పైసలిస్తే లైసెన్స్‌..! | License Issues With out Tests in Nellore RTO office | Sakshi
Sakshi News home page

పైసలిస్తే లైసెన్స్‌..!

Published Wed, Dec 19 2018 1:33 PM | Last Updated on Wed, Dec 19 2018 1:33 PM

License Issues With out Tests in Nellore RTO office - Sakshi

పేర్లు నమోదు చేసుకుంటున్న వాహనదారులు

నెల్లూరు(టౌన్‌): ఇక్కడ అనధికారిక ఏజంట్లదే రాజ్యం.. వీరి ముందు నిబంధనలు బలాదూర్‌.. అడిగినంత పైసలిస్తే ఎలాంటి లైసెన్స్‌లైనా క్షణాల్లో ఇప్పించేస్తారు. అంతా ఆన్‌లైన్‌ అంటారు..కానీ వ్యవహారమంతా ఆఫ్‌లైన్‌లోనే నడుస్తోంది. దీనికి కొంతమంది అధికారులు సహకారమందిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ తతంగమంతా రవాణాశాఖ కార్యాలయం కేంద్రంగా నడుస్తోంది. ద్విచక్ర, భారీ వాహనాలకు డ్రైవింగ్‌ లైసెన్స్‌లు జారీ చేయాలంటే చాలా నిబంధనలు ఉన్నాయి. పైసలిస్తే ఎలాంటి టెస్ట్‌ లేకుండానే లైసెన్స్‌లు వచ్చేస్తున్నాయి. ఈ దందాకు  అనధికార ఏజెంట్లతోపాటు కొంతమంది మీడియా సిబ్బంది, హోంగార్డులు, రవాణా అధికారుల డ్రైవర్లు రవాణా కార్యాలయం వద్ద కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల ఓ ఎంవీఐ 113 లైసెన్స్‌లకు వేలిముద్ర వేయించి ఓకే చేశారు. అయితే ఈ విషయంపై ఓ అజ్ఞాత వ్యక్తి డీటీసీకి ఫోన్‌ చేశారు. ఈ నేపథ్యంలో ఆయన స్వయంగా పరిశీలించి అందరికీ డ్రైవింగ్‌ టెస్ట్‌ నిర్వహించాలని నిర్ణయించారు.డీటీసీనే ట్రాక్‌ వద్దకు వచ్చి టెస్ట్‌ను నిర్వహించడంతో కేవలం 53 మంది మాత్రమే ట్రైల్‌ వేసేందుకు ముందుకువచ్చారు. లైసెన్స్‌ కోసం దరఖాస్తు చేసుకున్న మిగిలిన అభ్యర్థులు ట్రైల్‌ వేసేందుకు ముందుకు రాకపోవడంతో వారందరినీ ఫెయిల్‌ చేశారు.

ఇది ఒక ఉదాహరణ మాత్రమే..
బైకు, కారుకు లైసెన్స్‌ పొందాలంటే తొలుత ఎల్‌ఎల్‌ఆర్‌ పొందాల్సి ఉంటుంది. ఎల్‌ఎల్‌ఆర్‌ పొందిన నెల తరువాత, 6 నెలలు లోపు శాశ్వత లైసెన్స్‌కు దరఖాస్తు చేసుకోవాలి. లైసెన్స్‌ పొందేందుకు ముందుగా శ్లాట్‌ బుక్‌ చేసుకోవాలి. బైక్, కారుకు ప్రభుత్వ చలానా రూ.1350 చెల్లించాల్సి ఉంటుంది. ఆ చలానాతో శ్లాట్‌లో వచ్చిన తేదీ, సమయం ప్రకారం రవాణాశాఖ కార్యాలయంలో డ్రైవింగ్‌ టెస్ట్‌కు హాజరు కావాల్సిఉంటుంది. దరఖాస్తులు వచ్చిన ప్రకారం డ్రైవింగ్‌ ట్రాక్‌ వద్ద వేలిముద్ర వేసి బైక్, కారు డ్రైవింగ్‌ చేయాల్సిఉంది. ఆ తరువాత సీరియల్‌ ఆధారంగా ఒకరి తరువాత మరొకరు వేలిముద్ర వేసి డ్రైవింగ్‌ టెస్ట్‌చేయాల్సిఉంది. సక్రమంగా డ్రైవింగ్‌ చేసిన వారికి టెస్ట్‌ను పర్యవేక్షిస్తున్న ఎంవీఐ లైసెన్స్‌ను ఓకే చేస్తారు. సెల్‌ఫోన్‌కు సంక్షిప్త సమాచారాన్ని పంపుతారు. ఆ తరువాత లైసెన్స్‌ను పోస్టుద్వారా వ్యక్తి అడ్రస్‌కు పంపుతారు.

లైసెన్స్‌కు రూ.2500 వసూలు
కారు నడపడం రాకపోయినా డబ్బులు తీసుకుని నిబంధనలకు విరుద్ధంగా లైసెన్స్‌లు జారీ చేస్తున్నారు. కొంతమంది మొక్కుబడిగా బైక్‌ నడిపి కారుకు కూడా లైసెన్స్‌ పొందుతున్నారు. మరి కొంతమంది కేవలం వేలిముద్ర వేసి లైసెన్స్‌ పొందుతున్నారు. ఈ రీతిలో లైసెన్స్‌ జారీ చేసినందుకు ప్రభుత్వ చలానా కన్నా అదనంగా రూ.2500 వసూలు చేస్తున్నారు. లైసెన్స్‌ను ఇప్పించేందుకు కొంతమంది దళారుల అవతారం ఎత్తారు. అనధికార ఏజెంట్లు వ్యక్తి నుంచి అదనంగా డబ్బులు తీసుకుని ఫాం 4 అవసరం లేకపోయినా ఎంవీఐకి గుర్తుగా లైసెన్స్‌ కోసం దాఖలు చేస్తారు. ఫాం 4 ఆధారంగా సాయంత్రం సమయంలో అనధికార ఏజెంట్ల నుంచి నుంచి రవాణా సిబ్బంది డబ్బులు వసూలు చేయడం పరిపాటిగా మారింది. ఈ నేపథ్యంలో కారు డ్రైవింగ్‌ రాకపోయినా ప్రతిరోజూ పదుల సంఖ్యలో లైసెన్స్‌లు జారీ చేయడం గమనార్హం.

లైసెన్స్‌ ఇప్పించేందుకు దళారుల క్యూ
రవాణాశాఖ అధికారులు డబ్బులు తీసుకుని డ్రైవింగ్‌ లైసెన్స్‌ జారీ చేస్తుండడంతో కొంతమంది దళారులు రవాణా కార్యాలయానికి క్యూ కట్టారు. ముందుగానే లైసెన్స్‌ జారీ చేసే సంబంధిత అధికారితో ఒప్పందం కుదుర్చుకుని లైసెన్స్‌ కోసం వచ్చిన వ్యక్తి నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారు. ఈ విషయం డీటీసీ తనిఖీల్లో తేటతెల్లమైంది. అనధికార ఏజెంట్లతోపాటు కొంతమంది మీడియా సిబ్బంది డబ్బులు తీసుకుని లైసెన్స్‌ ఇప్పించేందుకు రవాణాశాఖ కార్యాలయం వద్ద తిష్టవేశారు. మీడియా పేరు చెబుతుండడంతో సంబంధిత అధికారులు ఎలాంటి టెస్ట్‌ లేకుండానే లైసెన్స్‌లు జారీ చేస్తున్నారు. ఇదే కోవలో హోంగార్డులు, వాచ్‌మెన్‌లు, అటెండర్లు, కార్యాలయంలో పనిచేసే సిబ్బంది సైతం తమ బంధువులని చెప్పి లైసెన్స్‌ కోసం వచ్చిన వారి నుంచి డబ్బులు తీసుకుని లైసెన్స్‌ మంజూరు చేయిస్తున్నారు.

సీసీ కెమెరాల సాక్షిగా..
రవాణా కార్యాలయంలో జరిగే లావాదేవీలు సక్రమంగా జరిగేలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇదే కోవలో డ్రైవింగ్‌ లైసెన్స్‌ల జారీ తప్పు దోవపట్టకుండా ఉండేందుకు ట్రాక్‌లో కూడా సీసీ కెమెరాలు బిగించారు. ప్రతి రోజూ రవాణాశాఖ ఉన్నతాధికారి సీసీ కెమెరాలను పర్యవేక్షించాల్సిఉంటుంది. కానీ సీసీ కెమెరాల సాక్షిగా అడ్డగోలు లైసెన్స్‌లను జారీ చేస్తున్నా సంబంధిత ఉన్నతాధికారి మిన్నకుండడంపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. అడ్డగోలు లైసెన్స్‌ల జారీ విషయంలో ఉన్నతాధికారికి ముడుపులు అందుతుండడంతోనే చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా రహదారి ప్రమాదాలను నివారించేందుకు ప్రమాణాలతో కూడిన లైసెన్స్‌లను జారీ చేయాలని పలువురు కోరుతున్నారు.

లైసెన్స్‌ జారీలో ఎలాంటి అక్రమాలకు తావులేదు
వాహనం నడిపే ప్రతి ఒక్కరికీ లైసెన్స్‌ తప్పనిసరిగా ఉండాలి. ఎలాంటి అక్రమాలకు తావులేకుండా లైసెన్స్‌ జారీ చేస్తాం. వాహనం నడపకుండా లైసెన్స్‌లు జారీ చేయడం నిబంధనలకు విరుద్ధం. ఆ విధంగా ఏఅధికారైనా లైసెన్స్‌ జారీ చేస్తే చర్యలు తీసుకుంటాం. డ్రైవింగ్‌ లైసెన్స్‌కు వచ్చే ప్రతి ఒక్కరూ వాహనాన్ని నడపాల్సిందే. అలాంటి వారికే లైసెన్స్‌ జారీ చేస్తాం.– ఎన్‌.శివరాంప్రసాద్, ఉప రవాణా కమిషనర్, రవాణాశాఖ

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement