందుకు నీరేది?
తాగునీటి కోసం గ్రామస్తుల రాస్తారోకో
మెట్పల్లి ప్రధాన రహదారిపై గంటకుపైగా బైఠాయింపు
బాదన్‌కూర్తి(ఖానాపూర్) : చుట్టూ గోదావరి, బావుల్లో పుష్కలంగా భూగర్భ జలాలు ఉన్నా పాలకుల పట్టింపులేని ధోరణి, అధికారుల నిర్లక్ష్యంతో తాగడానికి గుక్కెడు నీరందించేవారు కరువయ్యారని మహిళలు నినదించారు. మండలంలోని బాదన్‌కూర్తి పంచాయతీ పరిధిలోని చింతల్‌పేట గ్రామంలో తాగునీటి సమస్య తీర్చాలని కోరుతూ మెట్పల్లి వెళ్లే ప్రధాన రహదారిపై మహిళలు గంటకుపైగా రాస్తారోకో చేశారు.
నీటి సరఫరాకు ముందస్తు ప్రణాళిక లేకే తాగడానికి నీరు కరువయ్యిందని, దీంతో దూర ప్రాంతం నుంచి బిందెల్లో నీటిని మోసుకోవాల్సి వస్తుందని మహిళలు తెలిపారు. మండు వేసవిలోను భూగర్బ జలాలు లేని సమయంలో ట్యాంకర్లతో నీటి సరఫరా చేసినప్పటికీ ఇప్పుడెందుకు పట్టించుకోవడం లేదని వారు ప్రశ్నించారు.
ఎంపీడీవో, తహసీల్దార్ రావాలంటు గంటపాటు రాస్తారోకో చేసినప్పటికీ ఎవరు రాలేదు. దీంతో ఎస్ఐ అజయ్‌బాబు చొరవ తీసుకొని ప్రయాణికుల ఇబ్బందులను దష్టిలో పెట్టుకొని ఆందోళన విరమించాలని కొరడంతో వారు శాంతించారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు గుడాల రాజన్నతో పాటు గ్రామస్తులు, జీ శంకర్, కొండ శంకర్, మదు, గంగరెడ్డి, బండి రాజు, సునీత, ఆశమ్మ, శ్యామల, లక్ష్మి, అమీనా, రాజలక్ష్మి, గౌరు, రజిత, చంద్రకళ తదితరులున్నారు.