Rocio Geraldine
-
నాలోని డ్రగ్స్ బలహీనతే ప్రత్యర్థికి వరంలా మారేది!
బ్యూనోస్ ఎయిర్స్: తనలోని పూర్తి స్థాయి ఆటగాడు బయట ప్రపంచానికి తెలియకపోవడానికి కారణాన్నిఅర్జెంటీనా మాజీ దిగ్గజం డిగో మారడోనా తాజాగా వెల్లడించాడు. ఇందుకు తనతో పాటు పాతుకుపోయి ఉన్న డ్రగ్స్ అలవాటే ప్రధాన కారణంగా పేర్కొన్నాడు. ఒక అర్జెంటీనా టెలివిజన్ కు ఇచ్చిన ఇంటర్యూలో మారడోనా పలు విషయాలను స్పష్టం చేశాడు. 'నేను డ్రగ్స్ కు బానిస అవ్వడం నా ఆటపై తీవ్ర ప్రభావం చూపింది. ఆ అలవాటే నాలోని నైపుణ్యాన్ని బయటకు రాకుండా చేసింది. నేను ఇప్పటికీ సాధారణ జీవితంలోకి రాకపోవడానికి కారణం యువకుడిగా ఉన్నప్పటి నాలోని ఛాయలు ఇంకా వదిలి వెళ్లకపోవడమే' అని మారడోనా ఆవేదన వ్యక్తం చేశాడు. చాలా సందర్భంల్లో తాను డ్రగ్స్ తీసుకోవటం ప్రత్యర్థులకు వరంలా మారేదని గతాన్ని గుర్తు చేసుకున్నాడు. 1986 వరల్డ్ కప్ సాధించిన అర్జెంటీనా టీంలో సభ్యుడైన మారోడానా.. అనంతరం ఆ జట్టుకు కోచ్ గా కూడా వ్యవహరించాడు. అయితే తాను కోచ్ గా 2010లో వీడ్కోలు చెప్పడాన్నిఇప్పటికీ తాను జీర్ణించుకోలేక పోతున్నానని స్పష్టం చేశాడు. ఒకవేళ అవకాశం వస్తే తిరిగి ఆ బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు. -
నన్ను మారడోనా ఇరికించాడు:మాజీ ప్రేయసి
బ్యూనోస్ ఎయిర్స్: అర్జెంటీనా ఫుట్ బాల్ మాజీ దిగ్గజం డిగో మారడోనా, మాజీ ప్రేయసి రోకియో ఒలివాల మధ్య వివాదం ఆసక్తికరంగా మారుతోంది. తన బంగారు ఆభరణాలను మాజీ ప్రేయసి రోకియో దోచుకెళ్లిందని మారడోనా ఆరోపిస్తుంటే.. తాను ఎటువంటి వస్తువులను దొంగిలించలేదని రోకియో గగ్గోలు పెడుతుంది. 'నేను మారడోనా బంగారు ఆభరణాలను దోచుకెళ్లలేదు. నన్ను కావాలని మారడోనా ఇరికించాడు. నేను అతని వద్ద నుంచి ఎటువంటి వస్తువులు తీసుకెళ్లలేదు' అంటూ రోకియో ఒలివా పేర్కొంది. ఈ రోజు బెయిల్ వచ్చిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తనను కావాలనే మారడోనా ఇరికిస్తున్నాడని కన్నీటి పర్యంతమైంది. ఆ ఘటనతో తనకు ఎటువంటి సంబంధం లేదని ఏకరుపు పెట్టింది. ఆమెను శుక్రవారం విచారించిన బ్యూనోస్ ఎయిర్స్ కోర్టు ఆమెకు నిబంధనలతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది. తన బంగారు ఆభరణాలను రోకియో దోచుకెళ్లిందని మారడోనా ఆరోపించడం తెలిసిందే. దీంతో ఆమెకు దుబాయ్ పోలీసులు అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. తన విలువైన వస్తువులను రోకియో అపహరించిందని మారడోనా ఆ ఫిర్యాదులో పేర్కొన్నాడు. -
మాజీ ప్రేయసి దోచుకెళ్లింది: మారడోనా ఫిర్యాదు
దుబాయ్: అర్జెంటీనా ఫుట్ బాల్ మాజీ ఆటగాడు డియాగో మారడోనా మాజీ ప్రేయసికి దుబాయ్ పోలీసులు అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. ఓ దొంగతనం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రోకియో గెరాల్డైనాను విచారించేందుకు దుబాయ్ అధికారులు అరెస్ట్ వారెంట్ జారీ చేసినట్టు పోలీసులు తెలిపారు. తనకు సంబంధించిన విలువైన వస్తువులను రోకియో గెరాల్డైనా దొంగిలించిందని మారడోనా దుబాయ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దుబాయ్ స్పోర్ట్స్ కౌన్సిల్ కు మారడోనా గ్లోబల్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. విలువైన వాచీలను, ఆభరణాలతోపాటు వేలాది దిర్హామ్ లను మార్చి 10 దొంగిలించిందని మారడోనా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫుట్ బాల్ క్రీడాకారిణి అయిన గెరాల్డెనా తన పై వచ్చిన ఆరోపణల్ని ఖండించినట్టు స్థానిక మీడియా కథనాల్ని ప్రచురంచింది. రోకియో గెరాల్డైనాను విచారించేందుకు ఇంటర్ పోల్ సహాయం తీసుకుంటున్నామని పోలీసులు తెలిపారు. గత ఫిబ్రవరిలో గెరాల్డెనాతో మారడొనాకు నిశ్చితార్ధం జరిగింది.