Rs.10
-
హెచ్‌టీసీ స్మార్ట్‌ఫోన్ ధరపై భారీ తగ్గింపు
ప్రముఖ మొబైల్ సంస్థ హెచ్‌టీసీ తన ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ ధరను భారీగా తగ్గించింది. 'హెచ్‌టీసీ యూ ప్లే' స్మార్ట్‌ఫోన్ ధరపై భారత్ లో రూ. 10వేల తగ్గింపును ఆఫర్ చేస్తోంది. ఈ తగ్గింపు తర్వాత హెచ్‌టీసీ యూ ప్లే ఇప్పుడు రూ.29,990 ధరకే యూజర్లకు లభించనుంది. వైట్, ఇండిగో బ్లూ, బ్లాక్ ఆయిల్ , కాస్మిక్ పింక్ గోల్డ్ రంగులలో లభిస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్ ను ప్రత్యేకంగా అమెజాన్‌లో అందుబాటులో ఉంచింది. కాగా ఫిబ్రవరి లాంచ్ చేసిన ఈ ఫోన్ లాంచింగ్ ధర రూ.39,990లు. హెచ్‌టీసీ యూ ప్లే ఫీచర్లు 5.2 ఇంచ్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ 1080 x 1920 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్ 32/64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో 16 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా 4జీ ఎల్టీఈ, ఫింగర్‌ప్రింట్ సెన్సార్ యూఎస్బీ టైప్ సి, ఎన్ఎఫ్సీ 2500 ఎంఏహెచ్ బ్యాటరీ -
క్వాయిన్ టెన్షన్
తణుకు అర్బన్/తణుకు : పెద్ద నోట్ల రద్దు వ్యవహారం చిల్లర కొరత సమస్య సృష్టించి మార్కెట్‌ను అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చిల్లర కొరత తీర్చేందుకు అధిక సంఖ్యలో విడుదలైన పది రూపాయల నాణాల మారకం మార్కెట్లో ఇప్పుడు సమస్యాత్మకంగా మారింది. నకిలీ నాణాలు చలామణి అవుతున్నాయని, బ్యాంకుల్లో రూ.10 నాణాలను తీసుకోవడంలేదనే ఉద్దేశంతో కొందరు వ్యాపారులు వీటిని నిరాకరిస్తున్నారు. ఏకంగా పది రూపాయలు నాణాలు తీసుకోమంటూ బోర్డులు కూడా పెడుతున్నారు. దీంతో మరలా చిల్లర సమస్య తప్పదని వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే చిన్న, పెద్ద దుకాణదారులు పది రూపాయిల నాణాలను భారీగానే సమకూర్చుకున్నారు. ప్రస్తుత పరిస్థితిలో ఉన్న నాణాలను బయటకు పంపించలేకపోతున్నామని, కొత్త నాణాలు ఎలా తీసుకుంటామని కొందరు అంటున్నారు. నకిలీ నాణాలు పెద్ద సంఖ్యలో చలామణి అవుతున్నాయని ఆరోపిస్తున్నారు. కొన్ని నాణాలను నకిలీవి గా బ్యాంకు అధికారులు ధ్రువీకరించారని అంటున్నారు. దీంతో పది రూపాయల నాణాల మారకం సమస్యగా మారడంతోపాటు చిల్లర కొరత కూడా ఎక్కువవుతుందని తెలుస్తోంది. -
పది రూపాయల కోసం..
బేస్తవారిపేట(ప్రకాశం జిల్లా): పది రూపాయల కోసం ఓ వ్యక్తి, తొమ్మిదేళ్ల బాలుడ్ని సిగరెట్లతో కాల్చి హింసించాడు. ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం నేకునంబాగ్ గ్రామానికి చెందిన వెంకట్రావు(9) బుధవారం ఉదయం 11 గంటలకు గోళీలాట ఆడుకుందామని ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడు. ఇది గమనించిన నరేంద్ర అనే యువకుడు బాలుడిని తన ఇంట్లో నిర్బంధించి సైకిల్ ట్యూబ్‌తో కొట్టి సిగరెట్లతో కాల్చాడు. దీంతో బాలుడు అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. ఎక్కడ విషయం బయటపడుతుందోనని భయపడిన నరేంద్ర, బాలుడిని ఊరు చివరన ఉన్న చిల్ల కంప దగ్గరకు తీసుకెళ్లాడు. ఎవరైనా అడిగితే యాక్సిడెంట్ అయిందని చెప్పు అని బాలుడితో చెప్పడం అటుగా వెళ్తున్న ఓ మహిళ గమనించింది. బాలుడి వద్దకు వెళ్లి విచారించగా విషయం బయటపడింది. ఈ ఘటనకు సంబంధించి నిందితుడు నరేంద్రను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పది రూపాయల కోసం తనను హింసించాడని బాలుడు చెబుతున్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలుడిని చికిత్స నిమిత్తం కంభం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
ఆ షాపులో ఏదైనా రూ.10లకే..
నిరుపేదల అవసరాలకు అనుగుణంగా పంజాబ్‌లోని లూధియానాలో ఓ ఎన్జీవో ఏ వస్తువునైనా రూ.10లకే అందిస్తోంది. దుస్తుల నుంచి బూట్లు, బొమ్మలు, నిత్యవసరాలు, ఇంటి అలంకరణకు కావాల్సిన వస్తువులు అన్నీ ఇక్కడ దొరుకుతున్నాయి. అయితే ఈ షాపులో దొరికే వస్తువులలో ఎక్కువ మొత్తం సెకండ్ హ్యాండ్‌వి. రోజూ వందల సంఖ్యలో ప్రజలు ఈ షాపులో వస్తువులు కొనడానికి క్యూ కడుతుంటారు. 2014లో ప్రారంభమైన ఈ ఎన్జీవో ఇప్పటివరకు 250 మంది శస్త్రచికిత్సలకు సాయం చేసింది. కులమత బేధాలు లేకుండా ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడమే తమ లక్ష్యమని ఎన్జీవో సభ్యుడు ఒకరు తెలిపారు. -
తహశీల్దార్‌కు రూ.10 వేల జరిమానా
బేతంచర్ల (కర్నూలు) : బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన ఓ తహశీల్దార్‌కు రూ.10 వేల జరిమానా విధిస్తూ రాష్ట్ర హైకోర్టు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే... కర్నూలు జిల్లా బేతంచర్ల మండలం ముద్దనూరు గ్రామానికి చెందిన ఎన్.రాధమ్మ అనే మహిళ... తహశీల్దార్ రామకృష్ణుడు వేధింపులపై హైకోర్టును ఆశ్రయించగా ఈ ఆదేశాలు వెలువడ్డాయి. ముద్దనూరు గ్రామానికి చెందిన సర్వే నెంబర్లు 688, 528బి లలో 4.2 ఎకరాల భూమికి రాధమ్మ యజమానురాలు. అయితే ఈ భూమితో ఆమెకు ఎలాంటి సంబంధం లేదని, అక్రమంగా సాగు చేస్తోందంటూ తహశీల్దార్ వేధింపులకు దిగడంతోపాటు కేసు పెట్టించారు. దీంతో బాధితురాలు హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన హైకోర్టు.. తహశీల్దార్ రామకృష్ణుడు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని పేర్కొంటూ రూ.10 వేలు జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. -
రూ.10వేల కోట్లతో కర్ణాటకలో జాతీయ రహదారులు
బెంగళూరు : కర్ణాటకలో రూ.10వేల కోట్ల నిధులతో జాతీయ రహదారుల అభివృద్ధి పనులను ప్రారంభించనున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. బెంగళూరులోని ఓ ప్రైవేట్ హోటల్లో మంగళవారం జరిగిన రహదారుల అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా గడ్కరీ మాట్లాడుతూ... కర్ణాటకలోని 1,572 కిలోమీటర్ల పరిధిలోని రహదారులను రూ.10వేల కోట్లతో అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే దాదాపు నాలుగు రెట్లు ఎక్కువ నిధులను కర్ణాటకకు కేటాయించినట్లు చెప్పారు. ముంబై-పూణె తరహాలో బెంగళూరు-చెన్నై రహదారిని ఎక్స్‌ప్రెస్ హైవేగా అభివృద్ధి చేయడంపై చర్చలు జరుపుతున్నట్లు మంత్రి వెల్లడించారు. ఇదే సందర్భంలో లోక్‌సభ విపక్ష నేత మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ గత యూపీఏ ప్రభుత్వం మంజూరు చేసిన పథకాలనే ఎన్డీయే ప్రభుత్వం అమలు చేస్తోంది తప్ప, ఇందులో కొత్త పథకాలేవీ లేవని అన్నారు. అందువల్ల యూపీఏ ప్రభుత్వం మంజూరు చేసిన పథకాలను వచ్చే మూడు, నాలుగేళ్లలో పూర్తి చేయాలని నితిన్ గడ్కరీని కోరారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రులు సదానందగౌడ, జి.ఎం.సిద్ధేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.