Rs.150
-
రూ. 150 లంచం ఇవ్వలేక భర్త ప్రాణాలను..
-
రోడ్డున పడ్డ కృష్ణ కుటుంబం
హైదరాబాద్: ఊర్లో ఇల్లు లేదు.. భూమి లేదు.. మృతదేహాన్ని తమ గూడేనికి తరలించేందుకు చేతిలో పైసా లేదు.. దహన సంస్కారాలకు దిక్కులేదు.. ఇదీ రూ. 150 లంచం ఇవ్వలేక నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో భర్త ప్రాణాలను పోగొట్టకున్న కృష్ణనాయక్ భార్య కవిత దీనస్థితి. భర్త మృతి చెందడంతో కవిత దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. స్వగ్రామానికి వెళ్లలేక నలు గురు చిన్నారులతో హైదరాబాద్‌లోని తట్టి అన్నారం అంబేడ్కర్ విగ్రహం సమీపంలోని చెట్ల కిందనే భర్త అంత్యక్రియలను జరిపించింది. ప్రాణం ఖరీదు రూ. 150! మహబూబ్‌నగర్ జిల్లా లింగాల మండలం రాయారానికి చెందిన కృష్ణనాయక్ కూలీగా పనిచేస్తూ భార్య, పిల్లలతో కలసి అల్వాల్ శివనగర్‌లో ఉంటున్నాడు. మొదటి భార్య చనిపోయింది. ఆమెకిద్దరు ఆడపిల్లలు. రెండో భార్య కవితకు ఒక బాబు, ఒక పాప. కృష్ణనాయక్ చనిపోవడంతో నలుగురు చిన్నపిల్లల భారం కవితపై పడింది. ఏడాది కూడా నిండని చంటిపిల్లని విడిచి పనికి వెళ్లే పరిస్థితి లేదు. అలా అని పనిచేయకుంటే గడిచే స్థితి కనిపించడం లేదు. భర్త ప్రాణం పోయేందుకు కారణమైన ఆసుపత్రి సిబ్బంది కనికరించడం లేదు. ఈ స్థితిలో ఉన్న కవిత కుటుంబాన్ని ఎవరైనా ఆదుకుని సహాయాన్ని అందించాలని స్థానికులు కోరుతున్నారు. -
ప్రాణం ఖరీదు రూ. 150!
- ఆక్సిజన్ కోసం లంచమడిగిన అటెండర్ - పైసల్లేక పోవడంతో ఆగిన ఊపిరి - ఎర్రగడ్డ ఛాతీ ఆస్పత్రిలో దారుణం హైదరాబాద్ సోమవారం అర్ధరాత్రి.. ఎర్రగడ్డలోని ప్రభుత్వ ఛాతీ ఆస్పత్రి.. తీవ్రమైన ఆస్తమాతో అక్కడ చికిత్సపొందుతున్న కృష్ణనాయక్ అస్వస్థతకు గురయ్యాడు.. ఊపిరి అందక కొట్టుమిట్టాడుతున్నాడు.. అది గమనించిన అతని భార్య డ్యూటీలోని సిబ్బంది వద్దకు వెళ్లింది.. వెంటనే ఆక్సిజన్ పెట్టాలన్న సిబ్బంది అందుకు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు.. తన దగ్గర డబ్బు లేదని, ఆక్సిజన్ పెట్టాలని ఆమె కాళ్లావేళ్లా పడినా కనికరించలేదు. దీంతో కొద్దిసేపటికే కృష్ణ మృతి చెందాడు. ప్రాణాలు నిలబెట్టాల్సిన ప్రభుత్వాస్పత్రుల సిబ్బంది లంచాల దురాశతో ప్రాణాలు తోడేసిన వైనమిది. దీనిపై పలువురు రోగులు, వారి బంధువులు మంగళవారం ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగడంతో.. ఇద్దరు సిబ్బందిని అధికారులు సస్పెండ్ చేశారు. ఆస్పత్రిలోకి వచ్చినప్పటి నుంచీ.. మహబూబ్‌నగర్ జిల్లా లింగాల మండలం రాయారం గ్రామానికి చెందిన వడ్త్యా కృష్ణనాయక్‌కు భార్య కవిత, ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. తీవ్ర ఆస్తమాతో బాధపడుతున్న కృష్ణను కవిత సోమవారం ఉదయం ఎర్రగడ్డలోని ఛాతీ ఆసుపత్రికి తీసుకువచ్చింది. ఔట్ పేషెంట్ (ఓపీ) విభాగం వద్దకు కూడా వెళ్లలేని స్థితిలో కృష్ణ ఉండటంతో కవిత వెళ్లి స్లిప్ (చీటీ) రాయాలని కోరింది. కానీ రోగిని తీసుకొస్తే తప్ప ఓపీ చీటీ ఇవ్వబోమనడంతో.. అతికష్టంగా ఓపీ కౌంటర్ వద్దకు తీసుకెళ్లింది. కృష్ణను పరీక్షించిన వైద్యులు ఇన్‌పేషెంట్‌గా చేర్చుకున్నారు. ఊపిరి సరిగా తీసుకోలేకపోతుండటంతో ఆక్సిజన్ పెట్టారు. రాత్రి విధులకు వచ్చిన నళిని అనే వైద్యురాలు కూడా కృష్ణనాయక్‌ను పరీక్షించి.. ఆక్సిజన్ అందుతూనే ఉండేలా చూడాలని డ్యూటీ నర్స్ రీటాకు, అటెండర్లకు సూచించారు. కానీ కొద్దిసేపటి తర్వాత అంతా బాగానే ఉందంటూ నర్సు, అటెండర్ ఆక్సిజన్ సరఫరాను తీసేశారు. అయితే అర్ధరాత్రి సమయంలో ఊపిరి అందక కృష్ణనాయక్ ఉక్కిరిబిక్కిరయ్యాడు. ఇది చూసిన కవిత పరిగెత్తుకుంటూ నర్సు రీటా వద్దకు వెళ్లి చెప్పింది. కానీ ఆమె రాలేదు. మళ్లీ వెళ్లి అడగడంతో పదే పదే రావద్దంటూ బెదిరించి, వెళ్లగొట్టింది. కాళ్లావేళ్లా పడినా.. నర్సు రాకపోవడంతో ఆందోళనగా ఉన్న కవిత వద్దకు అటెండర్ నయీమ్ వచ్చాడు. డబ్బులు ఇస్తే ఆక్సిజన్ అందజేస్తానని చెప్పాడు. ఆలస్యమైతే కృష్ణ చనిపోతాడనీ బెదిరించాడు. తన వద్ద డబ్బులు లేవంటూ కన్నీరు మున్నీరైన కవిత.. తన భర్తను కాపాడాలని వేడుకుంది. అయినా నర్సుగానీ, అటెండర్‌గానీ స్పందించలేదు. తన భర్త పరిస్థితిని చూసి ఆందోళనకు గురైన కవిత మరోసారి వెళ్లి కాళ్లావేళ్లా పడింది. అయినా వారు కవితను తిట్టి పంపించేశారు. దీం ఏడుస్తూ ఆమె బెడ్ వద్దకు వచ్చే సరికి కృష్ణనాయక్ ప్రాణాలు విడిచాడు. ఆందోళన చేయడంతో.. భర్త మరణించడాన్ని చూసిన కవిత పెద్ద పెట్టున రోదించింది. ఇదంతా గమనిస్తున్న పక్క బెడ్ల మీద ఉన్న రోగులు, వారి బంధువులు నర్సును, అటెండర్‌ను నిలదీశారు. డబ్బులు ఇవ్వలేదనే కారణంతో కృష్ణకు ఆక్సిజన్ అందించలేదని, నిండు ప్రాణాన్ని బలితీసుకున్నారంటూ అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ఆందోళనకు దిగారు. దీంతో నర్సు, అటెండర్ నెమ్మదిగా అక్కడి నుంచి జారుకున్నారు. చివరికి డ్యూటీ డాక్టర్, ఇతర సిబ్బంది వచ్చి ఉదయం ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు ఫిర్యాదు చేస్తామని చెప్పడంతో రోగులు, బంధువులు వెనక్కి తగ్గారు. మంగళవారం ఉదయం మహబూబ్‌నగర్ జిల్లా నుంచి మృతుడి బంధువులు ఛాతీ ఆస్పత్రి వద్దకు వచ్చి ఆందోళనకు దిగారు. కృష్ణ మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సూపరింటెండెంట్ నిర్లక్ష్యం కూడా.. ఆక్సిజన్ అందించక కృష్ణ మృతిచెందిన విషయం తెలిసినా ఆస్పత్రి సూపరింటెండెంట్ మంగళవారం ఉదయం వరకు అక్కడికి రాలేదు. పైగా ఆస్పత్రిలో రోగులు ఆందోళన చేస్తున్నారని, తమకు రక్షణ కల్పించాలని ఎస్ఆర్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం. దీంతో పోలీసులు ఆస్పత్రికి వచ్చి ఆందోళన చేస్తున్న వారిని అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించారు. న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో బంధువులు కృష్ణ మృతదేహాన్ని తీసుకుని వెళ్లిపోయారు. ఇద్దరు ఉద్యోగులపై వేటు కృష్ణనాయక్ భార్యను లంచం డిమాండ్ చేసిన నయీమ్ అనే అటెండర్‌ను, ఔట్‌పేషెంట్ బ్లాక్ వద్ద దురుసుగా ప్రవర్తించిన ధన్‌రాజ్ అనే మరో ఉద్యోగిని సస్పెండ్ చేస్తున్నట్టు ఆర్ఎంవో డాక్టర్ నరేందర్ తెలిపారు. డ్యూటీలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన నర్సు రీటాపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు సిఫార్సు చేశామన్నారు. -
రూ.150 ఇచ్చి మోసపోయానా?
(వెబ్ సైట్ ప్రత్యేకం) వారం రోజుల తర్వాత మళ్లీ హైదరాబాద్ లో అడుగుపెట్టాను. ఆఫీస్ కు సెలవు పెట్టి తిరుమల వెంకన్న ఆశీస్సులతో ఇంటికి వస్తున్న నాకు బస్సు దిగగానే ఓ అనుభవం ఎదురైంది. ఇలాంటిదే మీలో ఎవరికైనా ...ఎదురై ఉండొచ్చు కూడా.. ఇల్లు దగ్గరేనని బస్సు దిగి నాలుగడుగులు వేశాను. ఇంతలో 35-40 ఏళ్ల మధ్య వయస్సు ఉండే ఒకామె నన్ను ఆపింది. ఏమండి ఏమనుకోవద్దు.. ఇలా అడుగుతున్నానని.... మాకు తెలిసినవాళ్లు ఇల్లు మారిపోయారు. ఫోన్ నెంబర్ కూడా లేదు. మా దగ్గర డబ్బులు కూడా అయిపోయాయి. మా ఊరు వెళ్లడానికి డబ్బులు లేవు. కొంచెం హెల్ప్ చేయరా అని. ఆమె వైపు చూశాను. భుజానికి హ్యాండ్ బ్యాగ్... పక్కన 12ఏళ్ల కుర్రాడు ఉన్నాడు. బహుశా ఆమె కొడుకు అనుకుంటా. నమ్మాలా వద్దా అని నాలో అనుమానం. మీది ఏ ఊరు అని అడిగా... మాది గుంటూరు దగ్గర పిడుగురాళ్ల అని చెప్పింది. చూస్తే మోసం చేసి డబ్బు అడుగుతున్నట్లు అనిపించలేదు. అయ్యో పాపం అనిపించింది. పక్కనే పిల్లాడు కూడా ఉన్నాడు. ఒకవేళ అబద్ధం చెప్పి డబ్బులు అడిగేవాళ్లు అయితే అంత ఉదయాన్నే అలా రోడ్డు మీద నిలబడి అడగరు కదా అనిపించింది. ఇంకేమీ ఆలోచించకుండా బ్యాగ్ లో నుంచి చేతికందిన ఓ వంద, యాభై రూపాయిల నోట్లు ఇచ్చాను. ఆమె కూడా అంత ఇస్తానని ఊహించినట్లు లేదు. ఓ ఇరవై, లేదా యాభయ్యో ఇస్తానని అనుకుని ఉందేమో ...నేను వంద ఇవ్వగానే ఆశ్చర్యంతో పాటు, సంతోషంగా ఆనోటును తీసుకుంది. అబ్బా వంద రూపాయిలు ఇచ్చి...ఏదో లక్ష దానం చేసినట్లు ఫోజ్ కొడుతున్నానని అనుకుంటున్నారు కదు. అంతటితో అయిపోతే సరే. మరో రెండుసార్లు ఆమె ఆ పిల్లాడితో నాకు తారస పడింది. ఓ రోజు ఆఫీస్ అయిపోయి బస్సు దిగి ఇంటికి వెళుతుంటే మళ్లీ ఆమె నాకు కనిపించింది. అయితే ముఖానికి స్కార్ప్ కట్టుకున్న ఆమె నన్ను గుర్తు పట్టలేదు కానీ ..ఆమెను మాత్రం నేను వెంటనే గుర్తుపట్టాను. అదేంటీ ఆమె వాళ్ల ఊరు వెళ్లలేదా ఇక్కడుంది ఏమిటా అని ఆలోచిస్తూ ఆమె వైపు చూశాను. అయితే కొద్దిసేపు ఉండి ఆమె ఏం చేస్తుందో చూద్దామనుకున్నా కానీ... ఓ వైపు ఎండ దంచేస్తోంది. చెమటలు కారిపోతున్నాయి. దాంతో సర్లే ఎందుకొచ్చిన డిటెక్టివ్ పని అనుకుని వెళ్లిపోయా. తర్వాత రోజు.... ప్లేస్ మారింది... ఆఫీస్ కు వెళ్లేందుకు కూకట్ పల్లి నుంచి డైరెక్ట్ బస్సు దొరకకపోవటంతో అమీర్ పేట బస్టాఫ్ లో దిగాను. అప్పుడు కూడా నా ముఖం స్కార్ప్ తో కప్పేసే ఉంది. అక్కడ ఆమె...తన పిల్లాడితో నిలబడి ఉంది. ఇదేంటబ్బా ఈమె ఇలా కనిపిస్తోంది నాకు అని అనుకున్నా. ఊరు వెళ్లేందుకు బస్సు కోసం చూస్తుందేమో అనుకున్నా...అయినా ఓ నూట యాభై రూపాయిలు ఇచ్చి ...ఇంత ఆలోచించడం అవసరమా అని నాలో నేనే సర్ధి చెప్పుకున్నా. ఆమె వైపే చూస్తున్నా.. ఏం చేస్తూందా అని ఇంతలో అక్కడకి వచ్చిన ఒకామెతో సేమ్ టూ సేమ్... అవే మాటలను రిపీట్ చేస్తోంది. ఏమండి... మా వూరు వెళ్లడానికి డబ్బులు లేవండీ...పర్సు పోయిందండీ అంటూ... ఆ పిల్లాడు కూడా ఆమెతో పాటు నిలబడి అమాయకంగా చూస్తున్నాడు... నాకు పిచ్చి కోపం వచ్చింది... అదేంటీ నాలుగు రోజుల క్రితం కూడా ఇలాగే చెప్పి నా దగ్గర డబ్బులు తీసుకుంది. ఇప్పుడు కూడా ఇలాగే చేస్తోందని. ఓ వైపు నన్ను మోసం చేసి డబ్బులు గుంజిందని, మరోవైపు నేను మోసపోయాననే ఉక్రోషం. దగ్గరకు వెళ్లి ఏయి ఇలా ఎంతమందిని మోసం చేసి డబ్బులు గుంజుతావ్. మర్యాదగా నా డబ్బులు నాకిచ్చేయి లేకపోతే. పోలీసులకు పట్టిస్తా అని బెదిరిద్దామనేంత ఆవేశం వచ్చింది. అయితే ఇంతలో నేను ఎక్కాల్సిన బస్సు వస్తోంది. ఓవైపు ఆఫీస్ కు టైమ్ అయిపోవటంతో అయ్యో ఈ బస్సు ఇప్పుడే రావాలా అని తిట్టుకుంటూ ...ఆమె వైపు కసిగా చూస్తూ బస్సు ఎక్కేశా. ఆఫీస్ కు వెళ్లాక కూడా బుర్రలో ఆ విషయమే తొలుస్తోంది. ఛా ఇంత చిన్న విషయానికి ఎందుకింతగా ఆలోచిస్తున్నానని తల విదిలించినా ఆలోచనలు మాత్రం నీడలా వదలటం లేదు. దాదాపు ఇలాంటి సంఘటనలే గతంలో నేను చాలాసార్లు చూశాను. ఎక్స్ క్యూజిమీ నా పర్సు పోయిందంటూ దడదడ ఇంగ్లీష్ లో దంచేసి...చివరకూ ఓ వంద ఉంటే ఇస్తారా...ఎట్ లీస్ట్ 50 అంటూ రైల్వేస్టేషన్లలో కాళ్లబేరం ఆడేవాళ్లను చూశా. ఇల్లు కాలిపోయింది, సర్వం బూడిదై రోడ్డున పడ్డాం సాయం చేయమని, కొడుకుకు జబ్బుచేసింది తిరిగి కోలుకోవాలంటే వైద్యం చేయించేందుకు డబ్బు కావాలని, కూతురు పెళ్లి చేయాలి..పేదోళ్లమంటూ బస్సులు ఎక్కి మరీ కాగితాలు పంచేవాళ్లు... అనాధలను, ముసలివాళ్లను చేరదీసి స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తున్నామని ఇంటికి వచ్చి జబర్దస్తుగా విరాళాలు వసూలు చేసేవాళ్లను చూశా. కొన్నిసార్లు అయ్యో పాపం అని జాలిపడి సాయం చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే వాళ్లు మళ్లీ మళ్లీ మన కళ్ల ముందే దర్జాగా తన దంతా సాగిస్తూనే ఉన్నా ఏం చేయలేం. ఎవరి పాపం వాళ్లదే అని సరిపెట్టుకునే సందర్భాలే ఎక్కువ. ఇంతకీ వాళ్లు అబద్ధాలు చెబుతున్నారా? మనం మోసపోతున్నామా? ఇలాంటి వాళ్లవల్ల సహాయం చేయాలనే ఆలోచన కనుమరుగు అవుతుందోమో. పార్వతి