అమెరికాలో లాడెన్ జెండా ఎగురవేయగలరా?
న్యూఢిల్లీ: మన దేశంలో ఉన్నంత స్వాతంత్ర్యం మరే దేశంలోనూ ఉన్నట్టు కనిపించడం లేదని కేంద్ర మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ అన్నారు. ఒకవైపు దేశం కోసం సైనికులు ప్రాణాలు విడుస్తుంటే.. మరోవైపు కొన్ని వర్గాలు దేశాన్ని నాశనం చేయాలని చూస్తున్నాయని ఆయన విమర్శించారు. జేఎన్యూలో ఉగ్రవాది అఫ్జల్ గురుకు అనుకూలంగా కార్యక్రమాన్ని నిర్వహించడం, ఆయనను ఉరితీయడాన్ని వ్యతిరేకిస్తూ నినాదాలు చేసిన వ్యవహారంపై ఆయన స్పందించారు.
జేఎన్యూలో జాతి వ్యతిరేక నినాదాలు చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. అమెరికాలో ఒసామా బిన్ లాడెన్ జెండాను ఎగురవేయగలరా? ఇలాంటి ఘటనలు మనం దేశంలో కాకుండా మరో దేశంలోనూ జరగవని ఆయన అన్నారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కుల గురించి మాట్లాడటమే కాదు.. విధులను కూడా నెరవేర్చాల్సిన అవసరముందన్నారు.