దీపావళి కానుకేమో! బ్యాంక్ అకౌంట్లోకి రూ.4 కోట్లు
ఉత్తరప్రదేశ్లోని అలీఘడ్కు చెందిన ఓ వ్యక్తి దీపావళి నాడు కోటీశ్వరుడు అయ్యాడు. అతనికి చెందిన రెండు వేర్వేరు బ్యాంక్ అకౌంట్లలోకి రూ.4 కోట్లకు పైగా వచ్చి డబ్బు వచ్చిపడింది. ఈ డబ్బు గుర్తుతెలియని ఖాతాల నుంచి జమవడంతో ఖంగారుపడ్డ ఆ వ్యక్తి పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించాడు.
అలీఘడ్లో మెడికల్ స్టోర్ నిర్వహించే మహమ్మద్ అస్లాం.. తన బ్యాంక్ ఖాతాలలో పెద్ద మొత్తం జమవడంపై బ్యాంక్ అధికారులను సంప్రదించడానికి ప్రయత్నించాడు. కానీ దీపావళి సెలవు కావడంతో బ్యాంక్ అధికారుల నుంచి స్పందన రాలేదు. దీంతో అతడు డయల్ 112 కి ఫోన్ చేసి పోలీసులకు విషయం తెలియజేశాడు.
తనకు చెందిన ఐడీఎఫ్సీ, యూకో బ్యాంకు ఖాతాల్లోకి నవంబర్ 11, 12 తేదీల్లో పలు దఫాలుగా రూ.4.78 కోట్లు జమైనట్లు అస్లాం తెలిపాడు. అవాక్కైన తాను వెంటనే బ్యాంక్ అధికారులను సంప్రదించానని, కానీ వారు సమస్యను పరిష్కరించలేదని పేర్కొన్నాడు. దీంతో ఏం చేయాలో తెలియక డయల్ 112కి ఫోన్ చేసి విషయం చెప్పానని, తర్వాత వారి సూచనతో పోలీసులకు ఫిర్యాదు చేశానని అస్లాం వివరించాడు.
దీనిపై నగర పోలీసు అధికారి మృగాంక్ శేఖర్ పాఠక్ మాట్లాడుతూ దీనిపై దర్యాప్తు చేస్తున్నామని, బ్యాంక్ అధికారులతో మాట్లాడుతున్నామని చెప్పారు. బ్యాంకులు పూర్తిగా తెరుచుకున్న తర్వాతే పూర్తి వివరాలు తెలుస్తాయన్నారు.