ఆర్‌టీఓ ఆఫీస్‌లో దళారుల హవా | dominant mediums RTO office | Sakshi
Sakshi News home page

ఆర్‌టీఓ ఆఫీస్‌లో దళారుల హవా

Published Mon, Sep 12 2016 12:06 AM | Last Updated on Mon, Sep 4 2017 1:06 PM

ఆర్‌టీఓ ఆఫీస్‌లో దళారుల హవా

ఆర్‌టీఓ ఆఫీస్‌లో దళారుల హవా

  • వారి గుప్పిట్లో కార్యాలయ సిబ్బంది
  • నిబంధనల పేరుతో ఇబ్బందులు
  • దళారుల చెంతకు వాహనదారులు
  • రవాణా సేవల కోసం వస్తే జేబుకు చిల్లులే..
  • సాక్షి, హన్మకొండ : జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో జోడు గుర్రాల సవారీ నడుస్తోంది. కార్యాలయ సిబ్బంది, దళారులు ‘కలిసి మెలిసి’ పని చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలు తు.చ. తప్పకుండా పాటిస్తున్నామని పైకి చెబుతూనే లోపాయికారిగా దళారులకు సహకరిస్తున్నారు. వీరి మధ్య నెలకొన్న అన్యోన్యత కారణంగా డ్రైవింగ్‌ లైసెన్సు, వాహనాల రిజిస్ట్రేషన్, పర్మిట్‌ తదితర పనుల కోసం వెళ్తున్న సామాన్యులు, వాహనదారుల జేబులకు చిల్లులు పడుతున్నాయి.
     
    తారుమారు
    ‘జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో దళారులకు ప్రవేశం లేదు. ఎవరైనా కనిపిస్తే నేరుగా పోలీస్‌స్టేçÙన్‌కు పంపిస్తాం. రవాణాశాఖ కార్యాలయానికి కనీసం కిలోమీటరు దూరంలో ఆర్టీఏ ఏజెంట్ల కార్యాలయాలు ఉండాలి’.. ఇది ఏడాది క్రితం రవాణాశాఖ కార్యాలయంలో విధించిన నిబంధన. దీంతో ఇక దళారుల బెడద తప్పినట్టేనని సామాన్యులు, వాహనదారులు ఊపరి పీల్చుకున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పనులు చేయించుకున్నారు. అయితే గడిచిన ఆర్నెళ్లలో పరిస్థితి తారుమారైంది. దళారులు మళ్లీ రంగప్రవేశం చేశారు. కార్యాలయంలో పని చేస్తున్న ఉద్యోగులతో కలిసిమెలిసి తిరుగుతున్నారు. వివిధ పనులపై కార్యాలయానికి వచ్చిన వారికి నిబంధనల పేరుతో చుక్కలు చూపిస్తున్నారు. ఆ ధాటికి తట్టుకోలేక వాహనదారులు దళారులను ఆశ్రయించక తప్పడం లేదు. దళారుల దగ్గరికి వెళ్లిన వాహనదారులు నిరే్ధశించిన ఫీజు కంటే  రెండు..మూడు రెట్లు.. అవసరాన్ని బట్టి పది రెట్లు చెల్లించాల్సి వస్తోంది.
     
    జీరో నుంచి మొదలు..
    లైసెన్స్, రిజిసే్ట్రషన్‌ తదితర సేవలు పొందాలంటే తొలుత ఆన్‌లైన్‌లో స్లాట్‌ బుక్‌ చేసుకోవాలి. ఈ సందర్భంగా ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేయాలి. నిరే్ధశించిన రోజు సంబంధిత ధ్రువపత్రాలతో ఆర్టీఏ కార్యాలయంలో దరఖాస్తు చేయాలి. ఈ దరఖాస్తులను పరిశీలించేందుకు జిల్లా రవాణాశాఖ కార్యాలయంలో మొత్తం ఎనిమిది కౌంటర్లు ఉన్నాయి. వీటిని జీరో కౌంటర్లు అంటారు. అయితే దళారులను సంప్రదించకుండా ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ నేరుగా ఇక్కడికి వచ్చేవారికి చుక్కలు కనిపిస్తున్నాయి. జీరో కౌంటర్లలో పని చేస్తున్న సిబ్బంది ‘ఆధార్‌కార్డు జిరాక్సులో ఫొటో సరిగా కనిపించడం లేదు, చేతిరాత బాగాలేదు, ఇంటి నంబరు కరెక్టుగా లేద’ంటూ వివిధ కారణాలతో  దరఖాస్తులను తిరస్కరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దళారుల ద్వారా వచ్చే దరఖాస్తులు చిటికెలో ఆమోదం పొందుతున్నాయి. దీంతో సిబ్బంది తీరుతో వేగలేక దళారులను ఆశ్రయిస్తున్నట్లు వాహనదారులు చెబుతున్నారు. మొత్తం ఎనిమిది జీరో కౌంటర్లు ఉండగా ప్రస్తుతం ఆరు కౌంటర్ల వద్దకు దళారులు నేరుగా వచ్చి దరఖాస్తులు కుప్పలుగా ఇచ్చి పనులు చక్కబెట్టుకుంటున్నారు. కాలక్రమేణా ఒక్కో కౌంటర్‌కు ఒక్కో దళారీగా పర్మినెంట్‌ అయిపోవడం ఇక్కడి నెలకొన్న అవినీతికి నిదర్శనంగా నిలుస్తోంది.
     
    ఆఖరిలో చెల్లింపులు..
    జీరో కౌంటర్‌ గండం తప్పించుకున్న తర్వాత డ్రైవింగ్‌ టెస్టు, కంప్యూటర్‌ టెస్టు, వాహనం ఫిట్‌నెస్‌ తదితర పరీక్షలకు దరఖాస్తుదారులు హాజరు కావాలి. ఇక్కడ ఉత్తీర్ణులైన తర్వాత తిరిగి అడ్మినిస్ట్రేషన్‌ వింగ్‌కు దరఖాస్తులు చేరుకుంటాయి. అయితే ఇక్కడున్న సిబ్బందిని సైతం దళారులు తమ అజమాయిషీలో పెట్టుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దళారుల ద్వారా వెళ్లిన దరఖాస్తులు ఇక్కడ వెనువెంటనే చివరి దశకు చేరుకుంటాయి. లేని పక్షంలో ఏ కారణం లేకుండానే రోజుల తరబడి పెండింగ్‌లో ఉండిపోతాయనే విమర్శ పరిపానల విభాగంపై ఉంది. దళారులను ఆశ్రయించకుంటే  90 శాతం దరఖాస్తులకు పెండింగ్‌ గతి పడుతుందని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
     
    తడిసిమోపెడు..
    తమకు సహకరించిన రవాణాశాఖ సిబ్బందికి దళారులు పెద్ద మొత్తంలో ముట్టచెబుతున్నట్లు సమాచారం. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం.. డ్రైవింగ్‌ లైసెన్సుకు ఆమోదముద్ర వేసినందుకు ఒక్కో దరఖాస్తుకు జీరో కౌంటరు సిబ్బందికి రూ.100, పరిపాలన విభాగం సిబ్బందికి రూ. 200 ముట్టచెబుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వాహనాల రిజిసే్ట్రషన్‌కైతే ఒక్కో దరఖాస్తుకు జీరో కౌంటరులో రూ. 700, పరిపాలన విభాగంలో రూ. 1500 చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చెల్లింపులకు తమ కమీషన్లు కలుపుకుని దళారులు వాహనదారుల వద్ద నుంచి భారీగా డబ్బు వసూలు చేస్తున్నారు. ఉదాహరణకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం టూ వీలర్‌ లెర్నింగ్‌ లైసెన్సు (సింగిల్‌ కేటగిరి)కు రూ. 60 చెల్లిస్తే సరిపోతుంది. కానీ దళారులు రూ. 2000 వరకు వసూలు చేస్తున్నారు. దీంతో సామాన్యుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. జిల్లా రవాణాశాఖ కార్యాలయానికి సగటున ప్రతిరోజు 600 దరఖాస్తులు వస్తున్నాయి. అంటే ఇక్కడ నిత్యం లక్షలాది రూపాయల ప్రజల సొమ్ము లంచాల రూపంలోకి మారుతోంది. రోజు వందల మంది నష్టపోతున్నా పట్టించుకునేవారు కరువయ్యారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement