‘రోహిత్ మృతిపై అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయాలి’
పొన్నూరు : రోహిత్ మరణంపై ప్రస్తుత న్యాయసాధికార మంత్రి రామ్‌దేవ్ అటాలే, రాంవిలాస్ పాశ్వాన్, మాయావతి, సీతారామ్ ఏచూరితో అఖిలపక్ష కమిటీని ఏర్పాటు చేయాలని నవ్యాంద్ర పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కత్తి పద్మారావు డిమాండ్ చేశారు. స్థానిక కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. రోహిత్ దళితుడు కాదనడం, అతని ఆత్మహత్య వెనుక స్మృతి ఇరానీ, బండారు దత్తాత్రేయ ప్రమేయం లేదని, తనకు తానే ఆత్మహత్యకు కారణమయ్యాడని అలహాబాద్ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి ఎ.కె రూపస్‌వాల్ ఇచ్చిన రిపోర్టు సరియైంది కాదని తెలిపారు. ఈ రిపోర్టును నిర్వీర్యం చేయడంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, సీఎం చంద్రబాబు ప్రమేయం స్పష్టంగా ఉందని ఆరోపించారు.
రోహిత్ ఆత్మహత్యకు సంబంధించి సూసైడ్‌నోట్ దేశంలోని అన్ని పత్రికల్లో ప్రచురించడమే కాక బండారు దత్తాత్రేయ, స్మృతిఇరానీ చర్యలు ఉన్నట్లు నిర్థారించాయని పద్మారావు చెప్పారు. పార్లమెంటులోని 111 మంది దళిత ఎంపీలు ఆ నివేదిక అవాస్తవమని నిరాకరించాలని కోరారు. వీసీ అప్పారావును కాపాడేందుకే రోహిత్ దళితుడు కాదనే నివేదిక ఇచ్చారన్నారు. ప్రధానమంత్రే స్వయంగా రోహిత్ మరణం వెనుక ఉన్న కుల అంశాన్ని ప్రస్తావించడమే కాకుండా ఎర్రకోట మీద చేసిన ప్రసంగాన్ని మర్చిపోకూడదని తెలిపారు. చంద్రబాబునాయుడు, వెంకయ్యనాయుడు సొంత సామాజిక వర్గానికి చెందిన వీసీ అప్పారావును రక్షించాలనే కాంక్షతోనే ఇటువంటి నివేదికలు తెచ్చారన్నారు. ఎస్సీ, ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ ఎట్రాసీటీ కేసులో ఉన్న వీసీని మరలా నియమించడం భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు.