పది రూపాయల కోసం..
బేస్తవారిపేట(ప్రకాశం జిల్లా): పది రూపాయల కోసం ఓ వ్యక్తి, తొమ్మిదేళ్ల బాలుడ్ని సిగరెట్లతో కాల్చి హింసించాడు. ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం నేకునంబాగ్ గ్రామానికి చెందిన వెంకట్రావు(9) బుధవారం ఉదయం 11 గంటలకు గోళీలాట ఆడుకుందామని ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడు. ఇది గమనించిన నరేంద్ర అనే యువకుడు బాలుడిని తన ఇంట్లో నిర్బంధించి సైకిల్ ట్యూబ్‌తో కొట్టి సిగరెట్లతో కాల్చాడు. దీంతో బాలుడు అపస్మారక స్థితిలోకి వెళ్లాడు.
ఎక్కడ విషయం బయటపడుతుందోనని భయపడిన నరేంద్ర, బాలుడిని ఊరు చివరన ఉన్న చిల్ల కంప దగ్గరకు తీసుకెళ్లాడు. ఎవరైనా అడిగితే యాక్సిడెంట్ అయిందని చెప్పు అని బాలుడితో చెప్పడం అటుగా వెళ్తున్న ఓ మహిళ గమనించింది. బాలుడి వద్దకు వెళ్లి విచారించగా విషయం బయటపడింది. ఈ ఘటనకు సంబంధించి నిందితుడు నరేంద్రను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పది రూపాయల కోసం తనను హింసించాడని బాలుడు చెబుతున్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలుడిని చికిత్స నిమిత్తం కంభం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.