రెండు వారాలుగా సిమెంట్ కొనుగోళ్లు బంద్
‘ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది’ అన్నట్టుగా ఉంది భవన నిర్మాణ రంగ కార్మికుల పరిస్థితి. అమాంతం పెరిగిన సిమెంట్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ బిల్డర్ల జేఏసీ ఈనెల 5 నుంచి 20వ తేదీ (రెండు వారాలు) వరకు సిమెంట్ కొనుగోళ్లను నిలిపివేసింది. దీంతో హైదరాబాద్ నిర్మాణ రంగం పడకేసింది. దీంతో నిర్మాణ రంగంపై ఆధారపడిన కార్మికులు పనుల్లేక రోడ్డున పడ్డారు.
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నిర్మాణ రంగంపై ఆధారపడి సుమారుగా 60 వేల మంది కార్మికులున్నారు. రాడ్ బెండింగ్, పెయింటింగ్, కార్పెంటర్, బ్రిక్ ఇండస్ట్రీస్ వంటి సుమారు 26 విభాగాలు నిర్మాణ రంగానికి అనుబంధంగా తమ కార్యకలాపాలను సాగిస్తుంటాయి. అయితే ఒక్కసారిగా సిమెంట్ బస్తా (50 కిలోలు) ధర రూ.100కు పైగా పెరగడాన్ని నిరసిస్తూ సిమెంటు కొనుగోళ్లకు బిల్డర్ల జాయింట్ యాక్షన్ కమిటీ రెండు వారాలు బ్రేక్ వేసింది. దీంతో నిర్మాణ పనులన్నీ ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. పనులు లేక పోవడంతో.. రెక్కాడితే గారీ డొక్కాడని కార్మికుల పరిస్థితి దయనీయంగా మారింది. రెండు వారాలుగా కూలీ లేక పూట గడవడమే కష్టంగా మారిందని పలువురు కూలీలు ఆవేదన వ్యక్తం చేశారు.
20 వేల ఫ్లాట్లకు బ్రేకులు..
ఏటా జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ ప్రభుత్వ విభాగాల నుంచి 35 వేల ఇంటి దరఖాస్తులు అనుమతులు పొందుతుంటే.. ప్రస్తుతం వీటిలో సుమారుగా 20 వేల ఫ్లాట్లు నిర్మాణ పనులు జరుపుకుంటున్నాయని భారత స్థిరాస్తి డెవలపర్ల సమాఖ్య (క్రెడాయ్) జాతీయ అధ్యక్షుడు శేఖర్ రెడ్డి ‘సాక్షి రియల్టీ’కి చెప్పారు. అయితే సిమెంట్ హాలిడే ప్రకటించడంతో ఈ ఫ్లాట్ల నిర్మాణ పనులు నిలిచిపోయాయి.
దీంతో కొనుగోలుదారులకు ఇచ్చిన సమయంలోగా ఫ్లాట్లను అందించలేమని ఆయన పేర్కొన్నారు. మరోవైపు పెరిగిన సిమెంట్ ధరతో ప్రాజెక్ట్ వ్యయమూ పెరుగుతుంది. ఈ భారం నుంచి తప్పించుకునేందుకు చ.అ.కు రూ.300కు పైగా పెంచక తప్పని పరిస్థితి నెలకొందని శేఖర్ చెప్పుకొచ్చారు. అంటే ఈ భారం మళ్లీ సామాన్యుడి నెత్తిపైనే పడనుందన్నమాట.
రెండు వారాల్లో రూ.37.80 కోట్లు
నగరంలో 50-60 వేల మంది భవన నిర్మాణ కార్మికులుంటారని తెలంగాణ భవన నిర్మాణ కార్మికుల సంఘం అధ్యక్షులు గంధం అంజన్న చెప్పారు. వీరిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచే కాకుండా హర్యానా, ఉత్తరప్రదేశ్, బీహార్ వంటి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు కూడా ఉన్నారు. వీరంతా తాపీమేస్త్రి, సెంట్రింగ్ మేస్త్రి (శ్లాబులు వేసేవాళ్లు), మట్టి లేబర్, వండ్రంగి, పెయింటర్, కార్పెంటర్ ఇలా నిర్మాణ రంగంలోని వివిధ దశల్లో కూలీలుగా పనిచేస్తుంటారు.
వీరికి ఒక్క రోజుకు మేస్త్రీకి రూ.500, హెల్పర్‌కు రూ.400, మహిళలకు రూ.300 కూలీ చెల్లిస్తుంటారు. అయితే 14 రోజులుగా నిర్మాణ పనులు నిలిచిపోవడంతో కూలీలంతా కలసి రూ.కోట్లలో నష్టపోయారు. ఎలాగంటే రోజుకు 60,000 (కూలీలు) 5 450 (సగటున దినసరి కూలీ) = 2,70,00,000. మొత్తం 14 రోజులకు చూసుకుంటే.. అక్షరాల రూ.37.80 కోట్లు నష్టపోయారన్నమాట.