మ్యాగీ నూడుల్స్ పాతిపెట్టేందుకు 20 కోట్ల ఒప్పందం
న్యూఢిల్లీ: తమకు చిక్కులు తెచ్చిపెట్టిన మ్యాగీ నూడుల్స్‌ను ధ్వంసం చేసి భూమిలో పాతిపెట్టేందుకు నెస్ట్లీ సంస్థ అంబుజా సిమెంట్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకోసం, రూ.20 కోట్లు ఇప్పటికే చెల్లించింది. ఆహార భద్రతా నియమాలకు విరుద్ధంగా ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే పదార్థాలు మ్యాగీ నూడుల్స్‌లో ఉన్నట్లు గుర్తించి వాటిపై నిషేధం విధించిన విషయం తెలిసిందే.
దీంతో తమ వద్ద స్టాక్ ఉన్న నూడుల్స్ మొత్తాన్ని భూస్థాపితం చేయడం నెస్ట్లీకి తలనొప్పిగా మారడంతో గుజరాత్‌కు చెందిన అంబుజా సిమెంట్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇదే విషయాన్ని నెస్ట్లీ సంస్థ అధికార ప్రతినిధి స్పష్టం చేశారు. తాము అంబుజా సిమెంట్స్ సహాయం తీసుకుంటున్నామని, అన్ని మార్కెట్లలో స్టాక్ ఉన్న మ్యాగీని వెనక్కి తెప్పిస్తున్నామని తెలిపారు. అయితే, ఒప్పందం ఎన్నికోట్లనే విషయంలో మాత్రం స్పష్టమైన సమాధానం చెప్పలేదు.