షాక్‌ కొడుతున్న విద్యుత్‌ బిల్లులు | Electric bills that are shocking | Sakshi
Sakshi News home page

షాక్‌ కొడుతున్న విద్యుత్‌ బిల్లులు

Published Thu, Jun 8 2017 11:43 PM | Last Updated on Wed, Sep 5 2018 2:06 PM

Electric bills that are shocking

బేస్తవారిపేట : విద్యుత్‌ బిల్లులు చూసిన ప్రజలు షాక్‌కు గురవుతున్నారు. మండలంలోని 19 పంచాయతీల్లో అనేక మందికి అధిక బిల్లులు రావడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూరిళ్లు, పెంకుటిళ్లు, మధ్య తరగతి కుటుంబాలకు వేలకు వేలు బిల్లులు వస్తుండటంతో బెంబేలెత్తున్నారు.

కొత్తవారి రాకతో..
మండలంలో ప్రైవేట్‌ ఏజెన్సీ నుంచి రీడర్స్‌ను పెట్టి ప్రతినెలా మీటర్‌ రీడింగ్‌లను తీయిస్తున్నారు. రీడర్స్‌ సక్రమంగా రీడింగ్‌ తీయకుండా ఇష్టారాజ్యంగా అరకొర యూనిట్‌లను నమోదు చేశారు. ఈ విధంగా నాలుగైదు ఏళ్లపాటు జరిగింది. గతంలో రీడింగ్‌ నమోదు చేసిన ప్రైవేట్‌ వ్యక్తులు మానుకోవడంతో ఏజెన్సీలు కొత్త రీడర్స్‌ను నియమించుకున్నారు. కొత్తగా వచ్చిన రీడర్స్‌ మీటర్‌లో ఉన్న రీడింగ్‌ను యథాతధంగా నమోదు చేయడంతో వేలకు వేలు బిల్లులు వచ్చాయి. ఒక్కొక్కరికి రూ.3 వేల నుంచి రూ.50 వేల వరకు బిల్లులు రావడంతో వినియోగదారులు లబోదిబోమంటున్నారు. పూరింటిలో నివసించేవారికి కూడా రూ.45 వేల బిల్లు వచ్చింది.

అంత బిల్లు రావడంతో ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్నారు. మండలంలోని 46 గ్రామాల్లో ఇప్పటికే 200 మందికి అధిక బిల్లులు వచ్చాయి. జూన్‌ నెలకు బిల్లులు తీస్తుండటంతో ఇంకా అధిక బిల్లుల మోత బయటపడున్నాయి.

కార్యాలయాల చుట్టూ పరుగులు..
వేలకు వేలు బిల్లులు రావడంతో బిల్లులు తీసుకుని విద్యుత్‌ ఏఈ కార్యాలయం వద్దకు వినియోగదారులు పరుగులు పెట్టారు. రూ.10 వేలలోపు బిల్లులు వచ్చినవారికి ఆర్‌జే(రెవెన్యూ జనరల్‌) కంభం విద్యుత్‌ ఏడీఈ, బేస్తవారిపేట విద్యుత్‌ ఏఈ పరిధిలో పరిష్కరించే అవకాశముందని తెలిపారు. రూ.10 వేలపైన వచ్చిన వినియోగదారుల అర్జీలను తీసుకుని ఒంగోలు విద్యుత్‌శాఖ ఎస్‌ఈకి పంపారు. రెండు నెలలుగా అర్జీలు ఇచ్చిన అధిక బిల్లులు వస్తున్నాయని బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఏవిధంగా చెల్లించాలి :
నాకుటుంబం నివసించేది పూరింట్లో. ప్రతి నెలా 100 కరెంట్‌ బిల్లు వచ్చేది. జూన్‌ నెలలో కరెంట్‌ బిల్లు రూ.45862 వచ్చింది. ఒక్క నెలలోనే 6637 యూనిట్లు వినియోగించినట్లు వచ్చింది. కూలి పనులు చేసుకునే మేము ఏ విధంగా బిల్లులు చెల్లించాలి.
– వల్లల రంగయ్య(అక్కపల్లె)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement