RTA agents
-
పైసలిస్తే లైసెన్స్..!
నెల్లూరు(టౌన్): ఇక్కడ అనధికారిక ఏజంట్లదే రాజ్యం.. వీరి ముందు నిబంధనలు బలాదూర్.. అడిగినంత పైసలిస్తే ఎలాంటి లైసెన్స్‌లైనా క్షణాల్లో ఇప్పించేస్తారు. అంతా ఆన్లైన్ అంటారు..కానీ వ్యవహారమంతా ఆఫ్‌లైన్‌లోనే నడుస్తోంది. దీనికి కొంతమంది అధికారులు సహకారమందిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ తతంగమంతా రవాణాశాఖ కార్యాలయం కేంద్రంగా నడుస్తోంది. ద్విచక్ర, భారీ వాహనాలకు డ్రైవింగ్ లైసెన్స్‌లు జారీ చేయాలంటే చాలా నిబంధనలు ఉన్నాయి. పైసలిస్తే ఎలాంటి టెస్ట్ లేకుండానే లైసెన్స్‌లు వచ్చేస్తున్నాయి. ఈ దందాకు అనధికార ఏజెంట్లతోపాటు కొంతమంది మీడియా సిబ్బంది, హోంగార్డులు, రవాణా అధికారుల డ్రైవర్లు రవాణా కార్యాలయం వద్ద కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల ఓ ఎంవీఐ 113 లైసెన్స్‌లకు వేలిముద్ర వేయించి ఓకే చేశారు. అయితే ఈ విషయంపై ఓ అజ్ఞాత వ్యక్తి డీటీసీకి ఫోన్ చేశారు. ఈ నేపథ్యంలో ఆయన స్వయంగా పరిశీలించి అందరికీ డ్రైవింగ్ టెస్ట్ నిర్వహించాలని నిర్ణయించారు.డీటీసీనే ట్రాక్ వద్దకు వచ్చి టెస్ట్‌ను నిర్వహించడంతో కేవలం 53 మంది మాత్రమే ట్రైల్ వేసేందుకు ముందుకువచ్చారు. లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్న మిగిలిన అభ్యర్థులు ట్రైల్ వేసేందుకు ముందుకు రాకపోవడంతో వారందరినీ ఫెయిల్ చేశారు. ఇది ఒక ఉదాహరణ మాత్రమే.. బైకు, కారుకు లైసెన్స్ పొందాలంటే తొలుత ఎల్ఎల్ఆర్ పొందాల్సి ఉంటుంది. ఎల్ఎల్ఆర్ పొందిన నెల తరువాత, 6 నెలలు లోపు శాశ్వత లైసెన్స్‌కు దరఖాస్తు చేసుకోవాలి. లైసెన్స్ పొందేందుకు ముందుగా శ్లాట్ బుక్ చేసుకోవాలి. బైక్, కారుకు ప్రభుత్వ చలానా రూ.1350 చెల్లించాల్సి ఉంటుంది. ఆ చలానాతో శ్లాట్‌లో వచ్చిన తేదీ, సమయం ప్రకారం రవాణాశాఖ కార్యాలయంలో డ్రైవింగ్ టెస్ట్‌కు హాజరు కావాల్సిఉంటుంది. దరఖాస్తులు వచ్చిన ప్రకారం డ్రైవింగ్ ట్రాక్ వద్ద వేలిముద్ర వేసి బైక్, కారు డ్రైవింగ్ చేయాల్సిఉంది. ఆ తరువాత సీరియల్ ఆధారంగా ఒకరి తరువాత మరొకరు వేలిముద్ర వేసి డ్రైవింగ్ టెస్ట్చేయాల్సిఉంది. సక్రమంగా డ్రైవింగ్ చేసిన వారికి టెస్ట్‌ను పర్యవేక్షిస్తున్న ఎంవీఐ లైసెన్స్‌ను ఓకే చేస్తారు. సెల్‌ఫోన్‌కు సంక్షిప్త సమాచారాన్ని పంపుతారు. ఆ తరువాత లైసెన్స్‌ను పోస్టుద్వారా వ్యక్తి అడ్రస్‌కు పంపుతారు. లైసెన్స్‌కు రూ.2500 వసూలు కారు నడపడం రాకపోయినా డబ్బులు తీసుకుని నిబంధనలకు విరుద్ధంగా లైసెన్స్‌లు జారీ చేస్తున్నారు. కొంతమంది మొక్కుబడిగా బైక్ నడిపి కారుకు కూడా లైసెన్స్ పొందుతున్నారు. మరి కొంతమంది కేవలం వేలిముద్ర వేసి లైసెన్స్ పొందుతున్నారు. ఈ రీతిలో లైసెన్స్ జారీ చేసినందుకు ప్రభుత్వ చలానా కన్నా అదనంగా రూ.2500 వసూలు చేస్తున్నారు. లైసెన్స్‌ను ఇప్పించేందుకు కొంతమంది దళారుల అవతారం ఎత్తారు. అనధికార ఏజెంట్లు వ్యక్తి నుంచి అదనంగా డబ్బులు తీసుకుని ఫాం 4 అవసరం లేకపోయినా ఎంవీఐకి గుర్తుగా లైసెన్స్ కోసం దాఖలు చేస్తారు. ఫాం 4 ఆధారంగా సాయంత్రం సమయంలో అనధికార ఏజెంట్ల నుంచి నుంచి రవాణా సిబ్బంది డబ్బులు వసూలు చేయడం పరిపాటిగా మారింది. ఈ నేపథ్యంలో కారు డ్రైవింగ్ రాకపోయినా ప్రతిరోజూ పదుల సంఖ్యలో లైసెన్స్‌లు జారీ చేయడం గమనార్హం. లైసెన్స్ ఇప్పించేందుకు దళారుల క్యూ రవాణాశాఖ అధికారులు డబ్బులు తీసుకుని డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేస్తుండడంతో కొంతమంది దళారులు రవాణా కార్యాలయానికి క్యూ కట్టారు. ముందుగానే లైసెన్స్ జారీ చేసే సంబంధిత అధికారితో ఒప్పందం కుదుర్చుకుని లైసెన్స్ కోసం వచ్చిన వ్యక్తి నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారు. ఈ విషయం డీటీసీ తనిఖీల్లో తేటతెల్లమైంది. అనధికార ఏజెంట్లతోపాటు కొంతమంది మీడియా సిబ్బంది డబ్బులు తీసుకుని లైసెన్స్ ఇప్పించేందుకు రవాణాశాఖ కార్యాలయం వద్ద తిష్టవేశారు. మీడియా పేరు చెబుతుండడంతో సంబంధిత అధికారులు ఎలాంటి టెస్ట్ లేకుండానే లైసెన్స్‌లు జారీ చేస్తున్నారు. ఇదే కోవలో హోంగార్డులు, వాచ్మెన్లు, అటెండర్లు, కార్యాలయంలో పనిచేసే సిబ్బంది సైతం తమ బంధువులని చెప్పి లైసెన్స్ కోసం వచ్చిన వారి నుంచి డబ్బులు తీసుకుని లైసెన్స్ మంజూరు చేయిస్తున్నారు. సీసీ కెమెరాల సాక్షిగా.. రవాణా కార్యాలయంలో జరిగే లావాదేవీలు సక్రమంగా జరిగేలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇదే కోవలో డ్రైవింగ్ లైసెన్స్‌ల జారీ తప్పు దోవపట్టకుండా ఉండేందుకు ట్రాక్‌లో కూడా సీసీ కెమెరాలు బిగించారు. ప్రతి రోజూ రవాణాశాఖ ఉన్నతాధికారి సీసీ కెమెరాలను పర్యవేక్షించాల్సిఉంటుంది. కానీ సీసీ కెమెరాల సాక్షిగా అడ్డగోలు లైసెన్స్‌లను జారీ చేస్తున్నా సంబంధిత ఉన్నతాధికారి మిన్నకుండడంపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. అడ్డగోలు లైసెన్స్‌ల జారీ విషయంలో ఉన్నతాధికారికి ముడుపులు అందుతుండడంతోనే చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా రహదారి ప్రమాదాలను నివారించేందుకు ప్రమాణాలతో కూడిన లైసెన్స్‌లను జారీ చేయాలని పలువురు కోరుతున్నారు. లైసెన్స్ జారీలో ఎలాంటి అక్రమాలకు తావులేదు వాహనం నడిపే ప్రతి ఒక్కరికీ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలి. ఎలాంటి అక్రమాలకు తావులేకుండా లైసెన్స్ జారీ చేస్తాం. వాహనం నడపకుండా లైసెన్స్‌లు జారీ చేయడం నిబంధనలకు విరుద్ధం. ఆ విధంగా ఏఅధికారైనా లైసెన్స్ జారీ చేస్తే చర్యలు తీసుకుంటాం. డ్రైవింగ్ లైసెన్స్‌కు వచ్చే ప్రతి ఒక్కరూ వాహనాన్ని నడపాల్సిందే. అలాంటి వారికే లైసెన్స్ జారీ చేస్తాం.– ఎన్.శివరాంప్రసాద్, ఉప రవాణా కమిషనర్, రవాణాశాఖ -
రోడ్డు ప్రమాదాలకు ‘లైసెన్స్’
దేశ వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల్లో ఏటా లక్ష మంది ప్రాణాలు కోల్పోతున్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడపటం, రోడ్డు నిబంధనలు, డ్రైవింగ్ నియమాలు తెలియకపోవడం వల్లే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని అందరూ భావిస్తుంటారు. అయితే, గతేడాది (2017) జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 80 శాతం ప్రమాదాలకు కారకులు డ్రైవింగ్ లైసెన్సు ఉన్న వారేనని తాజా అధ్యయనంలో తేలింది. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. 2019 నుంచి దేశ వ్యాప్తంగా ఒకే విధమైన డ్రైవింగ్ లైసెన్సులు జారీ చేసేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తోంది. అయితే, డ్రైవింగ్ లైసెన్సు నిబంధనలను కచ్చితంగా పాటించడం, ఆర్టీఏ కార్యాలయాల్లో దళారుల వ్యవస్థను నిర్మూలించడం జరగకపోతే ఎన్ని చర్యలు తీసుకున్నా ఉపయోగం ఉండదని సేవ్‌లైవ్ ఫౌండేషన్ సీఈవో పీయూష్ తివారి హెచ్చరించారు. చట్టంలో ఉన్న లొసుగుల ఆధారంగా అనర్హులు కూడా డ్రైవింగ్ లైసెన్సులు ‘కొనేస్తున్నార’ని ఆందోళన వ్యక్తం చేశారు. తాజా సర్వే ప్రకారం... 2017లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 80శాతం ప్రమాదాలకు డ్రైవింగ్ లైసెన్సు ఉన్న వారే కారణం. దేశంలో డ్రైవింగ్ లైసెన్సు పొందిన వారిలో 59శాతం మంది ఒక్క పరీక్షకు కూడా హాజరు కాలేదు. దేశంలో 25 శాతం మందికి ఒకటి కంటే ఎక్కువ డ్రైవింగ్ లైసెన్సులు ఉన్నాయి. డ్రైవింగ్ లైసెన్సు ఉన్న వారిలో రోడ్డు నిబంధనలు తెలిసిన వారు 12 శాతం కంటే తక్కువే. చాలామంది ఎలాంటి పరీక్షలకు హాజరు కాకుండానే దళారులకు 3,4 వేలు చెల్లించి డ్రైవింగ్ లైసెన్సు పొందుతున్నారనీ, అలాంటి వారి చేతిలో వాహనం పిచ్చివాడి చేతిలో రాయిలా మారుతుందని పీయూష్ ఆందోళన వ్యక్తం చేశారు. డ్రైవింగ్ లైసెన్సు నిబంధనలను కచ్చితంగా అమలు పరచాలని ఇందుకోసం పాస్‌పోర్టు సేవా కేంద్రాల తరహాలో లైసెన్స్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. కొన్ని రాష్ట్రాల్లో వాహనాల ఫిట్నెస్ను పరీక్షించడానికి ఆటోమేటిక్ యంత్రాలు ఏర్పాటు చేస్తున్నారని, డ్రైవింగ్ లైసెన్సు పరీక్షలకు కూడా ఇలాంటి యంత్రాలను ఏర్పాటు చేస్తే లోపాలకు ఆస్కారం ఉండదని ఆయన అన్నారు. -
ఆర్టీఓ ఆఫీస్‌లో దళారుల హవా
వారి గుప్పిట్లో కార్యాలయ సిబ్బంది నిబంధనల పేరుతో ఇబ్బందులు దళారుల చెంతకు వాహనదారులు రవాణా సేవల కోసం వస్తే జేబుకు చిల్లులే.. సాక్షి, హన్మకొండ : జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో జోడు గుర్రాల సవారీ నడుస్తోంది. కార్యాలయ సిబ్బంది, దళారులు ‘కలిసి మెలిసి’ పని చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలు తు.చ. తప్పకుండా పాటిస్తున్నామని పైకి చెబుతూనే లోపాయికారిగా దళారులకు సహకరిస్తున్నారు. వీరి మధ్య నెలకొన్న అన్యోన్యత కారణంగా డ్రైవింగ్ లైసెన్సు, వాహనాల రిజిస్ట్రేషన్, పర్మిట్ తదితర పనుల కోసం వెళ్తున్న సామాన్యులు, వాహనదారుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. తారుమారు ‘జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో దళారులకు ప్రవేశం లేదు. ఎవరైనా కనిపిస్తే నేరుగా పోలీస్‌స్టేçÙన్కు పంపిస్తాం. రవాణాశాఖ కార్యాలయానికి కనీసం కిలోమీటరు దూరంలో ఆర్టీఏ ఏజెంట్ల కార్యాలయాలు ఉండాలి’.. ఇది ఏడాది క్రితం రవాణాశాఖ కార్యాలయంలో విధించిన నిబంధన. దీంతో ఇక దళారుల బెడద తప్పినట్టేనని సామాన్యులు, వాహనదారులు ఊపరి పీల్చుకున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పనులు చేయించుకున్నారు. అయితే గడిచిన ఆర్నెళ్లలో పరిస్థితి తారుమారైంది. దళారులు మళ్లీ రంగప్రవేశం చేశారు. కార్యాలయంలో పని చేస్తున్న ఉద్యోగులతో కలిసిమెలిసి తిరుగుతున్నారు. వివిధ పనులపై కార్యాలయానికి వచ్చిన వారికి నిబంధనల పేరుతో చుక్కలు చూపిస్తున్నారు. ఆ ధాటికి తట్టుకోలేక వాహనదారులు దళారులను ఆశ్రయించక తప్పడం లేదు. దళారుల దగ్గరికి వెళ్లిన వాహనదారులు నిరే్ధశించిన ఫీజు కంటే రెండు..మూడు రెట్లు.. అవసరాన్ని బట్టి పది రెట్లు చెల్లించాల్సి వస్తోంది. జీరో నుంచి మొదలు.. లైసెన్స్, రిజిసే్ట్రషన్ తదితర సేవలు పొందాలంటే తొలుత ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకోవాలి. ఈ సందర్భంగా ఆన్లైన్లో వివరాలు నమోదు చేయాలి. నిరే్ధశించిన రోజు సంబంధిత ధ్రువపత్రాలతో ఆర్టీఏ కార్యాలయంలో దరఖాస్తు చేయాలి. ఈ దరఖాస్తులను పరిశీలించేందుకు జిల్లా రవాణాశాఖ కార్యాలయంలో మొత్తం ఎనిమిది కౌంటర్లు ఉన్నాయి. వీటిని జీరో కౌంటర్లు అంటారు. అయితే దళారులను సంప్రదించకుండా ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ నేరుగా ఇక్కడికి వచ్చేవారికి చుక్కలు కనిపిస్తున్నాయి. జీరో కౌంటర్లలో పని చేస్తున్న సిబ్బంది ‘ఆధార్‌కార్డు జిరాక్సులో ఫొటో సరిగా కనిపించడం లేదు, చేతిరాత బాగాలేదు, ఇంటి నంబరు కరెక్టుగా లేద’ంటూ వివిధ కారణాలతో దరఖాస్తులను తిరస్కరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దళారుల ద్వారా వచ్చే దరఖాస్తులు చిటికెలో ఆమోదం పొందుతున్నాయి. దీంతో సిబ్బంది తీరుతో వేగలేక దళారులను ఆశ్రయిస్తున్నట్లు వాహనదారులు చెబుతున్నారు. మొత్తం ఎనిమిది జీరో కౌంటర్లు ఉండగా ప్రస్తుతం ఆరు కౌంటర్ల వద్దకు దళారులు నేరుగా వచ్చి దరఖాస్తులు కుప్పలుగా ఇచ్చి పనులు చక్కబెట్టుకుంటున్నారు. కాలక్రమేణా ఒక్కో కౌంటర్‌కు ఒక్కో దళారీగా పర్మినెంట్ అయిపోవడం ఇక్కడి నెలకొన్న అవినీతికి నిదర్శనంగా నిలుస్తోంది. ఆఖరిలో చెల్లింపులు.. జీరో కౌంటర్ గండం తప్పించుకున్న తర్వాత డ్రైవింగ్ టెస్టు, కంప్యూటర్ టెస్టు, వాహనం ఫిట్నెస్ తదితర పరీక్షలకు దరఖాస్తుదారులు హాజరు కావాలి. ఇక్కడ ఉత్తీర్ణులైన తర్వాత తిరిగి అడ్మినిస్ట్రేషన్ వింగ్‌కు దరఖాస్తులు చేరుకుంటాయి. అయితే ఇక్కడున్న సిబ్బందిని సైతం దళారులు తమ అజమాయిషీలో పెట్టుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దళారుల ద్వారా వెళ్లిన దరఖాస్తులు ఇక్కడ వెనువెంటనే చివరి దశకు చేరుకుంటాయి. లేని పక్షంలో ఏ కారణం లేకుండానే రోజుల తరబడి పెండింగ్‌లో ఉండిపోతాయనే విమర్శ పరిపానల విభాగంపై ఉంది. దళారులను ఆశ్రయించకుంటే 90 శాతం దరఖాస్తులకు పెండింగ్ గతి పడుతుందని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తడిసిమోపెడు.. తమకు సహకరించిన రవాణాశాఖ సిబ్బందికి దళారులు పెద్ద మొత్తంలో ముట్టచెబుతున్నట్లు సమాచారం. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం.. డ్రైవింగ్ లైసెన్సుకు ఆమోదముద్ర వేసినందుకు ఒక్కో దరఖాస్తుకు జీరో కౌంటరు సిబ్బందికి రూ.100, పరిపాలన విభాగం సిబ్బందికి రూ. 200 ముట్టచెబుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వాహనాల రిజిసే్ట్రషన్‌కైతే ఒక్కో దరఖాస్తుకు జీరో కౌంటరులో రూ. 700, పరిపాలన విభాగంలో రూ. 1500 చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చెల్లింపులకు తమ కమీషన్లు కలుపుకుని దళారులు వాహనదారుల వద్ద నుంచి భారీగా డబ్బు వసూలు చేస్తున్నారు. ఉదాహరణకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం టూ వీలర్ లెర్నింగ్ లైసెన్సు (సింగిల్ కేటగిరి)కు రూ. 60 చెల్లిస్తే సరిపోతుంది. కానీ దళారులు రూ. 2000 వరకు వసూలు చేస్తున్నారు. దీంతో సామాన్యుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. జిల్లా రవాణాశాఖ కార్యాలయానికి సగటున ప్రతిరోజు 600 దరఖాస్తులు వస్తున్నాయి. అంటే ఇక్కడ నిత్యం లక్షలాది రూపాయల ప్రజల సొమ్ము లంచాల రూపంలోకి మారుతోంది. రోజు వందల మంది నష్టపోతున్నా పట్టించుకునేవారు కరువయ్యారు.