ఆ తల్లీకూతుళ్లు చాలా అదృష్టవంతులు!
బ్రస్సెల్స్: ఇటీవల బెల్జియం రాజధాని బ్రస్సెల్స్ నగరంలో మెట్రో రైల్వే స్టేషన్ వద్ద జరిగిన బాంబు పేలుళ్లలో కేవలం ఇద్దరు మాత్రమే ఈ ఘటన నుంచి బయటపడ్డారు. రొమేనియాకు చెందిన రొక్సానా స్టేఫాంకా, ఆమె రెండేళ్ల కూతురు ఇద్దరు మెట్రో స్టేషన్ బాంబు పేలుళ్ల ఘటనలో స్వల్ప గాయాలతో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారని అక్కడి అధికారులు చెబుతున్నారు. రొక్సానా ముఖంపై కాలిన గాయలయ్యాయని, అయితే చిన్నారికి మాత్రం స్వల్ప గాయాలైనట్టు వారి కుటుంబసభ్యులు కూడా వెల్లడించారు. మెట్రో రైలులో బాంబులు పేలిన ఘటనలో మొత్తంగా 20 మంది మృతిచెందిన విషయం తెలిసిందే.
రొక్సానా, తన భర్తతో కలిసి గత ఐదేళ్ల నుంచి బ్రస్సెల్స్ లో ఉంటున్నట్లు తెలిపారు. ఆమె భర్త కంట్రక్షన్ కంపెనీ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో గత మంగవారం స్కూలుకు వెళ్లిన తన పెద్ద కూతురు(5)ను ఇంటికి తీసుకురావడానికి మెట్రో రైలులో ఆమె వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు బాధితురాలు వివరించింది. చివరగా తాను ప్రయాణిస్తోన్న ప్రదేశం చుట్టుపక్కల రక్తం ప్రవాహంలా కనిపించిందని, తన చిన్న కూతురు ఏడుస్తుండగా తాను స్పృహ కోల్పోయినట్లు రొక్సానా స్టేఫాంకా గుర్తుచేసుకుంది. ప్రస్తుతం ఆ తల్లీకూతురు ఇద్దరు చికిత్స పొందుతున్నారు.