రోడ్డున పడ్డ కృష్ణ కుటుంబం
హైదరాబాద్: ఊర్లో ఇల్లు లేదు.. భూమి లేదు.. మృతదేహాన్ని తమ గూడేనికి తరలించేందుకు చేతిలో పైసా లేదు.. దహన సంస్కారాలకు దిక్కులేదు.. ఇదీ రూ. 150 లంచం ఇవ్వలేక నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో భర్త ప్రాణాలను పోగొట్టకున్న కృష్ణనాయక్ భార్య కవిత దీనస్థితి. భర్త మృతి చెందడంతో కవిత దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. స్వగ్రామానికి వెళ్లలేక నలు గురు చిన్నారులతో హైదరాబాద్‌లోని తట్టి అన్నారం అంబేడ్కర్ విగ్రహం సమీపంలోని చెట్ల కిందనే భర్త అంత్యక్రియలను జరిపించింది.
ప్రాణం ఖరీదు రూ. 150!
మహబూబ్‌నగర్ జిల్లా లింగాల మండలం రాయారానికి చెందిన కృష్ణనాయక్ కూలీగా పనిచేస్తూ భార్య, పిల్లలతో కలసి అల్వాల్ శివనగర్‌లో ఉంటున్నాడు. మొదటి భార్య చనిపోయింది. ఆమెకిద్దరు ఆడపిల్లలు. రెండో భార్య కవితకు ఒక బాబు, ఒక పాప. కృష్ణనాయక్ చనిపోవడంతో నలుగురు చిన్నపిల్లల భారం కవితపై పడింది. ఏడాది కూడా నిండని చంటిపిల్లని విడిచి పనికి వెళ్లే పరిస్థితి లేదు. అలా అని పనిచేయకుంటే గడిచే స్థితి కనిపించడం లేదు. భర్త ప్రాణం పోయేందుకు కారణమైన ఆసుపత్రి సిబ్బంది కనికరించడం లేదు. ఈ స్థితిలో ఉన్న కవిత కుటుంబాన్ని ఎవరైనా ఆదుకుని సహాయాన్ని అందించాలని స్థానికులు కోరుతున్నారు.