పెళ్లంటే ఇదేరా!
రెండు మనసులను ముడి వేసే పెళ్లంటే సందడే సందడి. బంధుమిత్ర సపరివారం హడావిడి సరేసరి.. ఈ హంగామాకు ఇప్పుడు సరికొత్త రూపం ఇస్తున్నారు వెడ్డింగ్ ప్లానర్స్. పెళ్లికి రావడం.. వధూవరుల్ని ఆశీర్వదించడం.. అందరినీ పలకరించి, భోజనాలు ముగించి వెళ్లిపోవడం..ఈ రొటీన్ సీన్‌కే డిఫరెంట్ థీమ్‌లను జతచేసి.. ముహూర్తానికిరెండ్రోజుల ముందు నుంచే వెడ్డింగ్ వెదర్‌ను ఆటపాటలతో జాయ్‌ఫుల్‌గా మార్చేస్తున్నారు. ఆకాశ పందిరిలో వినోదాలు వెల్లివిరిసేలా ప్రతి సీన్లో క్రియేటివిటీ జోడించి.. కల్యాణాన్ని మరింత కమనీయం చేస్తున్నారు.
కల్యాణ మంటపం ఎంట్రన్స్ నుంచి.. పెళ్లి పందిరి వరకూ డెకరేషన్తో అదరగొట్టడం మామూలే. పెళ్లి వేడుకలో.. ఆర్కెస్ట్రాతో పాటలు పాడించడమూ పాత ట్రెండే. దీనికి కాస్త డిఫరెంట్‌గా ప్లాన్ చేస్తున్నారు వెడ్డింగ్ ప్లానర్స్. పెళ్లికొచ్చిన అతిథులందరినీ ఇన్వాల్వ్ చేస్తూ.. నూతన వధూవరులకు అపురూపమైన ఆనందాన్ని అందిస్తున్నారు. పెళ్లి మంటపంలో బంధుమిత్రుల అనుబంధాలను ప్రతి ‘ఫ్రేమ్’లో ఇమిడ్చి కలర్‌ఫుల్ చేస్తున్నారు. పెళ్లికి రెండు రోజుల ముందు నుంచే సరదా వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నారు ఈ ప్లానర్లు. కొన్ని వర్గాల వారికే పరిమితమైన మెహందీ ఘట్టాన్ని ప్రతి ఇంట జరిపిస్తున్నారు. ఈ ఈవెంట్‌ను కలర్ఫుల్గా సాగేలా చూస్తున్నారు.
అతిథులే ఎంటర్టైనర్స్
పెళ్లి పందిరికి సమాంతరంగా మరో వేదిక వేసి దానిపై ఆటపాటలతో అదరగొడుతున్నారు. దీని కోసం ప్రత్యేకంగా ఎవరినో పిలిపించడం లేదు కూడా. వచ్చిన అతిథుల్లోని ఔత్సాహికులను ఎంకరేజ్ చేసి మరీ ఇందులో పాల్గొనేలా చేస్తున్నారు. అంత్యాక్షరీలు, సంగీత కచేరీలు, స్టాండప్ కామెడీ, స్కిట్స్ ఇలా డిఫరెంట్ ఈవెంట్స్‌తో పెళ్లిసందడిని రెట్టింపు చేస్తున్నారు. పెళ్లి కోసం ఎంతైనా ఖర్చు చేయడానికి వెనుకాడని జనాలు.. ఈ తరహా పెళ్లి వేడుకకు రెడ్ కార్పెట్ పరచి స్వాగతం పలుకుతున్నారు.
నేచురల్ మేకోవర్..
ఒకప్పుడు వధూవరులు కాస్త మేకప్ అయ్యేవారు. ఈ ప్లాన్డ్ మ్యారేజెస్లో స్పెషల్ మేకప్ ఆర్టిస్టులను పిలిపిస్తున్నారు. కాలి కొనగోటి నుంచి.. హెయిర్ వరకూ అన్ని అందంగా కనిపించేలా జాగ్రత్త పడుతున్నారు. ‘వధూవరుల కలర్, పర్సనాలిటీని బట్టి మేకప్ వేస్తుంటాం. మేకప్ అంటే రంగులు రుద్దేయడం కాదు. అలా చేయడం వల్ల అసహజంగా కనిపిస్తారు. సహజమైన అందాన్ని ఇనుమడింపజేసేలా మేకప్ చేయాలి. అప్పుడే నేచురల్‌గా కనిపిస్తారు. మ్యారేజ్ కాస్ట్యూమ్స్, జ్యువెలరీ.. ఇలా అన్ని విషయాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ముస్తాబు చేస్తున్నాం’ అని చెబుతారు మేకప్ ఆర్టిస్ట్ తాన్య వసల్రాజ్.
బ్యాండ్ బారాత్..
పెళ్లిలో డ్యాన్స్‌ల కోసం ప్రత్యేకంగా కొరియోగ్రాఫర్‌ను కూడా అరేంజ్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా పెళ్లయిన తర్వాత జరిగే బారాత్ కోసం స్పెషల్ ట్రైనింగ్ తీసుకునే వాళ్లూ ఉన్నారు. ‘పెళ్లిలో డ్యాన్స్ చేయాలని ఉత్సాహం ఉన్న వాళ్లకు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నాం. అందుకోసం స్పెషల్ స్టేజ్ ఏర్పాటు చేస్తాం కూడా. చాలా మంది మొదట్లో డ్యాన్స్ చేయడానికి తటపటాయిస్తారు. ట్రైనింగ్ తర్వాత ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తుంటారు’ అని చెబుతారు కొరియోగ్రాఫర్ అమిత్ గుప్తా.