Rome city
-
‘అన్ని రోడ్లు రోమ్’కే వెళ్లాయి!
‘ఆల్ రోడ్స్ లీడ్ టు రోమ్ (అన్ని రోడ్లు రోమ్‌కే వెళతాయి)’ అన్న నానుడి చారిత్రకంగా అక్షర సత్యమని తేలింది. ఇటలీ రాజధాని రోమ్ నగర పరిసరాల్లోని 29 చోట్ల పురాతత్వ శాస్త్రజ్ఞుల తవ్వకాల్లో బయట పడిన 12వేల సంవత్సరాల క్రితం నాటి 127 మంది మానవుల చెవి భాగాలపై డీఎన్ఏ పరీక్షలు నిర్వహించగా ఆశ్చర్యకరమైన అంశాలు బయట పడ్డాయి. అప్పటికే రోమ్ నగరానికి గ్రీకులు, సిరియన్లతోపాటు లెబనాన్ దేశస్థులు వలసవచ్చారని తేలింది. 127 మానవుల చెవుల్లో ఈ మూడు దేశాల ప్రజల డీఎన్ఏలు బయటపడ్డాయి. రోమ్ నగరం విశిష్టతకు సంబంధించి ఇప్పటికే ఆర్కియాలోజీ, చారిత్రక నివేదికలెన్నో తెలియజేస్తున్నాయి. డీఎన్ఏ పరీక్షల ద్వారా ఈ విషయాలను ధ్రువీకరించడం పెద్దగా జరగలేదు. ఆ దిశగా ఇది ముందడుగు అని చెప్పవచ్చు. పాశ్చాత్య యూరప్ సామ్రాజ్యం పతనమయ్యాక నాలుగో శతాబ్దంలో గ్రీస్, సిరియా, లెబనాన్ నుంచి రోమ్ నగరానికి భారీగా వలసలు పెరిగాయని స్టాన్ఫోర్డ్, ఇటాలియన్ యూనివర్శిటీలకు చెందిన పరిశోధకులు తెలిపారు. -
రాయబార కార్యాలయానికి లెటర్ బాంబు
ఇటలీ రాజధాని రోమ్ నగరంలోని ఫ్రెంచి రాయబార కార్యాలయానికి లెటర్ బాంబు ఒకటి వచ్చింది. ఇది ఎవరు పంపారో ఇంకా తెలియడంలేదు. దీనిపై విచారణ ప్రారంభమైంది. రోమ్ నగరంలోని చరిత్రాత్మక ప్రాంతమైన పలాజో ఫార్నెసె వద్ద ఉన్న రాయబార కార్యాలయానికి ఈ లెటర్ బాంబు బుధవారం మధ్యాహ్నం వచ్చింది. సాధారణంగా రోజూ ఇక్కడకు వచ్చే ఉత్తరాలను సార్టింగ్ చేసే ఉద్యోగిని దాన్ని తెరిచారు. ఆమె అలా తెరవగానే వెంటనే చిన్నపాటి పేలుడు సంభవించి మంటలు వచ్చాయి. ఆ కవర్‌ను పారేసి దూరంగా పారిపోయానని, అదృష్టవశాత్తు ఆ మంటలు తన చేతులకు గానీ, కళ్లకు గానీ అంటుకోలేదని ఆమె తెలిపింది. వెంటనే భవనాన్ని ఖాళీ చేశారు. దాంతో ఇక మీదట ఎలాంటి లేఖలను ముందస్తు పరీక్షలు లేకుండా ముట్టుకోకూడదని ఉద్యోగులందరికీ చెప్పారు. -
అప్పట్లోనే షాపింగ్ మాల్..
ఆర్థిక సరళీకరణల పుణ్యమాని షాపింగ్ మాల్స్ మన నగరాల్లో ఎక్కడికక్కడ విస్తరిస్తున్నాయి. బహుళ అంతస్తుల భవనాలు, కళ్లు మిరుమిట్లు గొలిపే దీపాలంకరణలు, లోపలకు అడుగుపెడుతూనే చల్ల చల్లగా ఎయిర్ కండిషన్డ్ వాతావరణం.. గుండుసూది నుంచి భారీ వస్తు వాహనాదుల వరకు సమన్తం ఒకేచోట దొరుకుతాయి. ఔరా! ఎంతటి ఆధునికత! ఇదంతా అమెరికా వాడి మహిమ అనుకుంటున్నారా..? అయితే తప్పులో కాలేసినట్లే! చరిత్రలో మొట్టమొదటి షాపింగ్ మాల్ క్రీస్తుశకం ఒకటో శతాబ్దిలోనే ఉండేది. రోమన్ చక్రవర్తి ట్రాజాన్ అప్పట్లోనే రోమ్ నగరంలో బహుళ అంతస్తుల షాపింగ్ మాల్ నిర్మించాడు. అందులో దాదాపు పదిహేనువందల దుకాణాలు ఉండేవి. ఇప్పటి షాపింగ్ మాల్స్‌లో మాదిరిగానే, అందులోనూ తినుబండారాలు, సుగంధ ద్రవ్యాలు, దుస్తులు, అలంకరణ వస్తువులు వంటివన్నీ అమ్మేవారు. -
నీరోగారి కళా‘పోషణ’
రోమ్ నగరం తగలబడుతుంటే, ఫిడేలు వాయిస్తూ కూర్చున్నాడని నీరో చక్రవర్తిపై జగమెరిగిన అపప్రథ. నీరోగారికి సంగీత జ్ఞానం ఏమాత్రం ఉండేదో ఎవరికీ తెలియదు గానీ, ఆయన సంగీత కళా‘పోషణ’ మాత్రం అనితరసాధ్యమైన రీతిలో ఉండేది. నిజానికి నీరో లైర్ వాయించే వాడు, ఫిడేల్ కాదు. లైర్ ఒక ప్రాచీన తంత్రీ వాద్యం. కచేరీల కోసం చాలా ప్రాంతాల్లో పర్యటనలు చేసే నీరో చక్రవర్తి, కేవలం తన సంగీతాన్ని శ్లాఘించడం కోసమే ఐదువేల మంది సైనికులను నియమించుకున్నాడు. వారి పనంతా నీరోగారి వెంట ఆయన చేసే కచేరీలకు వెళ్లడం, ఆయన లైర్ వాదన ఎలా ఉన్నా ఆహో.. ఓహో.. భళి భళీ.. అని మెచ్చుకోవడమే.