శోకమే మిగిలింది
ఫొటో స్టోరీ
ఆశ... మనిషికి ఊపిరి. అది మనిషిని ముందుకు నడిపిస్తుంది. కానీ అదే చచ్చిపోయినప్పుడు ఆ మనిషి ఏమవుతాడు? ప్రాణమున్న శవంలా మిగులుతాడు. బతుక్కి అర్థం తెలియక, చావును వెతుక్కుంటూ వెళ్లలేక ఉక్కిరిబిక్కిరవుతాడు. అప్పుడు తాను పడే వేదన సామాన్యమైనది కాదు. అది ఎంత భయంకరంగా ఉంటుందో, గుండెల్ని ఎలా మెలిపెడుతుందో... ఈమెను అడిగితే అర్థమవుతుంది.
కళ్లలో కొండంత వేదనను నింపుకున్న ఈ మహిళ పేరు అయిడా. ఉత్తర సిరియాలోని ఓ గ్రామంలో ఉండేది (ఈ ఫొటో తీసేనాటికి). మార్చ్ 10, 2012న ఆ ఊరి మీద సిరియా సైన్యాలు విరుచుకుపడ్డాయి. క్షణాల్లో వారి ఇళ్లను, సామాన్లను, జీవితాలను కూడా చెల్లాచెదురు చేసేశాయి. నాటి దాడిలో అయిడా భర్తతో పాటు ముద్దులొలికే ఆమె ఇద్దరు పిల్లలూ మరణించారు. తీవ్రంగా గాయపడి, స్పృహ కోల్పోయిన అయిడాను ఎవరో ఆసుపత్రిలో చేర్పించారు. స్పృహలోకి రాగానే ఆమె భర్త, పిల్లల కోసం వెతుక్కుంది. కానీ వాళ్లు కనిపించలేదు. ఇక ఎప్పటికీ కనిపించరని తెలియగానే ఆమె గుండె బద్దలైంది. హృదయం శోకసంద్రమైంది. కళ్లగుండా వేదన కన్నీరుగా పొంగి పొర్లింది. నాటి ఆమె ఆవేదనకు ప్రత్యక్ష సాక్ష్యంగా... ప్రముఖ ఫొటోగ్రాఫర్ రోడ్రిగో తీసిన ఈ చిత్రం నిలిచిపోయింది.
2013లో ఈ ఫొటోకి పులిట్జర్ ప్రైజ్ తీసుకున్నప్పుడు కలిగిన ఆనందం కంటే... ఆ రోజు అయిడా ఆవేదనను చూసి తన మనసు పడిన బాధే ఎక్కువని రోడ్రిగ్ వెల్లడించడం విశేషం!