తాటాకు @ రూపాయి
తాటాకుల నరికివేతతో ఉపాధి
ఏటా నాలుగు నెలలు పని
ద్వారకాతిరుమల : తాటి ఆకులు సంప్రదాయానికి చిహ్నాలుగా ఉండటంతో పాటు ఎండల నుంచి ఉపశమనాన్ని కలిగించే సాధనాలుగా ఉపయోగపడుతున్నాయి. రానున్న వేసవి, వివాహాది శుభకార్యాలకు ముహూర్తాలు ఉండటంతో గ్రామాల్లో తాటి ఆకులకు డిమాండ్ పెరిగింది. దీంతో తాటి ఆకులు నరికే కార్మికులకు చేతి నిండా పని దొరుకుతుంది.
ఏటా ఈ సీజన్లో తాటి ఆకుల నరికివేతను వృత్తిగా చేసుకుని ఎందరో జీవనాన్ని సాగిస్తున్నారు. ద్వారకాతిరుమల మండలంలోని ఐఎస్ జగన్నాథపురం, ఐఎస్ రాఘవాపురం, కోడిగూడెం, పి.కన్నాపురం, గోపాలపురం ప్రాంతాల్లో ఏడాదికి నాలుగు నెలలపాటు తాటి ఆకులు నరకడం ద్వారా వందలాది మంది కూలీలు ఉపాధి పొందుతున్నారు.
ప్రమాదమని తెలిసినా..
తాటి చెట్లు ఎక్కేటప్పుడు గరికమ్మలు శరీరాన్ని చీల్చుతున్నా, ఆకులు నరికేటప్పుడు ప్రమాదవశాత్తు కత్తి తగిలి రక్తం కారుతున్నా కార్మికులు ఏ మాత్రం లెక్కచేయడం లేదు. ప్రమాదమని తెలిసినా ఈ సీజన్లో ఇదొక్కటే ఉపాధి అని వీరు అంటున్నారు. ఈ పనిలేనప్పుడు మేకలు మేపుతూ కుటుంబాలను పోషించుకుంటున్నామని చెబుతున్నారు.
రోజుకు 500 నుంచి వెయ్యి ఆకుల వరకు నరుకుతున్నామని, ఆకుకు రూపాయి చొప్పున తమకు కూలి లభిస్తోందని అంటున్నారు. రవాణా చార్జీలతో కలిపి వినియోగదారులకు ఒక్కో ఆకును రూ.5 చొప్పున రైతులు విక్రయిస్తున్నారని చెబుతున్నారు.
రోజుకు రూ.500 సంపాదిస్తున్నా..
తాటి ఆకులు నరికే పని ప్రమాదమని తెలుసు. అయినా తప్పడం లేదు. ఏటా వేసవి సీజన్లో తాటి ఆకులు నరుకుతూ ఉపాధి పొందుతున్నాం. ఒక్కో ఆకును నరికినందుకు రైతు రూపాయి ఇస్తాడు. ఇలా రోజుకు రూ.500 వరకు సంపాదిస్తున్నా.
-రాజినాల రామయ్య, ఐఎస్ జగన్నాథపురం
నాలుగు నెలలపాటు..
వివాహాది శుభకార్యాలకు తాటి ఆకులను వాడుతున్నారు. చలువ పందిళ్లు నిర్మించడం దగ్గర నుంచి ఇవి ఉపయోగపడతాయి. వేసవిలో చల్లదనం కోసం తాటి ఆకుల పందిళ్లు వేస్తుంటారు. దీంతో మాకు ఏటా నాలుగు నెలల పాటు చేతినిండా పని దొరుకుతుంది.
- సొండు పాపారావు, ఐఎస్ జగన్నాథపురం